విద్యుత్‌ సంక్షోభంపై తక్షణం స్పందించండి | AP CM YS Jagan Letter To PM Modi Over Electricity Crisis | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సంక్షోభంపై తక్షణం స్పందించండి

Published Sat, Oct 9 2021 3:14 AM | Last Updated on Sat, Oct 9 2021 7:38 AM

AP CM YS Jagan Letter To PM Modi Over Electricity Crisis - Sakshi

సాక్షి, అమరావతి: అంతర్జాతీయంగా ఏర్పడ్డ బొగ్గు కొరత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్‌ ఎదుర్కొంటున్న విద్యుత్‌ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు తక్షణమే స్పందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీని  కోరారు. ఏపీలోని 2,300 మెగావాట్ల గ్యాస్‌ విద్యుత్‌ ప్లాంట్లకు ఓఎన్‌జీసీ, రిలయన్స్‌ సంస్థల నుంచి అత్యవసరంగా గ్యాస్‌ సరఫరా చేసేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాన మంత్రికి శుక్రవారం ఆయన ఒక లేఖ రాశారు. విద్యుత్‌ ధరలు, అదనపు ఇంధనంపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్‌ తర్వాత గత ఆరు నెలల్లో విద్యుత్‌ డిమాండ్‌ 15 శాతం.. ఒక్క గత నెలలోనే 20 శాతానికిపైగా పెరిగిందని చెప్పారు. రాష్ట్ర అవసరాల కోసం విద్యుత్‌ కొనుగోలు చేయాలన్నా అందుబాటులో లేదని పేర్కొన్నారు. ఆ లేఖలో సీఎం జగన్‌ ఇంకా ఏం చెప్పారంటే.. 

పరిస్థితి ఆందోళనకరం 

 రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగం రోజుకు 185 మిలియన్‌ యూనిట్ల నుంచి 190 మిలియన్‌ యూనిట్ల వరకు ఉంటోంది. రాష్ట్ర విద్యుత్‌ అవసరాల్లో 45 శాతం విద్యుత్‌ను ఏపీజెన్‌కో సమకూరుస్తున్నప్పటికీ.. ఒకటి రెండు రోజులకు మించి బొగ్గు సరిపోయే పరిస్థితి కనిపించడం లేదు. 
  ఏపీజెన్‌కో థర్మల్‌ పవర్‌ ప్లాంట్ల ఉత్పత్తి సామర్థ్యం రోజుకు 90 మిలియన్‌ యూనిట్లు ఉంటే.. అందులో 50 శాతం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. సెంట్రల్‌ పవర్‌ స్టేషన్ల నుంచి రోజుకు 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ ఉత్పత్తి కావాలి. అయితే అందులో 75 శాతం మించి ఉత్పత్తి కావడం లేదు.  
► ఆంధ్రప్రదేశ్‌లో 8 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు బొగ్గు ఆధారిత ప్లాంట్లతో ఉన్న ఒప్పందాలను వినియోగించుకోలేని పరిస్థితి. ప్రతి రోజూ 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను కొనుగోలు చేస్తుండగా, దాని ధర ఇప్పుడు మూడు రెట్లు పెరిగింది. 
► సెప్టెంబర్‌ 15 వరకు సగటున యూనిట్‌ రూ.4.6 ఉండగా, అక్టోబర్‌ 8 నాటికి రూ.15కు చేరింది. కొన్ని సందర్భాల్లో విద్యుత్‌ కొనుగోలుకు యూనిట్‌కు రూ.20 చెల్లించాల్సి వస్తోంది. ఇది తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 
► ఇదే పరిస్థితి కొనసాగితే విద్యుత్‌ పంపిణీ సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాల్లోకి వెళ్లిపోతాయి. పంటలు చేతికందే చివరి దశలో నీరు ఇవ్వలేకపోతే ఎండిపోయి రైతులు నష్టపోతారు. 2012లో ప్రణాళిక లేని విద్యుత్‌ కోతల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. మళ్లీ అటువంటి పరిస్థితులు రాకుండా తక్షణమే జోక్యం చేసుకుని ఈ సమస్యను పరిష్కరించాలి. 

ఇలా చేస్తే మేలు.. 

► రాష్ట్రంలోని థర్మల్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాలకు 20 బొగ్గు ర్యాక్స్‌ను కేటాయించాలని బొగ్గు, రైల్వే మంత్రిత్వ శాఖలకు సూచించాలి. 
► బొగ్గు గనుల సమీపంలో ఏర్పాటు చేసిన బొగ్గు ఆధారిత విద్యుత్‌ ప్లాంట్లు కొన్ని పని చేయడం లేదు. పీపీఏలు, బొగ్గు సరఫరా ఒప్పందాలు లేనందున విద్యుత్‌ నిలిపివేసిన ప్లాంట్లలో ఉత్పత్తిని తక్షణం ప్రారంభించాలి.  
 వాటిలో కొన్ని ప్లాంట్ల దివాలా ప్రక్రియ నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యునల్‌ (ఎన్సీఎల్టీ) పరిశీలనలో ఉన్నప్పటికీ.. ప్రస్తుత అత్యవసర పరిస్థితి దృష్ట్యా.. ఆ ప్లాంట్లలో విద్యుత్‌ ఉత్పత్తిని వెంటనే ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలి. 
► ఫలితంగా బోగ్గు రవాణా సమయం ఆదా అవడమే కాకుండా, విద్యుత్‌ ప్లాంట్లలో వినియోగించే బొగ్గు పరిమాణంలోని పరిమితులనూ అధిగమించవచ్చు. ఫలితంగా తక్షణం విద్యుత్‌ అందుబాటులోకి వచ్చి ప్రస్తుతం సంక్షోభం నుంచి బయటపడవచ్చు.  
► రాష్ట్రంలో 2,300 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యం ఉన్న గ్యాస్‌ ఆధారిత ప్లాంట్లు ప్రస్తుతం పని చేయడం లేదు. వాటికి ఓఎన్జీసీ, రిలయన్స్‌ వద్ద అందుబాటులో ఉన్న గ్యాస్‌ను సరఫరా చేసి, పని చేసేలా చర్యలు తీసుకోవాలి.  
► కేంద్ర ఉత్పత్తి సంస్థలను నిర్వహణ కోసం నిలిపి వేయడం వల్ల 500 మెగావాట్ల కొరత ఏర్పడింది. వెంటనే పునరుద్దరించడం లేదా నిర్వహణ ప్రక్రియను వాయిదా వేసి ఉత్పత్తి ప్రారంభించాలి. 
► డిమాండ్‌కు సరిపడా బొగ్గు సరఫరా లేకపోవడం వల్ల ధరలు అధికంగా ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో బొగ్గు కొనుగోలు చేయడానికి వీలుగా విద్యుత్‌ సంస్థలకు బ్యాంకుల ద్వారా సులభంగా రుణాలు మంజూరయ్యేలా చర్యలు తీసుకోవాలి.  
   
    

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement