అమ్మ ఒడి.. హాజరు నిబంధన మినహాయింపు | YS Jagan Review Meeting Over Amma Vodi And Nadu Nedu | Sakshi
Sakshi News home page

అమ్మ ఒడి.. హాజరు నిబంధన మినహాయింపు

Published Mon, Jan 6 2020 7:23 PM | Last Updated on Mon, Jan 6 2020 7:37 PM

YS Jagan Review Meeting Over Amma Vodi And Nadu Nedu - Sakshi

సాక్షి, అమరావతి : అమ్మ ఒడి పథకం అమలుకు సంబంధించి లబ్ధిదారులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభవార్త తెలిపారు. తొలి ఏడాది 75శాతం హాజరు నిబంధన నుంచి మినహాయింపు ఇస్తున్నట్టు ప్రకటించారు. పిల్లలను బడికి పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి ఈ పథకం ప్రవేశపెడుతున్నందున తొలిఏడాది స్ఫూర్తి నింపేలా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. వచ్చే ఏడాది నుంచి కచ్చితంగా 75శాతం హాజరు నిబంధన పాటించాలన్న సీఎం వైఎస్‌ జగన్‌.. ఈ విషయాన్ని పిల్లల తల్లిదండ్రులకు చెప్పాలని అధికారులను ఆదేశించారు. పాఠశాలల్లో నాడు –నేడు, అమ్మ ఒడి, మధ్యాహ్న భోజనంలో నాణ్యతపై సీఎం వైఎస్‌ జగన్‌ సోమవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. 

అయితే ఈ సందర్భంగా 61,344 పిల్లలకు సంబంధించి చిరునామాలు సరిగ్గా లభ్యం కావడంలేదని.. అందుకు కొంత సమయం కావాలని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ను కోరారు. దీనిపై స్పందించిన సీఎం.. త్వరగా వెరిఫికేషన్‌ పూర్తిచేయాలన్నారు. 7,231 అనాథ పిల్లలకు సంబంధించి అమ్మ ఒడి డబ్బును సగం అనాథశ్రమానికి, సగం పిల్లల పేరుమీద డిపాజిట్‌ చేయాలని సూచించారు. 1,81,603 మంది పిల్లలకు సంబంధించిన కుటుంబాల్లో 300 పైబడి యూనిట్ల కరెంటు ఉందని, ఇందులో ఉమ్మడి కుటుంబాలకు చెందిన పిల్లలు ఉన్నారంటూ క్షేత్రస్థాయి నుంచి వినతులు వస్తున్నాయని అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన సీఎం.. మరోసారి రీ వెరిఫికేషన్‌ చేయించి అర్హులైన వారికి తప్పనిసరిగా అమ్మ ఒడి వర్తింపు చేయాలని స్పష్టం చేశారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డుల్లో తప్పులు కారణంగా కొందరికి లేని భూమిని ఉన్నట్టుగా చూపిస్తున్నారని, దీనిపై ఫిర్యాదులు వచ్చాయని అధికారులు సీఎంకు వివరించారు. అయితే ఆ ఫిర్యాదులను వెంటనే పరిశీలించి వారిని అర్హులుగా గుర్తించాలని సీఎం చెప్పారు. 1,38,965 మంది పిల్లలు ఈ కేటగిరీలో ఉన్నట్టు అధికారులు తెలిపారు.

‘నాడు-నేడు’ పనుల్లో నాణ్యత ఉండాలి
మొదటి దశలో 15,715 పాఠశాల్లో ‘నాడు–నేడు’ కింద అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నట్టు అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు తెలిపారు. జనవరి 15 నుంచి అభివృద్ధి పనులు ప్రారంభిస్తామన్నారు. నాడు– నేడులో భాగంగా రెండోదశ, మూడోదశ కింద చేపట్టాల్సిన కార్యక్రమాలపై సీఎం వైఎస్‌ జగన్‌ ఆరా తీశారు. రెండు, మూడు దశల్లో భాగంగా అన్ని స్కూళ్లు, హాస్టళ్లు, అన్ని జూనియర్‌ కాలేజీలు, డిగ్రీ కాలేజీల్లో చేపట్టాల్సిన పనులపై ఈ నెలాఖరు నాటికి ప్రతిపాదనలు తయారు చేస్తామన్న అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించారు. హాస్టళ్లలో పిల్లలకు మంచి బాత్‌రూమ్స్‌ ఉండాలని, మంచి బెడ్లు, అల్మరాలు, చదువుకునేందుకు టేబుల్స్‌ ఉండాలని ఈ సందర్భంగా సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులను ఆదేశించారు. చేసేపనుల్లో నాణ్యత ఉండాలని స్పష్టం చేశారు.

మధ్యాహ్న భోజనంలో పెరగనున్న నాణ్యత..
గత సమీక్షా సమావేశాల్లో మధ్యాహ్న భోజనం నాణ్యతపై ఇచ్చిన ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. మెనూలో తీసుకువస్తున్న మార్పులపై సీఎం వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఇందుకోసం రూ.200 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు తెలిపారు. ఆహారాన్ని నాణ్యంగా వండటానికి ఆయాలకు రూ.3వేల చొప్పున జీతాలు చెల్లిస్తున్నామని చెప్పారు. మొత్తంగా రూ. 343.55 కోట్లు అదనంగా ఖర్చు చేస్తున్నట్టు వెల్లడించారు. మొత్తంగా రూ. 1294 కోట్లు ఖర్చు అవుతుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 20 నుంచి అంతటా నాణ్యమైన భోజనం అందుబాటులోకి వస్తుందన్నారు. 

మెనూ వివరాలు..
సోమవారం : అన్నం, పప్పుచారు,  ఎగ్‌ కర్రీ, చిక్కి 
మంగళవారం :  పులిహోర, టమోటా పప్పు, ఉడికించిన గుడ్డు
బుధవారం : కూరగాయల అన్నం, ఆలు కుర్మా, ఉడికించిన గుడ్డు, చిక్కి
గురువారం : కిచిడి (పెసరపప్పు అన్నం), టమోటో చట్నీ, ఉడికించిన గుడ్డు
శుక్రవారం : అన్నం, అకుకూర పప్పు, ఉడికించిన గుడ్డు, చిక్కి
శనివారం : అన్నం, సాంబార్, స్వీట్‌ పొంగల్‌

స్కూళ్లు తెరిచే నాటికి టెక్ట్స్‌ బుక్స్‌, యూనిఫారాలు..
స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు టెక్ట్స్‌ బుక్స్, యూనిఫారాలు ఇవ్వాలన్న సీఎం వైఎస్‌ జగన్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. స్కూల్‌ కిట్‌లో భాగంగా 3 జతల దుస్తులు, టెక్ట్స్‌ బుక్స్, నోట్‌ బుక్స్, ఒక జత షూ, సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగు ఉండలన్నారు. అలాగే పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం బోధనపై సీఎం వైఎస్‌ జగన్‌ రివ్యూ చేపట్టారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఇస్తున్న శిక్షణ వివరాలను అధికారులు సీఎంకు తెలిపారు. అయితే స్వయం శిక్షణ కోసం ఉద్దేశించిన యాప్స్‌ను కూడా వెంటనే తయారుచేయించాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement