ఆ మాట ఎక్కడా వినిపించకూడదు: సీఎం జగన్‌ | YS Jagan Review Meeting On Spandana Program In Amaravati | Sakshi
Sakshi News home page

కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలి: సీఎం జగన్‌

Published Tue, Feb 25 2020 5:03 PM | Last Updated on Tue, Feb 25 2020 8:23 PM

YS Jagan Review Meeting On Spandana Program In Amaravati - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ, వార్డు సచివాలయాల నుంచి వచ్చే అభ్యర్థనలపై పర్యవేక్షణ అవసరమని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం స్పందన కార్యక్రమం​పై సమీక్ష నిర్వహించారు. జిల్లా కలెక్టర్, ప్రతిశాఖ కార్యదర్శి తనకు సంబంధించిన అభ్యర్థనలపై పర్యవేక్షణ చేయాలని ఆయన ఆదేశించారు. నకిలీ మద్యం, అక్రమ ఇసుక తవ్వకాలు లాంటి అంశాలు ఉన్నప్పుడు స్థానిక ఎస్పీకి, అలాగే డీజీపీకి తెలియజేయాలన్నారు. అలాగే వాటిని నిరోధించడానికి ఏర్పాటైన ప్రత్యేక బృందాలకు కూడా అభ్యర్థనలు వెళ్లాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. సమాధానం ఇచ్చి వెనక్కి పంపించాలని.. అలాగే అలర్ట్స్‌ కూడా పంపించాలని ఆయన తెలిపారు. వచ్చే స్పందన నాటికల్లా ఈ ఏర్పాట్లు ఉండాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.  

స్పందన కార్యక్రమాన్ని మరో స్థాయిలోకి తీసుకువెళ్లాలని సీఎం జగన్‌ పేర్కొన్నారు. స్పందన కార్యక్రమంలో వినతి ఇవ్వగానే రశీదు ఇస్తాం, ఇది కంప్యూటర్‌లో రెడ్‌ఫ్లాగ్‌తో వెళ్తుందని ఆయన తెలిపారు. ఫలానా తేదీలోగా దీన్ని పరిష్కరిస్తామని రశీదులో పేర్కొంటామని ఆయన వివరించారు. పరిష్కరించిన తర్వాత సమస్య తీరిందని ఎవరైతే వినతి ఇచ్చారో వారి నుంచి అకనాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలన్నారు. ఇలా చేయకపోతే జవాబుదారీతనం లేకుండాపోతుందన్నారు. ఈ మార్పులు తప్పనిసరిగా స్పందనలో చేర్చాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. దీనివల్ల వినతులు ఇచ్చేవారు సంతృప్తి చెందుతారని ఆయన తెలిపారు. సమీక్షా సమావేశంలో సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌, అధికారులు పాల్గొన్నారు. (చదవండి: ప్రపంచ బ్యాంక్‌ ప్రతినిధులతో సీఎం జగన్‌ భేటీ)

సిద్ధం చేసిన ప్లాట్లకు లాటరీ నిర్వహించాలి
ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం సువర్ణాక్షరాలతో లిఖించదగ్గదని సీఎం జగన్‌ అన్నారు. పేదలకు ఉచితంగా ఇళ్ల పట్టాల పంపిణీపై సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. మార్చి 25న పట్టాల పంపిణీ కార్యక్రమం జరుగుతుందని తెలిపారు. మనకు నెలరోజులు సమయం మాత్రమే ఉందని .. యుద్ధ ప్రాతిపదికన పనులు చేయకపోతే, లక్ష్యాన్ని చేరుకోలేమని సీఎం జగన్‌ అధికారులకు సూచనలు ఇచ్చారు. ఇళ్ల పట్టాల కోసం గుర్తించిన భూములను శరవేగంగా అభివృద్ధి చేసి ప్లాట్లు డెవలప్‌ చేయాలన్నారు. ఇళ్ల పట్టాల కోసం వీలైనంత త్వరగా భూమిని సమీకరించుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. అలాగే సిద్ధం చేసిన ప్లాట్లలో వెంటనే లాటరీ నిర్వహించి ఏ ప్లాటు.. ఏ లబ్ధిదారుడికి చెందిందో ప్రకటించాలన్నారు. భూసేకరణ సమయంలో కలెక్టర్లు మానవతా దృక్పథంతో ఉండాలని సీఎం జగన్‌ పిలుపునిచ్చారు. పేదలకు ఇళ్ల స్థలాల రూపంలో మనం మంచి కార్యక్రమం చేస్తున్నామని ఆయన తెలిపారు.

ఫలానా కలెక్టర్‌ అన్యాయంగా తీసుకున్నాడనే మాట ఎక్కడా వినిపించకూడదని సీఎం జగన్‌ ఆదేశించారు. కలెక్టర్లు ఉదారంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. ఇళ్ల పట్టాల కార్యక్రమంలో సమస్యలను తక్షణమే పరిష్కరించడానికి వివిధ జిల్లాలకు సీఎస్‌ సహా సీఎం కార్యదర్శులను నియమిస్తున్నట్లు తెలిపారు. సీఎస్‌ నీలం సాహ్ని, సీఎం ప్రధాన కార్యదర్శి ప్రవీణ్‌, ప్రకాష్‌లకు తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలను అప్పగించామని తెలిపారు. ముఖ్యమంత్రి ప్రధాన సలహాదారు అజేయ కల్లంకు ప్రకాశం, నెల్లూరు జిల్లాలను అప్పగించారు. రాయలసీమ జిల్లాలను ముఖ్యమంత్రి కార్యదర్శి ఆరోకియా రాజుకు అప్పగించారు. ఉత్తరాంధ్ర జిల్లాలను ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి ధనుంజయ్‌ రెడ్డికి అప్పగించినట్లు సీఎం జగన్‌ తెలిపారు. కలెక్టర్లుకు ఏ సహాయం కావాలన్నా సంబంధిత అధికారులను సంప్రదించాలని సీఎం పేర్కొన్నారు. మార్చి 1 కల్లా ఇళ్ల స్థలాల కోసం భూములన్నీ పొజిషన్‌లోకి తీసుకునేలా చూడాలని సీఎం జగన్‌ అధికారులను అదేశించారు. ప్లాట్లు మార్కింగ్‌ చేసి వెంటనే లాటరీ ద్వారా కేటాయించాలన్నారు. 

లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో
అదనపు లబ్ధిదారులకు ఒకటో తారీఖున పెన్షన్లు, బియ్యం కార్డులు ఇచ్చేలా ప్రయత్నాలు చేయాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. పెన్షన్లు, బియ్యం కార్డులను రీ వెరిఫికేషన్‌ చేసిన తర్వాత ఆ జాబితాలను గ్రామ సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. పెన్షన్లకు సంబంధించి ఖరారు చేసిన జాబితాలను రేపటి నుంచి శాశ్వతంగా అందుబాటులో ఉంచుతామని తెలిపారు. బియ్యం కార్డులకు సంబంధించి మూడు నాలుగు రోజుల్లో రీవెరిఫికేషన్‌ పూర్తి చేసి తుది జాబితా సచివాలయాల్లో ఉంచుతామని అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. 

రీ వెరిఫై అయిన తర్వాత పెన్షన్లు, బియ్యం కార్డుల లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పనిసరిగా ఉంచాలని సీఎం జగన్‌ అధికారులకు సూచించారు. హౌస్‌ హోల్డ్స్‌ సర్వే, మ్యాపింగ్‌ పూర్తిచేయాలని ఆయన అధికారులు ఆదేశాలు ఇచ్చారు. ప్రతి వాలంటీర్‌కు యాభై ఇళ్ల కేటాయింపుతో క్లస్టర్‌ మ్యాపింగ్‌ చేయాలన్నారు. దీని వల్ల డోర్‌ డెలివరీ పద్ధతిలో ఒకరోజు వ్యవధిలో పూర్తి చేయడానికి అవకాశం ఉంటుందన్న సీఎం జగన్‌ తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు హాజరు తప్పనిసరి ఉండాలన్నారు. దీంతో తనకు అప్పగించిన యాభై కుటుంబాల బాధ్యత సక్రమంగా నిర్వర్తిస్తున్నారా లేదా తెలుసుకునే అవకాశం ఉంటుందని సీఎం జగన్‌ తెలిపారు.



ఎస్పీ సెంథిల్‌కు సీఎం జగన్‌ అభినందనలు 
మార్చి 1 కల్లా అన్ని దిశ పోలీస్‌స్టేషన్లూ సిద్ధం కావాలని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీసు, మహిళా మిత్రలను పెట్టామని తెలిపారు. వారి సేవలను మహిళలు వినియోగించుకోవాలన్నారు. బెల్టు షాపులు, అక్రమ మద్యం తయారీ, ఇంకా ఏదైనా జరిగితే, ఈ మహిళా పోలీసుల నుంచి సమాచారం తెప్పించుకోవాలన్నారు. తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాల్లో బెల్టుషాపులు నడుస్తున్నట్టు సమాచారం వస్తోందని సీఎం అధికారులకు తెలిపారు. వివరాలు తెప్పించుకుని కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం జగన్‌ అధికారును ఆదేశించారు. సంబంధిత జిల్లాల ఎస్పీలు గట్టి సంకేతాలు పంపించాల్సిన అవసరం ఉందన్నారు. బెల్టు షాపులు నిర్వహించే వారికి, అక్రమ మద్యం తయారీ చేసే వారికి భయం రావాలని సీఎం జగన్‌ అన్నారు.

మహిళా పోలీసుల నుంచి కాల్స్‌ ఎస్పీలకే కాదు, ప్రత్యేక బృందాలకూ వెళ్తాయన్నారు. గ్రామ సచివాలయాలను, మహిళా పోలీసులను, మహిళా మిత్రల వ్యవస్థలను ఎస్పీలు అధీనంలోకి తీసుకోవాలని ఆదేశించారు. చిత్తూరు జిల్లాలో బాలిక అత్యాచారం, హత్య ఘటన విషయంలో వెంటనే తీర్పు వచ్చిన విషయాన్ని డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీఎం జగన్‌కు వివరించారు. పోలీసులు శరవేగంగా పనిచేసి ఛార్జిషీటు వేశారని, గట్టి ఆధారాలను కోర్టు ముందు ఉంచారని డీజీపీ తెలిపారు. చిత్తూరు జిల్లా ఎస్పీ సెంథిల్‌ను ఈ సందర్భంగా సీఎం వైఎస్‌​ జగన్‌ అభినందించారు. ప్రత్యేక కోర్టుల ఏర్పాటుపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిందిగా సీఎస్‌కు ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement