
తూర్పు గోదావరి జిల్లాలో నేడు జగన్ పర్యటన
హైదరాబాద్ : ప్రకృతి ప్రకోపానికి గురై విలవిలలాడుతున్న రైతన్నను పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేడు తుర్పూ గోదావరి జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లావాసులకు ఏ చిన్న కష్టమొచ్చినా ‘నేనున్నా’నంటూ అందరికంటే ముందుగా స్పందించే ఆయన పుట్టెడు కష్టాల్లో ఉన్న బాధితులకు అండగా నిలిచి, ధైర్యం చెప్పేందుకు ఆయన నేడు జిల్లాకు వస్తున్నారు.
ఉదయం పదిగంటలకు హైదరాబాద్ నుంచి మధురపూడి చేరుకుని, రావులపాలెం మీదుగా వెళ్లి కోనసీమలో పర్యటించనున్నారు.
కొత్తపేట, ముమ్మడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాల మీదగా పర్యటన సాగనుంది. అవిడి, చెయ్యేరు, కాట్రేనికోన, ఎన్.కొత్తపల్లి, అంబాజిపేట, మాచవరం, రాజోలు, శివకోడు ప్రాంతాల్లో పర్యటించి తుపానుకు దెబ్బతిన్న పంటలను జగన్ పరిశీలిస్తారు. రైతులు, మత్స్యకారులతో మాట్లాడనున్నారు.
కాగా నేలకొరిగిన వరి చేలు ఇంకా ముంపులోనే ఉన్నాయి. తోటల్లో విరిగిపడిన కొబ్బరి చెట్లు అలానే ఉన్నాయి. ఇప్పటీ విద్యుత్ సౌకర్యం లేక వందల ఊళ్లు అంధకారంలోనే ఉన్నాయి. ఈ సమయంలోనే ‘లెహర్’ పేరుతో మరో విపత్తు ముంచుకురావడం జిల్లావాసులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదే సమయంలో హెలెన్ తుపాను బాధితులకు కనీసం సహాయ సహకారాలు అందికపోవడం తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది.