విశాఖపట్నం: హెలెన్ తుఫాను దిశ మార్చుకుని క్రమంగా బలపడుతోంది. మచిలీపట్నానికి తూర్పు ఆగ్నేయంగా 180 కిలోమీటర్ల దూరంలో అది కేంద్రీకృతమై ఉంది. శుక్రవారం సాయంత్రం విశాఖ పట్నం మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది. కృష్ణా, గుంటూరు, విశాఖ, తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమగోదావరి జిల్లాలో దీని ప్రభావం గురువారం రాత్రి నుంచే కనిపిస్తుంది.
గోదావరి జిల్లాలు తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాలో తీరప్రాంతం అంతా రానున్న 24గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (25 సెంటీమీటర్లు లేదా అంతకంటే ఎక్కువ) కురుస్తాయని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం తెలిపింది. తీరప్రాంతాలైన గోదావరి జిల్లాల్లో హెలెన్ తుపాను ప్రభావం ఎక్కువ ఉండుటచేత అక్కడి తుపాను ప్రభావిత జిల్లాల్లో రేపు(శుక్రవారం) ప్రభుత్వం సెలవు ప్రకటించింది.