సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో జరిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర పేద, మధ్య తరగతి ప్రజానీకానికి బతుకుపై భరోసా కల్పించడంతో పాటు రాజకీయంగా పెనుమార్పులు తెచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని జిల్లాలో తిరుగులేని శక్తిగా నిలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 16 నుంచి మార్చి 12వ తేదీ వరకు జిల్లాలో వైఎస్ జగన్ ప్రజా సంకల్ప యాత్ర నిర్వహించారు. 22 రోజుల పాటు 9 నియోజకవర్గాలు, 19 మండలాల పరిధిలో 278.1 కిలోమీటర్ల మేర ఈ యాత్ర సాగింది. 8 బహిరంగ సభలు, ఒక రైతు సదస్సులో ఆయన పాల్గొన్నారు. యాత్ర ఆద్యంతం జగన్ జిల్లాలో ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వెలిగొండను దివంగత నేత వైఎస్ తప్ప టీడీపీ సర్కారు పట్టించుకోకపోవడాన్ని జగన్ పరిశీలించారు. పొగాకు రైతుల కష్టాలను కళ్లారా చూశారు. కనిగిరి ప్రాంతంలో సురక్షిత తాగునీరు అందనివిషయాన్ని గమనించారు. ఫ్లోరైడ్‌తో కిడ్నీలు పోగొట్టుకున్న వేలాది మంది గోడు విన్నారు. చీమకుర్తి ప్రాంతంలో గ్రానైట్ ఫ్యాక్టరీలు, క్వారీల యజమానుల సమస్యలు చూశారు. విద్యుత్ చార్జీల మోత వల్ల పడుతున్న ఇబ్బందులు విన్నారు. రామాయపట్నం పోర్టు ఆవశ్యకతను తెలుసుకున్నారు.
రాళ్లపాడు ప్రాజెక్టు అవసరాన్ని చూశారు. మొత్తంగా జగన్ జనం కష్టాలు విన్నారు. వారి కన్నీళ్లు తుడిచారు. తానున్నానంటూ భరోసా కల్పించారు. చంద్రబాబు నాలుగున్నరేళ్ల పాలనలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడాన్ని జగన్ క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో అవినీతి, అక్రమాలను జనం జగన్ దృష్టికి తెచ్చారు. సంక్షేమ పథకాలు అర్హులకు కాకుండా అనర్హులకు ఇవ్వడాన్ని ఆయన కళ్లారా చూశారు. అభివృద్ధి పనుల్లో అవినీతి అక్రమాలు, టీడీపీ నేతల కమీషన్ల పర్వం జనం జగన్ కళ్లకు కట్టారు. అందరి దీవెనలతో తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అన్ని సమస్యలు పరిష్కరిస్తామని జగన్ అన్ని వర్గాల వారికి భరోసా ఇచ్చారు. జగన్ హామీలపై జనానికి నమ్మకం కలిగింది. అభివృద్ధి, సంక్షేమం పైన ఆశ చిగురించింది. వైఎస్ పాలన మళ్లీ వస్తుందన్న విశ్వాసం కలిగింది. జగన్ భరోసాతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి నేతల బలంతో పాటు జనబలం పెరిగింది. జనం నాడి తెలుసుకున్న నేతలు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ఉత్సాహం చూపించారు. ముఖ్య నేతలతో పాటు గ్రామ గ్రామాన అధికార టీడీపీని వీడి జనం వైఎస్సార్ సీపీలో చేరారు. నిత్యం చేరుతూనే ఉన్నారు.
వైఎస్ జగన్ పాదయాత్ర సందర్భంగానే కొందరు ముఖ్యనేతలు టీడీపీ నుంచి వైఎస్సార్ సీపీలో చేరగా ఆ తర్వాత మరి కొందరు నేతలు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. జగన్ యాత్ర జిల్లాలో ముగిసిన అనంతరం కందుకూరు నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి మానుగుంట మహీధర్‌రెడ్డి జూలై 11న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ కండువా కప్పి మహీధర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించారు. మహీధర్‌రెడ్డితో పాటు చాలా మంది ముఖ్యనేతలు, ప్రజలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మహీధర్‌రెడ్డి రాక కందుకూరు నియోజకవర్గంలో పార్టీ బలాన్ని పెంచింది. డిసెంబర్ 22న గిద్దలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. రాంబాబు చేరిక నియోజకవర్గంలో పార్టీకి మరింత బలాన్ని చేకూర్చింది. వైశ్య సామాజిక వర్గానికి చెందిన రాంబాబు చేరికతో జిల్లాలో ఆ సామాజికవర్గం ఓటర్లు వైఎస్సార్ సీపీ వైపు మొగ్గు చూపుతున్నారు. చీరాలకు చెందిన మాజీ ఎంపీ చిమటా సాంబు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన రాక చీరాలలో పార్టీకి మరింత బలం చేకూరింది. ఒంగోలుకు చెందిన మాజీ పీడీసీసీ బ్యాంకు చైర్మన్ ఈదర మోహన్, ఆయన సోదరుడు చిన్నారి సైతం జగన్ సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. ఇలా ముఖ్య నేతలతో పాటు జిల్లా వ్యాప్తంగా పలువురు ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచ్‌లు నిత్యం అధికార టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీని తిరుగులేని శక్తిగా నిలిపేందుకు ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారు. జిల్లాకు చెందిన మరి కొందరు ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు వారు అన్ని ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఫిబ్రవరిలోగా మరి కొందరు ముఖ్యనేతలు టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరే అవకాశాలు ఉన్నాయి. వీరి రాకతో జిల్లాలో పార్టీ తిరుగులేని శక్తిగా నిలవనుంది.
Comments
Please login to add a commentAdd a comment