
'తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు'
రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
అనంతపురం : రుణమాఫీ చేస్తానని అబద్ధం చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. అనంతపురం జిల్లాలో రైతు భరోసా యాత్రలో భాగంగా ఆయన శుక్రవారం ఉరవకొండలో చేనేత, రైతు, డ్వాక్రా మహిళలతో ముఖాముఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ మాట్లాడుతూ చంద్రబాబుది ఎన్నికలకు ముందు ఒక మాట..తర్వాత మరో మాట మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతులకు, చేనేత కార్మికులకు, డ్వాక్రా మహిళలకు ఎవరికీ చంద్రబాబు చేసింది ఏమీలేదన్నారు. ఎన్నికలయిన తర్వాత చంద్రబాబు అందరినీ మరిచిపోయారని వైఎస్ జగన్ అన్నారు.
ఏం చేశారని చంద్రబాబును అడిగితే... రుణమాఫీ కావడంతో రైతులంతా ఆనందంగా ఉన్నారు. చేనేత కార్మికులు ఎగిరి గంతేస్తున్నారు. నాకు శాలువాలు కప్పుతున్నారు. సన్మానాలు చేస్తున్నారని చెబుతున్నారు. ఏమయ్యా చంద్రబాబు ఇంత మోసం చేస్తున్నారు. అబద్దాలు ఆడుతున్నారు అంటే అయ్యయ్యో ప్రజలే మోసం చేసుకుంటున్నారు అని' చంద్రబాబు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు.
చివరకు అవ్వా...తాతాల పింఛన్లతో కూడా చంద్రబాబు ఆడుకుంటున్నారని, ఉళ్లో 100మంది ఉంటే 20మందికి పింఛన్లు ఇచ్చి మిగతా వారికి మొండి చేయి చూపిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. పని చేసుకోలేక, మరో ఆధారం లేని వాళ్లు చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారని ఆయన అన్నారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత కార్మికులకు ఇళ్లు కట్టిస్తాం, మగ్గాలు ఇస్తాం, 50 శాతం సబ్సిడీ ఇస్తామని వాగ్దానాలు చేసి చంద్రబాబు అవన్ని ఇప్పుడు విస్మరించారన్నారు. అనంతపురం జిల్లాలో 11మంది చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారని వైఎస్ జగన్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అధికారం కోసం ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు...ఇప్పుడు ప్రజలు, రైతులు, చేనేత కార్మికులు, డ్వాక్రా మహిళలతోపాటు అందర్ని వెన్నుపోటు పొడిచారని వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు.