2న జగన్ రాక
సాక్షి ప్రతినిధి, కాకినాడ : వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి జిల్లా పర్యటన ఖరారైంది. ఆయన వచ్చే నెల 2, 3 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నారు. ఈ విషయాన్ని ఆదివారం ఏజెన్సీలో పర్యటించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు, శాసనసభాపక్ష ఉపనేత జ్యోతుల నెహ్రూతో పాటు రంపచోడవరం ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి, ఆ నియోజకవర్గంలో పార్టీ కో ఆర్డినేటర్ అనంత ఉదయభాస్కర్ విలేకరులకు చెప్పారు. ఈనెల 4న రంపచోడవరం వద్ద పెళ్లి వ్యాన్ బోల్తా పడ్డ ప్రమాదంలో గంగవరం మండలం సూరంపాలెం గ్రామానికి చెందిన ఎనిమిది మంది, కొత్తాడకు చెందిన ఒకరు మొత్తం 9 మంది గిరిజనులు మృతి చెందగా, సుమారు 80మంది క్షతగాత్రులయ్యారు. కాగా ఆ ప్రమాదం విషయం తెలుసుకున్న వెంటనే జగన్ మృతుల కుటుంబాలను పరామర్శించేందుకు వస్తానన్నారని అప్పట్లో నేతలు చెప్పారు. ఆ క్రమంలోనే జగన్ ఇప్పుడు మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను, కోలుకుంటున్న క్షతగాత్రులను ఓదార్చనున్నారన్నారు.
రెండో తేదీ ఉదయం రాజమండ్రికి చేరుకునే జగన్ అక్కడి నుంచి రంపచోడవరం నియోజకవర్గానికి వెళ్లి బాధిత కుటుంబాలను పరామర్శిస్తారని, అనంతరం రంపచోడవరం నియోజకవర్గ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతారని తెలిపారు. అక్కడి నుంచి కాకినాడ రూరల్, కాకినాడ సిటీ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారని చెప్పారు. సముద్రంలో వేటకు వెళ్లి వాయుగుండం కారణంగా మృతి చెందిన, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను జగన్ ఓదారుస్తారని చెప్పారు. ఆ రోజు రాత్రి కాకినాడలో బస చే స్తారని, 3న ఉదయం కాకినాడ నుంచి బయలుదేరి తుని నియోజకవర్గంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలను పరామర్శిస్తారని తెలిపారు. అనంతరం విశాఖ జిల్లా అచ్యుతాపురం వెళతారన్నారు. ఇటీవల ధవళేశ్వరం బ్యారేజ్‌పై నుంచి తుపాన్ వాహనం బోల్తాపడ్డ ఘటనలో ఆ గ్రామానికి చెందిన 22 మంది మరణించారని, జగన్ వారి కుటుంబాలను పరామర్శిస్తారని చెప్పారు. పర్యటన పూర్తి వివరాలను సోమవారం తెలియచేస్తామని నెహ్రూ చెప్పారు.