ప్రధాని మోదీకి సీఎం జగన్‌ లేఖ | YS Jagan Requests Central Government To Help For Industrial Development | Sakshi
Sakshi News home page

చేయూతనిస్తే మరింత ఊపు

Published Fri, May 1 2020 5:13 AM | Last Updated on Fri, May 1 2020 8:10 AM

YS Jagan Requests Central Government To Help For Industrial Development - Sakshi

సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నేపథ్యంలో రాష్ట్రంలో పరిశ్రమల రంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని, కేంద్రం ఆదుకుంటే తప్ప పరిశ్రమలు తిరిగి పుంజుకునే అవకాశం లేదని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ దృష్టికి తీసుకెళ్లారు. జాతీయ తయారీ రంగం ఉత్పత్తిలో, ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్‌ పరిశ్రమలకు గణనీయమైన భాగస్వామ్యం ఉందని, రాష్ట్రంలో పరిశ్రమల రంగం నిలదొక్కుకోవడానికి సహకారం అందించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధానికి ఆయన లేఖ రాశారు. ఏ రంగాల్లో సహకారం కోరుతున్నది లేఖలో వివరించారు. లేఖలోని ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.

ఎంఎస్‌ఎంఈల కోసం నిధి ఏర్పాటు చేయండి
► మాంద్యంలో జీతాల భారాన్ని ఎంఎస్‌ఎంఈలు తట్టుకోవడానికి వీలుగా  నిధి ఏర్పాటు చేయండి. 
► లాక్‌డౌన్‌ సమయంలో పరిశ్రమలు మూసివేసిన కాలాన్ని జాతీయ అత్యవసర పరిస్థితిగా పరిగణించాలి. లాక్‌డౌన్‌ కాలానికి కార్మికులకు జీతాలు చెల్లించడానికి రాజీవ్‌గాంధీ శ్రామిక్‌ కల్యాణ్‌ యోజన, అటల్‌ బీమిత్‌ వ్యక్తి కల్యాణ్‌ యోజన కింద ఈఎస్‌ఐ నిధులను వినియోగించుకోవాలి.
► 10 శాతానికి మించి సిబ్బందిని తొలగించని యూనిట్ల యాజమాన్యాలకు.. పీఎఫ్, ఈఎస్‌ఐ, గ్రాట్యుటీ చెల్లింపు లను 6 నెలలు లేకుండా మారటోరియం విధించాలి.
► సాధారణ పరిస్థితులు నెలకొనే వరకు.. వర్కింగ్‌ కేపిటల్‌ మీద  నెలవారీ కిస్తీలు, వడ్డీలను వాయిదా వేయాలి.  
► ఈ ఏడాది మార్చి 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు వడ్డీ రేటును 7 శాతానికి పరిమితం చేయాలి. వర్కింగ్‌ కేపిటల్‌ను అదనంగా 25 శాతం తాత్కాలికంగా మంజూరు చేయాలి. ఎంఎస్‌ఎంఈలు తీసుకున్న టర్మ్‌ లోన్స్‌ చెల్లింపు విషయంలో 12 నెలల పాటు మారిటోరియం విధించాలి.

వస్త్ర ఉత్పత్తుల రంగానికి చేయూత ఇవ్వాలి
► ఆర్‌బీఐ రుణ పునర్‌ వ్యవస్థీకరణ పథకం కింద బ్యాంకులు ఇచ్చిన అసలు, వడ్డీ వసూళ్లపై నాలుగు త్రైమాసికాలు మారటోరియం విధించాలి. 
► కాటన్‌ యార్న్‌పై కేంద్ర పన్నులు, లెవీల రాయితీ, ఐఈఎస్, ఎంఈఐఎస్‌ పథకాల నుంచి లబ్ధి పొందేలా చూడాలి. 
► ముడి వస్తువులు, రంగులు, రసాయనాలు, విడి భాగాలపై యాంటి డంపింగ్‌ డ్యూటీ, కస్టమ్‌ సుంకం నుంచి మినహాయింపు ఇవ్వాలి.
► వస్త్ర ఎగుమతి దారులు వేతనాలు ఇవ్వడానికి రుణం మంజూరు చేయాలి.
► సెజ్‌ల్లో ఉండే ఎగుమతి ఆధారిత టెక్స్‌టైల్‌ పరిశ్రమలు ఉత్పత్తి చేసిన 50 శాతం ఉత్పత్తులను దేశీయ మార్కెట్‌లో విక్రయించుకోవడానికి ఆరు నెలలు అనుమతించాలి.

ఫార్మా రంగానికి ఊతం ఇవ్వండి
► ఎక్కువగా దిగుమతులు చేసుకునే ఏపీఐని వ్యూహాత్మక రంగంగా గుర్తించాలి. ముడి వస్తువుల ఉత్పత్తి సరఫరాకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి. ఏపీఐల ఎగుమతులపై పరిమితులు సడలించాలి. 
► జీఎస్టీ రీయింబర్స్, ఇతర లెవీలను త్వరితగతిన చెల్లించాలి. అత్యవసరమైన మందులను వినియోగదారుడికి అందుబాటులోకి తేవాలి. భౌతిక దూరం నేపథ్యంలో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించాలి. 
► ప్రధానమైన ముడి పదార్థాల దిగుమతికి ఫాస్ట్‌ట్రాక్‌ పద్ధతిలో అనుమతివ్వాలి. దిగుమతి సుంకం విధానాన్ని సమీక్షించాలి. నిబంధనలు సడలించి ఉత్పత్తి పెంచడానికి అవకాశమివ్వాలి.
► కొత్త ఫార్మా క్లస్టర్లకు రాయితీలు ఇవ్వాలి. భారీ ఏపీఐ పార్కులకు ఆర్థిక సాయం అందించాలి. కొత్త పెట్టుబడులకు ఫాస్ట్‌ ట్రాక్‌ అనుమతివ్వాలి. చైనా నుంచి ముడి పదార్థాల దిగుమతి తగ్గించడానికి చర్యలు తీసుకోవాలి. ఏపీఐ పార్కుల ఏర్పాటుకు సింగిల్‌ విండోలో అనుమతులివ్వాలి. కొత్త ఔషధాల పరిశోధనలు, అభివృద్ధికి రాయితీలు ఇవ్వాలి.

ఎగుమతుల కోసం పోర్టులు, ఎయిర్‌ పోర్టులు
► ఉద్యోగుల జీతాలు, అద్దెలు, ఇతర అవసరాలను భరించేందుకు ఎగుమతి దారులకు వడ్డీ లేని రుణాలు అందించాలి. మార్చి నుంచి మే వరకు ఈపీఎఫ్‌ ఆర్గనైజేషన్, ఎంప్లాయిస్‌ స్టేట్‌ ఇన్సూరెన్స్‌ కార్పోరేషన్‌కు చెల్లించాల్సిన మొత్తాన్ని మాఫీ చేయాలి.
► బిల్‌ ఆఫ్‌ ఎంట్రీ, కస్టమ్స్‌ డ్యూటీ చెల్లింపు గడువులో మినహాయింపులు ఇవ్వాలి. డిఫర్డ్‌ పేమెంట్‌ ఆఫ్‌ ఇంపోర్ట్‌ డ్యూటీ సదుపాయాన్ని కొనసాగించాలి.
► ఎక్స్‌పోర్ట్‌ ఆబ్లిగేషన్‌ డిస్‌చార్జ్‌ సర్టిఫికెట్‌ కోసం డీజీఎఫ్‌టీ వద్ద పెండింగులో ఉన్న కేసులకు సంబంధించి బ్యాంకు గ్యారంటీనీ మరో ఆరు నెలల వరకు పొడిగించకూడదు. 
► షిప్పింగ్‌ లైన్‌ డెమరేజ్‌ చార్జీలు, సీఎఫ్‌ఎస్‌ చార్జీలు మాఫీ చేయాలి. క్లియరెన్స్‌ సమయం సాధారణ స్థితికి వచ్చే వరకు ఎగుమతి కంటైనర్ల లేట్‌ బీఎల్‌ ఫీజులు మాఫీ చేయాలి.
► మరో ఆరు నెలల వరకు ఒరిజినల్‌ షిప్పింగ్‌ డాక్యుమెంట్ల స్కాన్‌ కాపీలను కస్టమ్స్‌ అధికారులు ఆమోదించాలి. ఎగుమతుల కోసం కొన్ని పోర్టులు, ఎయిర్‌ పోర్టులను ప్రత్యేకంగా గుర్తించాలి.
► ఎగుమతి చేసే ఉత్పత్తుల తయారీకి అవసరమైన సరుకు దిగుమతి చేసుకునేందుకు ఎల్‌సీలకు బ్యాంకులు ప్రాధాన్యమివ్వాలి. ఎగుమతి చేయాల్సిన కంసైన్‌మెంట్లను పరిశ్రమలు, గిడ్డంగుల నుంచి నేరుగా కస్టమ్స్‌ కేంద్రాల వద్దకు తీసుకువెళ్లేందుకు అనుమతించాలి. 
► గడువు దాటిన ఇ–వే బిల్లుల కాలపరిమితిని పొడిగించేందుకు, అపరాధ రుసుమును మాఫీ చేసేందుకు జీఎస్టీ నిబంధనలు, ఇ–వే బిల్‌ పోర్టల్‌లలో అవసరమైన సవరణలు చేయాలి.
► 2020 ఏప్రిల్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు చేసే అన్ని ఎగుమతులపై కనీసం 2 శాతం డ్యూటీని తగ్గించాలి.

బకాయిలు ఇప్పించండి
► ప్రభుత్వ రంగ సంస్థలు, వివిధ శాఖల నుంచి సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రావాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి. లాక్‌ డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ శాఖల కొనుగోళ్లు, సరఫరాలో జాప్యం జరుగుతున్నందున వాటికి ఎలాంటి జరిమానాలు విధించ రాదు. 
► కోవిడ్‌ –19 నేపథ్యంలో వివిధ ప్రభుత్వ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి గడువును పున:సమీక్షించి, ఎలాంటి అపరాధ రుసుం వసూలు చేయకూడదు.
► ఎంఎస్‌ఎంఈలకు ఈఎండీల నుంచి మాత్రమే కాకుండా సెక్యూరిటీ డిపాజిట్, ఫర్మార్మెన్స్‌ సెక్యూరిటీ డిపాజిట్‌ నుంచి ఆరు నెలలు మినహాయింపు ఇవ్వాలి. ఎంఎస్‌ఎంఈల విద్యుత్‌ చార్జీలను రద్దు చేయాలి. 
► ప్రస్తుతం ఎంఎస్‌ఎంఈలకు, సేవా రంగానికి ఏడాదికి రూ.20 లక్షల నుంచి రూ.40 లక్షల మధ్య టర్నోవర్‌ ఉండే సంస్థలకు జీఎస్‌టీ ఫైలింగ్‌ చేసేలా నిబంధన విధించారు. దాన్ని కోటి రూపాయలకు పెంచేలా చర్యలు తీసుకోవాలి.
► వ్యాపార కార్యకాలాపాలు సాధరాణ స్థాయికి చేరే వరకు జీఎస్‌టీ వసూళ్లను వాయిదా వేయాలి. ఇదే తరహాలో వ్యాట్, ఐఎఫ్‌ఎస్‌టీని కూడా వాయిదా వేయాలి. ఎగుమతులకు సంబంధించిన డాక్యుమెం ట్లు బ్యాంకులకు సమర్పించే గడువును పొడిగించాలి.

ఆటో మొబైల్‌ రంగానికి లబ్ధి చేకూర్చాలి
► కొత్త వాహనాలపై జీఎస్టీ రేట్లు తగ్గించాలి. ద్రవ్య లభ్యత పెంచే విధంగా జీఎస్టీ చెల్లింపు వాయిదా వేయాలి. ఎంఎస్‌ఎంఈ రంగానికి చెందిన ఎగుమతిదారులకు డ్యూటీ డ్రాబ్యాక్, జీఎస్టీ రిఫండ్లు చెల్లించాలి. 
► చిన్న పరిశ్రమల్లో కార్మికులను ఆదుకునే విధంగా మూడు నెలల పాటు వేతన సబ్సిడీ ఇవ్వాలి. పన్ను చెల్లింపులు వాయిదా వేయాలి. చిన్న కంపెనీలకు తక్కువ వడ్డీ రేటుకే సిడ్బీ వంటి సంస్థల ద్వారా అధిక వర్కింగ్‌ కేపిటల్‌ రుణాలు మంజూరు చేయాలి. 
► బీఎస్‌–6 వాహనాల కాల పరిమితి 6 నెలలకు పెంచాలి. పోర్టు వెయిటింగ్‌ చార్జీలు రద్దు చేయాలి. లేదా తిరిగి చెల్లించాలి. దిగుమతులపై ఆధారపడిన కంపెనీలకు టర్మ్‌ లోన్లపై మారటోరియం విధించాలి. 
► రాష్ట్రాల మధ్య సప్లై చైన్‌ను ప్రోత్సహించాలి. అవకాశం ఉన్న చోట్ల ఆన్‌లైన్‌లో ఆటోమొబైల్‌ అమ్మకాలను ప్రోత్సహించాలి.  
గనుల రంగాన్ని ఆదుకోవాలి
► ఆంధ్రప్రదేశ్‌లో ఖనిజ ఆధారిత పరిశ్రమలు 8 ఉన్నాయి. 55 మిలియన్‌ టన్నుల సిమెంట్‌ను ఉత్పత్తి చేసే 40 యూనిట్లు ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగం అనిశ్చితి వల్ల సిమెంట్‌ పరిశ్రమ ఇబ్బందుల్లో ఉంది. ఈ రంగాన్ని ఆదుకోవాల్సిన అవసరం వుంది. 
► జాతీయ మౌలిక సదుపాయాల కల్పన కింద  చేపట్టిన పనులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలి. 
► రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ఊతమివ్వడానికి ప్యాకేజీ ప్రకటించాలి. రుణాల చెల్లింపుపై మారిటోరియం విధించాలి. ట్రేడ్‌ ఫైనాన్స్‌ వ్యయాలను తగ్గించాలి. 
► ప్రాజెక్టులు తిరిగి ప్రారంభించడానికి ప్రత్యేక ప్యాకేజీ కింద పెట్టుబడి సాయం అందించాలి. మైనింగ్‌ ప్రాజెక్టుల్లో కార్మికులకు వేతనాల రాయితీ ఇవ్వాలి. పన్నులను తగ్గించాలి. 
► వ్యూహాత్మక రంగంలో పరిశ్రమల ఏర్పాట్లుకు లోన్‌ గ్యారంటీ కల్పించాలి. ఇలాంటి విపత్కర పరిస్థితుల నుంచి రక్షించడానికి బీమా సదుపాయం కల్పించాలి.

ఆహార శుద్ధి పరిశ్రమలకు చేయూత
► చైనా, అమెరికా తదితర దేశాలకు ఎగుమతులపై ఆంక్షలు విధించినందున ఫుడ్‌ ప్రాసెసింగ్‌ పరిశ్రమ బాగా దెబ్బతింది.    
► రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, క్లస్టర్‌ ప్రాజెక్టులు, మెగా ఫుడ్‌ పార్కులు, బహుళ వ్యవసాయోత్పత్తుల ఎగుమతి జోన్లు, కోల్డ్‌చైన్‌ మౌలిక వసతులు అన్నీ కలిపి 3వేలకుపైగా ఉన్నాయి. కనుక ఈ రంగానికి ఇలా సహకారాన్ని అందించండి.
► ప్రత్యేక రుణాలు మంజూరు చేయడం ద్వారా నిర్వహణ పెట్టుబడిని మరింతగా అందుబాటులోకి తేవాలి. జీఎస్‌టీ, విద్యుత్‌ చార్జీలు, ఎగుమతి సుంకాలు ఉప సంహరించాలి. స్వల్ప కాలిక రుణాలు అందించాలి.
► అమెరికా, యూరోపియన్‌ యూనియన్, ఆసియా దేశాలకు మత్స్య ఉత్పత్తుల ఎగుమతులను వెంటనే పునఃప్రారంభించాలి. పెరిషబుల్‌ ఉత్పత్తులకు డిస్కౌంట్‌ రేట్లతో కేంద్ర ప్రభుత్వ గిడ్డంగుల్లో నిల్వ చేసుకునే అవకాశం కల్పించాలి.
► సుంకాల చెల్లింపులో జాప్యంపై అదనపు మొత్తాన్ని మినహాయించాలి. ఆహార ఉత్పత్తులను రవాణా చేసే వాహనాలు రాష్ట్రాల సరిహద్దులు దాటడంలో ఆలస్యం లేకుండా చూడాలి.
భవిష్యత్తులో ఈ చర్యలు తీసుకోవాలి
► పోర్టుల వద్ద క్వాలిటీ టెస్టింగ్‌ సదుపాయాలతో గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీ ప్లాంట్లను నిర్మించాలి. భారతదేశం నుంచి ఎగుమతులకు మరింత «డిమాండ్, ధర లభించేలా కొత్త మార్కెట్‌లకు విస్తరించాలి.
► వ్యవసాయ ఉత్పత్తుల సరఫరాకు పొలాల నుంచి పోర్టుల వరకు సరైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రుణాల మీద వడ్డీని రద్దు చేయాలి. తక్కువ వడ్డీతో కొత్త రుణాలు మంజూరు చేయాలి.
► చిన్నతరహా, మధ్యతరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలి. ఎగుమతుల క్లస్టర్లను ఏర్పాటు చేసి సబ్సిడీ రేట్లకు అందుబాటులోకి తేవాలి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement