ఒక్కడిగా వచ్చి.. జనాభిమానం గెలిచి.. | YS Jagan Mohan Reddy Swearing in ceremony Special Story | Sakshi
Sakshi News home page

జిల్లాలోనే 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర

Published Thu, May 30 2019 1:38 PM | Last Updated on Thu, May 30 2019 1:38 PM

YS Jagan Mohan Reddy Swearing in ceremony Special Story - Sakshi

సాక్షి ప్రతినిధి, కాకినాడ: ఒక్కడు.. ఒకే ఒక్కడు.. ఒంటరిగానే వచ్చాడు. ఒంటరిగానే పోరాడాడు. ఒంటరిగానే గెలిచాడు. నిక్కచ్చిగా, నిష్కర్షగా అడుగులు వేశాడు. యువ నాయకుడు జన నాయకుడయ్యారు. ఒంటి చేత్తో పార్టీని గెలిపించారు. ఆయనే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరిది. 2009లో మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి తనయుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టిన వైఎస్‌ జగన్‌ తన పదేళ్ల రాజకీయ ప్రస్థానంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్నారు. తండ్రి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారి కుటుంబాల కోసం ఇచ్చిన మాటను నిలబెట్టుకొనేందుకు.. కాంగ్రెస్‌ అధిష్టానాన్ని సైతం ధిక్కరించి ఓదార్పుయాత్ర చేశారు. తనను నమ్మిన వారి కోసం కాంగ్రెస్‌ పార్టీని త్రుణప్రాయంగా వదిలేశారు.

ఆపై కాంగ్రెస్, టీడీపీ నాయకులు కుమ్మక్కై పెట్టిన అక్రమ కేసులను దీటుగా ఎదుర్కొన్నారు. ఎన్నో ఒడుదొడుకుల మధ్య జరిగిన 2014 ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో పార్టీ ఓటమి చవిచూసినా వెరవలేదు. ఎన్నికల్లో గెలిచిన వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్యేలను టీడీపీ ప్రలోభాలు పెట్టి లాక్కున్నా వెనక్కి తగ్గలేదు. రకరకాల దుష్ప్రచారాలు చేసినా కుంగిపోలేదు. ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఇబ్బందులు ఎదురైనా అంతే  ఓర్పుగా, అంతే నేర్పుగా నెగ్గుకొచ్చారు. ధీరోదాత్తుడిగా ముందుకు సాగారు. రాష్ట్ర విభజన సమయంలో సమైక్యాంధ్ర కోసం, రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రత్యేక హోదా కోసం గళం వినిపించారు. మొత్తానికి వైఎస్‌ కొడుకు నుంచి ఏపీ సీఎంగా ఆయన ఎదిగిన తీరు అద్భుతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో లక్ష్యం దిశగానే సాగారు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా.. లక్ష్యాన్ని మాత్రం విడిచిపెట్టొద్దు. సాధించాలనే తపన, తగిన కార్యాచరణ తోడైతే తప్పక విజయం సిద్ధిస్తుందని చెప్పడానికి వైఎస్‌ జగన్‌ పదేళ్ల రాజకీయ ప్రస్థానమే నిదర్శనం.

ఆయనొక ఆదర్శం. యువతకు స్ఫూర్తి. పోరాడితే లక్ష్యం తప్పక సిద్ధిస్తుందని నిరూపించిన వ్యక్తి ఆయన. ఆటుపోట్లు ఎదుర్కొని, కష్టాలను అధిగమించి, ప్రతికూల పరిస్థితులను దాటి ఎలా విజయం సాధించవచ్చనే విషయాన్ని  జగన్‌ రుజువు చేశారు. ఇప్పుడందరికీ రోల్‌ మోడల్‌ అయ్యారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన నేతగా చరిత్రకెక్కారు. నవ్యాంధ్ర రెండో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మన జిల్లాతో ఎంతో అనుబంధం ఉంది. ఆయన వేసిన అడుగులు ఇక్కడ ఎన్నో ఉన్నాయి.

జగ్గంపేటలో పార్టీ ప్రకటన
ఓదార్పుయాత్ర నేపథ్యంలోనే కాంగ్రెస్‌ను విడిచిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొత్తగా పెట్టబోయే పార్టీ పేరును మన జిల్లాలోనే 2011 మార్చి 11న ప్రకటించారు. జ్యోతుల నెహ్రూ, పెండెం దొరబాబు, వాసిరెడ్డి పద్మ వంటి నేతలు పార్టీలో చేరిన సందర్భంగా జగ్గంపేటలో నిర్వహించిన బహిరంగ సభలో వైఎస్సార్‌ సీపీ పేరుతో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఇక్కడే జెండా రంగులు కూడా తెలియజేశారు. పార్టీ పెట్టాల్సిన అవశ్యకతను జగ్గంపేట నుంచి రాష్ట్ర ప్రజలకు వివరించారు.

కష్టాల్లో...
2014 జూన్‌ 6న నగరంలో గ్యాస్‌పైపు పేలిన ఘటనలో చనిపోయిన 22 మంది కుటుంబాలను పరామర్శించేందుకు వచ్చారు.
2015 జూలై 14న పుష్కరాల తొక్కిసలాట ఘటనలో 29 మంది చనిపోగా, 52 మందికి గాయాలయ్యాయి. వీరి కుటుంబాలను పరామర్శించేందుకు రాజమహేంద్రవరం వచ్చారు.
2015 అక్టోబర్‌ 25న తొండంగి మండలం పెరుమాళ్లపురంలో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారని తెలుసుకుని హుటాహుటిన వచ్చారు. వారి కుటుంబాలను పరామర్శించారు.
రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని చింతూరు మండలం మామిళ్లగూడెం, వీఆర్‌ పురం మండలం అన్నవరంలో కాళ్లవాపు వ్యాధితో చనిపోయిన 16 మంది కుటుంబీకులను 2015 డిసెంబర్‌ 8న వైఎస్‌ జగన్‌ పరామర్శించారు.
2016 ఆగస్టు 12న ఉప్పలగుప్తం మండలం సూదాపాలెంలో గోవధ చేశారని దళితులపై జరిగిన దాడి నేపథ్యంలో గాయపడ్డ బాధితులను పరామర్శించేందుకు వచ్చారు.
2017 జూలై ఒకటిన రంపచోడవరం ఏజెన్సీ పరిధిలోని చాపరాయిలో విషజ్వరాలతో 16 మంది వరకు చనిపోయారు. పరిస్థితి ఆందోళనకరంగా ఉందని గ్రహించిన వైఎస్‌ జగన్‌ జ్వరాలతో బాధపడుతున్న బాధితులను, మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు జూన్‌ 30న కాకినాడ వచ్చారు. అక్కడి నుంచి నేరుగా రంపచోడవరం వెళ్లి రాత్రి బస చేసి తెల్లవారు జామున ప్రమాదకరమైన ప్రయాణం చేసి చాపరాయికి వెళ్లి బాధితులను పరామర్శించారు.

జిల్లాలోనే 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర
తూర్పుగోదావరి జిల్లాలో జగన్‌ 50 రోజుల సుదీర్ఘ పాదయాత్ర చేశారు.   412 కిలోమీటర్లు నడిచిన ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పట్టారు. జూన్‌ 12న పశ్చిమగోదావరి జిల్లా నుంచి రోడ్డు కం రైల్వే వంతెన మీదుగా  రాజమహేంద్రవరంలోకి ప్రజాసంకల్పయాత్ర ప్రవేశించింది. అఖండ గోదావరిపై చారిత్రాత్మకంగా నిలిచిపోయేలా జగన్‌కు అపూర్వ స్వాగతం లభించింది. అక్కడి నుంచి కాటన్‌ బ్యారేజీ, కోనసీమలోని పచ్చని పల్లెల మీదుగా మధ్య డెల్టా, మెట్ట ప్రాంతాల మధ్య పాదయాత్ర సాగించారు. ఏజెన్సీకి సమీపంలో ఉన్న జగ్గంపేట, ప్రత్తిపాడు, తుని నియోజకవర్గాల్లో దుర్భేద్యమైన కొండల మధ్య కూడా పాదయాత్ర చేశారు. పాదయాత్ర పొడవునా జిల్లాలో చోటు చేసుకున్న ఆసక్తికర విషయాలివీ..

జూన్‌13న 188వ రోజు పాదయాత్ర రాజమహేంద్రవరంలో మొదలై కాటన్‌ బ్యారేజ్‌ మీదుగా బొబ్బర్లంక వద్ద కోనసీమలో అడుగు పెట్టారు. అక్కడి నుంచి పేరవరం వరకూ వైఎస్సార్‌ సీపీ పతాకంలోని మువ్వన్నెల్లా మూడు పాయలుగా సాగింది. బాటపై జనవాహిని నడువ జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి...రేపటి సౌభాగ్యానికి భరోసా లాంటి చిరునవ్వుతో నడుస్తుండగా, కుడివైపునున్న సెంట్రల్‌ డెల్టా ప్రధాన కాలువలో ఆయన హామీ ఇచ్చిన నవరత్న పథకాలను చాటే కటౌట్లతో నావలు మెల్ల మెల్లగా అనుసరించాయి. ఇక కాలువకు ఆవలి గట్టునా పోటెత్తిన ప్రజలు మూడో పాయగా ముందుకు సాగారు.
జూన్‌14న ఆత్రేయపురం వద్ద రోడ్డు పక్కన పూతరేకులు తయారు చేస్తున్న మహిళలతో మాట్లాడారు. పూతరేకుల తయారీకి ఉపయోగిస్తున్న కుండ వద్ద కూర్చొని వివరాలు అడిగి తెలుసుకున్నారు. అప్పుడే తయారు చేసిన పూత రేకును రుచి చూశారు. అక్కడే మరికొంతమంది యువతులు జగన్‌కు పూతరేకు తినిపించారు.
జూన్‌ 17వ తేదీన  వెదిరేశ్వరంలో ఆటో డ్రైవర్లు ఇచ్చిన చొక్కాను ధరించారు. కాసేపు ఆటో నడిపారు.
జూన్‌ 26న బిందువు బిందువు కలిసి మహా సింధువైనట్టు అఖాతం అడుగుల నుంచి చిన్నగా బయలుదేరిన అలలు ఉత్సాహాన్నిచ్చే మహా కెరటమై ఎగిసిపడినట్టు.. వైనతేయ గోదావరికి ఆ ఒడ్డున మొదలైన ప్రజాకెరటం. అంతలోనే జనగోదారిగా మారి.. తర్వాత జన ఉప్పెనలా రూపుదాల్చి .. కోనసీమ కేంద్రం అమలాపురాన్ని ముంచెత్తి 200వ రోజు పాదయాత్ర పూర్తి చేసుకుంది.
జూన్‌ 21న రాజోలు నియోజకవర్గంలోని లక్కవరం జంక్షన్‌ వద్దకు చేరుకోగానే 2400 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. ఆ ఊరికి సమీపంలో కొబ్బరి మొక్కను నాటారు.
జూలై 8న  208వ రోజు పాదయాత్ర జరిగిన పసలపూడి వద్ద 2500 కిలోమీటర్ల మైలు రాయిని అధిగమించారు. అదే రోజున వైఎస్సార్‌ జయంతి కావడంతో అభిమానుల మధ్య భారీ కేక్‌ కట్‌ చేశారు.
జూలై 17వ తేదీన కొవ్వాడ రైల్వే ట్రాక్‌ వద్ద భారీగా ఏర్పాటు చేసిన కటౌట్‌ వద్ద కాకినాడ నియోజకవర్గ ప్రజలు స్వాగతం పలికి, ఆకాశమంత అభిమానం చూపించారు.
జూలై 28న పాదయాత్ర సాగిన 100వ నియోజకవర్గంగా జగ్గంపేటలో అడుగు పెట్టారు. అక్కడే కేక్‌ కట్‌ చేశారు. 2600 కిలోమీటర్ల మైలు రాయిని జగ్గంపేటలో అధిగమించారు. ఇక్కడ మొక్క నాటారు.
జూన్‌ 29న కిర్లంపూడి మండలం వీరవరంలో బెల్లం తయారీని పరిశీలించారు. అక్కడ బెల్లం రుచి చూశారు.
ఆగస్టు 1న గొల్లప్రోలులో సాగిన పాదయాత్రలో ప్రజలు  దారి పొడవునా పూలబాట పరిచారు.
ఆగస్టు 7న చేనేత కార్మికుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారితో మమేకమయ్యారు. పలు హామీలు ఇచ్చారు. ఇదే రోజున శంఖవరంలో నాయీ బ్రాహ్మణులు కోరడంతో డోలు వాయించారు.
ఆగస్టు 9న పారుపాక జంక్షన్‌ వద్ద రోడ్డుపై చీరలు పరిచి స్వాగతం పలికారు. ఇక్కడ గిరిజనులు ఇచ్చిన విల్లును ఎక్కుపెట్టారు.
ఆగస్టు 11న తునిలో 2700 కిలోమీటర్ల పాదయాత్ర పూర్తయిన సందర్భంగా మొక్కనాటి నీరు పోశారు. ఇదే రోజున తుని పాదయాత్రలోరోజా పూలతో అభిమానులు ముంచెత్తారు.చెప్పాలంటే కురిపించిన పూల వర్షంలోజగన్‌ తడిసి ముద్దయ్యారు.

కాకినాడలోనే ఎన్నికల సమరశంఖం
మార్పుకు తూర్పు సంకేతమనే సెంటిమెంట్‌ను జగన్‌కొనసాగించారు. కాకినాడలో నిర్వహించే సమర శంఖారావం రోజునే ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటించడంతో ఇక్కడి నుంచి సమరశంఖం పూరించారు. ఎన్నికల ఢంకా మోగించారు. ఎన్నికల ప్రచారం కూడా పి.గన్నవరం నియోజకవర్గం అంబాజీపేట నుంచి ప్రారంభించారు. పిఠాపురం, పెద్దాపురం, ముమ్మిడివరం, మండపేట, పెద్దాపురం, రాజానగరం, కాకినాడ రూరల్‌లో ఎన్నికల ప్రచార సభలునిర్వహించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement