కుట్ర చీకట్లను చీల్చుకుంటూ సంకల్ప వెలుగులు | YS Jagan Praja Sankalpa Yatra Special Story in Chittoor | Sakshi
Sakshi News home page

కుట్ర చీకట్లను చీల్చుకుంటూ సంకల్ప వెలుగులు

Published Tue, Nov 6 2018 11:42 AM | Last Updated on Tue, Nov 6 2018 11:42 AM

YS Jagan Praja Sankalpa Yatra Special Story in Chittoor - Sakshi

జగన్‌ వజ్ర సంకల్పానికి నేటితో ఏడాది. టీడీపీ ప్రభుత్వంఏర్పడినప్పటి నుంచి ప్రజలకు కష్టాలు మొదలయ్యాయి.బాధిత ప్రజానీకానికి అండగా నేనున్నానంటూ భరోసా ఇచ్చేందుకు చేస్తున్న ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర సంవత్సరం పూర్తి చేసుకుంది. సరిగ్గా ఏడాది క్రితం ప్రారంభమైన సంకల్పయాత్ర గతేడాది డిసెంబర్‌ 28న జిల్లాలో ప్రవేశించింది. తంబళ్లపల్లె నుంచి సత్యవేడు నియోజకవర్గాల వరకూ 23 రోజుల పాటు సాగింది. అడుగడుగునా జనంతో జగన్‌ మమేకమయ్యారు. చిన్నా పెద్దా.. పేదాగొప్పా.. కులం, మతం, పార్టీలకు అతీతంగా అందరి కష్టాలను ఆయన తెలుసుకున్నారు. కష్టాలు కొన్నాళ్లేనని భరోసానిచ్చారు. జననేత పలకరింపులతో జనం మురిసిపోయారు. రాజన్నను తలచుకున్నారు.  క్షేత్ర స్థాయిలో ప్రజాపక్షాన నిలిచిన జననేతపై హత్యాయత్నం జరగడాన్నిజిల్లా ప్రజానీకం జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రభుత్వ పెద్దలే ఈ కుట్రలో ఉన్నారంటూ వారు మండిపడుతున్నారు. ఘటన అనంతరం జరుగుతున్న రాజకీయాలపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కోలుకుని తమ మధ్యకు రావాలని ప్రజలంతావేయికళ్లతో నిరీక్షిస్తున్నారు.

చిత్తూరు, సాక్షి: ప్రజా సంకల్ప పాదయాత్ర ప్రారంభమై ఏడాది పూర్తయింది. ప్రజా సంక్షేమం కోసం చేపట్టిన యాత్ర మరో మైలురాయిని చేరుకుంది. ఈ సందర్భంగా జిల్లాలో జరిగిన పాదయాత్రను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. నవరత్నాల గురించి జగన్‌ చేసిన ప్రచారాన్ని చెప్పుకుంటున్నారు. ఇంట్లో మనిషిగా కలిసిపోయిన వైనాన్ని తలచుకుంటున్నారు. అవ్వాతాతలు, వికలాంగులు కలవడానికి వచ్చినపుడు కింద కూర్చొని సమస్యలు వినడం, ఆప్యాయంగా పలకరించడం గురించి చర్చించుకుంటున్నారు. అక్క చెల్లెళ్లు ఎదురైనప్పుడు పిల్లల్ని బాగా చదివించాలనిసూచించడం, ఉద్యోగులు ఎదురైనప్పుడు ప్లకార్డులు పట్టుకొని వారి భరోనివ్వడంపై ఇప్పటికీ మాట్లాడుకుంటున్నారు.

నవరత్నాలపై సర్వత్రా హర్షం..
జగన్‌ ప్రకటించిన నవరత్నాలపై జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా అవ్వతాతల పెన్షన్‌ రూ.2 వేలు, వికలాంగుల పెన్షన్‌ ఇస్తామని చెప్పడం వారిని ఆనందపరుస్తోంది. ఇతరులపై ఆధారపడకుండా జీవిస్తున్న వారికి ఈ హామీ ఊరట కలిగిస్తోంది. రుణమాఫీ హామీ నమ్మి తీవ్రంగా నష్టపోయిన రైతులకు ‘వైఎస్సార్‌ రైతు బీమా’ పథకం వారికి స్వాంతన కలిగి స్తోంది. పాడి రైతులకు రూ.4 రాయితీ ఇస్తామని ప్రకటన జిల్లాలోనే చేశారు. ఈ పథకం వల్ల జిల్లాలో ఉన్న 15 లక్షల మంది పాడిరైతులకు మేలు జరుగుతుంది. చేనేతలకు కూడా వైఎస్సార్‌ బీమా వర్తింపజేస్తామనే ప్రకటన చేనేతల్లో ఆనందం నింపింది. ఎన్నికల నాటికి డ్వాక్రా మహిళల రుణాలు ఎంత ఉంటుందో.. అంతే మొత్తం అధికారంలోకి రాగానే నేరుగా చేతికి ఇస్తామని చెప్పారు. ఆరోగ్యశ్రీలో విప్లవాత్మక మార్పులు తెస్తామని హామీ ఇచ్చారు. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రూ. 10వేల పెన్షన్‌ ఇస్తామన్నారు. మద్య నిషేధంతో గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతామన్నారు. సదుంలో బహిరంగ సభలో జగన్‌ ఆర్టీసీ కార్మికులకు పెద్ద వరం ఇచ్చారు. ఆర్టీసీని నష్టాల నుంచి గట్టెక్కించడానికి ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఇప్పటికీ ఆ వర్గాల్లో చర్చనీయాశంగా ఉంటోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహించే మొదటి అసెంబ్లీలోనే సీపీఎస్‌ను రద్దు చేస్తామని చెప్పారు.

కోలుకోలేని స్థితిలో టీడీపీ..
జగన్‌ పాదయాత్రతో జిల్లాలో టీడీపీ రాజకీయంగా బాగా దెబ్బతింది. పాదయాత్ర ప్రభావంతో కుప్పం, పలమనేరు, తిరుపతి, గంగాధర నెల్లూరు, పూతలపట్టు, పుంగనూరు, మదనపల్లె, సత్యవేడు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో టీడీపీ కార్యకర్తలు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేయడానికి ఆ పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారు. జిల్లా మంత్రి సైతం ఆందోళన చెందుతున్నట్లు కనిపిస్తోంది. కుప్పంలో మెజారిటీ నిలుపుకునేందుకు చేయని టీడీపీ ప్రయత్నం అంటూ లేదు.

తట్టుకోలేకపోతున్న జనం..
ప్రజల కష్టాలు తెలుసుకోవడానికి ఎండావానను సైతం లెక్క చేయకుండా జగన్‌ పాదయాత్ర చేస్తున్నారు. అలాంటి జగన్‌పై హత్యాయత్నం జరగడంతో జిల్లా ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. తమ కష్టాలు తెలుసుకోడానికి వచ్చిన పేదల మనిషే ఇప్పుడు కష్టాల్లో ఉండటంతో వారు విలవిల్లాడుతున్నారు. హత్యాయత్నం తరువాత జగన్‌పై జరుగుతున్న రాజకీయాలపై జిల్లా జనం తట్టుకోలేకపోతున్నారు. ‘సోనియా దగ్గర నుంచి చంద్రబాబు వరకు అందరూ జగన్‌ను కష్టపెట్టే పనులే చేస్తున్నారు. నేరుగా ఢీకొట్టే పసలేని వాళ్లు జగన్‌ను దెబ్బతీయాలని చూస్తున్నారు. జగన్‌ అభిమన్యుడు కాదు. అర్జునుడు. ఎన్ని కష్టాలు పెట్టినా నిలదొక్కుకునే శక్తి ఉంది. ప్రతి కుటుంబానికీ రాజన్న మేలు చేశారు. వారి దీవెనలే జగన్‌ను కాపాడతాయని’ కురుబలకోటకు చెందిన రాజమ్మ అన్నారు.

సంకల్పం నెరవేరే వరకూ నా దీక్ష ఆగదు..
మా కుటుంబమందరికీ వైఎస్‌ అంటే ఎంతో ఇష్టం. ఆయన తనయుడు జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావాలనేది మా కోరిక. అది జరిగే వరకూ నేను పాదాలకు చెప్పులు వేసుకోను. ఒంటిపై చొక్కా కూడా ధరించేది లేదు. గడ్డం, తల వెంట్రుకలు తీయకూడదని నిశ్చయించుకున్నాను. ఈ విషయం పోటుకనుమలో టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోయారు. కక్షతో నా రేషన్‌కార్డు తొలగించారు. మండల అధికారులకు, జిల్లా కలెక్టర్‌కు చెప్పినా ఏమాత్రమూ పట్టించుకోలేదు. అదే మండలం చింతమాకులపల్లెలో ప్రస్తుతం ఉం టున్నాను.  ప్రజా సంకల్ప పాదయాత్రలో జగన్‌ వెంట చిత్తూరు, కడప, తూర్పు గోదావరి, పశ్చమ గోదావరి జిల్లాల్లో 350 కిలో మీటర్లు నడిచాను. ఆయన స్పర్శతో బాధలు, కష్టాలు మరిచిపోయాను. జగన్‌తో పాదయాత్రలో పాల్గొన్న తర్వాత మండల అధికారులకు తెలిసి రేషన్‌కార్డు ఇస్తాం, పింఛన్‌ ఇస్తాం అంటూ వచ్చారు. అయినా తీసుకోలేదు. జగన్‌ సీఎం అయ్యాకే పింఛన్, రేషన్‌ తీసుకుంటాను.– దేవేంద్రస్వామి, పోటుకనుమ, పూతలపుట్టు మండలం

భరోసా ఇచ్చిన యాత్ర
వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యాత్ర ఏడాది పూర్తి చేసుకోనుంది. ఏడాది పాటు ఆయన జనంతోనే మమేకమై సమస్యలను తమ సమస్యలుగా భావించి భరోసా ఇస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా ప్రభుత్వ అరాచకాలు కొనసాగుతున్నాయి. ఈ అరాచకాలను ప్రజలు పంటిబిగువున భరిస్తున్నారు. కష్టాల్లో ఉన్న వారికి జగన్‌ హామీలు సంతృప్తినిచ్చాయి. వారిలో భవిష్యత్‌పై భరోసా లభిం చింది. ఇలాంటి తరుణంలో ఆయనపై దాడి చేయిం చడం బాధాకరం. త్వరలోనే జగన్‌మోహన్‌రెడ్డి కోలు కుని తమ యాత్రను కొనసాగించాలి.–శివకృష్ణయాదవ్, ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థి

ప్రజా కోర్టులో శిక్ష
జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర దేశ చరిత్రలో నిలిచిపోతుంది. ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక జగన్‌పై హత్యయత్నం చేశారు. వీరు ప్రజా కోర్టులో శిక్ష అనుభవించాల్సిందే. జగన్‌పై హత్యాయత్నం జరిగింది అంటే నేను నమ్మలేదు. వెంటనే కుటుంబ సభ్యులు సెల్‌ఫోన్లలో చూపిస్తే షాక్‌కు గురయ్యాను.           – శ్రీరామిరెడ్డి, రిటైర్డ్‌ టీచర్,విఠలం, వాల్మీకిపురం మండలం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement