మిగిలిపోయిన అర్హులకు గడువులోగా ఇవ్వాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review Meeting On Spandana Program At Tadepalli | Sakshi
Sakshi News home page

మిగిలిపోయిన అర్హులకు గడువులోగా ఇవ్వాలి: సీఎం జగన్‌

Published Wed, Aug 25 2021 12:58 PM | Last Updated on Thu, Aug 26 2021 7:45 AM

CM YS Jagan Review Meeting On Spandana Program At Tadepalli - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

సాక్షి అమరావతి: పేదలకు ఇళ్ల పట్టాలతో పాటు వైఎస్సార్‌ చేయూత, నేతన్న నేస్తం, మత్స్యకార భరోసా తదితర పథకాలకు సంబంధించి ఇంకా మిగిలిపోయిన వారు ఎవరైనా దరఖాస్తు చేసుకుంటే వారి అర్హతను 90 రోజుల్లోగా నిర్ధారించి ఆర్నెల్ల్లకు ఒకసారి చొప్పున ఏడాదిలో రెండు సార్లు మంజూరు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. ఇక పెన్షన్, బియ్యం కార్డు, ఆరోగ్యశ్రీ కార్డుల కోసం దరఖాస్తు చేసుకుంటే అర్హులను 21 రోజుల్లోగా నిర్ధారించడంతో పాటు ప్రతి మూడు నెలలకు (90 రోజులకు) ఒకసారి చొప్పున ఏడాదిలో 4 సార్లు మంజూరు చేయాలని సూచించారు. దీనివల్ల వ్యవస్థలపై ప్రజలకు విశ్వాసం పెరుగుతుందన్నారు. సచివాలయాల్లో తనిఖీలు, దరఖాస్తుల పరిష్కారం, పథకాల మంజూరు, ఉపాధి హామీ పనులపై ముఖ్యమంత్రి జగన్‌ బుధవారం తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో మార్గనిర్దేశం చేశారు. ఆ వివరాలివీ..

నెలలో రెండు రోజులు ఇంటింటికీ వెళ్లాలి 
నెలలో చివరి శుక్రవారం, శనివారం రోజు గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బంది వలంటీర్లతో కలసి బృందంగా ఏర్పడి ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించాలి. వాటిపట్ల అవగాహన కల్పించాలి. పౌరుల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకోవాలి. సచివాలయాల సిబ్బంది ఫోన్‌నంబర్లను వారికి ఇవ్వాలి. కరపత్రాలను కూడా అందజేయాలి.

చురుగ్గా భవనాల నిర్మాణం 
10,408 ఆర్బీకేల నిర్మాణంపై మరింత చురుగ్గా పనిచేయాలి. వీటిని డిసెంబర్‌ 31 కల్లా పూర్తి చేయాలి. తూర్పు గోదావరి, కర్నూలు, నెల్లూరు జిల్లాల్లో మరింత ధ్యాస పెట్టాలి. మొత్తం 8,585 వైఎస్సార్‌ విలేజ్‌ హెల్త్‌ క్లినిక్స్‌ నిర్మిస్తున్నాం. వీటిని కూడా డిసెంబర్‌ 31 నాటికి పూర్తి చేయాలి. భవనాల నిర్మాణంపై కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల అధికారులు మరింత శ్రద్ధ చూపాలి. తొలిదశలో 2,541 ఏఎంసీయూలు, బీఎంసీయూల భవనాల నిర్మాణాన్ని లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. 2,253 భవనాల పనులు పురోగతిలో ఉన్నాయి. తూర్పు గోదావరి, కృష్ణా, విజయనగరం జిల్లాల్లో పనులు గ్రౌండింగ్‌ చేయాలి. డిసెంబర్‌ 31 నాటికి ఇవి కూడా పూర్తవ్వాలి. అమూల్‌ ఆధ్వర్యంలో సేకరణ జరుగుతున్న ప్రాంతాల్లో పాలరేటు రూ.5 నుంచి రూ.15 వరకు రైతులకు అదనంగా లభిస్తుంది. అమూల్, బీఎంసీయూల వల్ల ఇది సాధ్యమవుతోంది.

డిజిటల్‌ లైబ్రరీలు
తొలిదశలో మొత్తం 4,530 డిజిటల్‌ లైబ్రరీల నిర్మాణ లక్ష్యం కాగా 4,150 మంజూరయ్యాయి. 1,106 లైబ్రరీల పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంకా 380 గ్రామాల్లో మొదలు కాలేదు.  ఆగస్టు 31 నాటికి కచ్చితంగా నిర్మాణ పనులు ప్రారంభించాలి. డిసెంబర్‌ 31 నాటికి నిర్మాణ పనులు పూర్తి కావాలి. దీనివల్ల వర్క్‌ఫ్రమ్‌ హోం కాన్సెప్ట్‌ను అమలు చేయగలుగుతాం. మొక్కలు నాటే కార్యక్రమంపై దృష్టి సారించడమే కాకుండా ఏపుగా ఎదిగేలా శ్రద్ధ వహించాలి. సమీక్షలో ఉప ముఖ్యమంత్రి (వైద్య, ఆరోగ్యం) ఆళ్ల నాని, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సీఎస్‌ ఆదిత్యనాథ్‌దాస్, అడిషనల్‌ డీజీపీ ఎ.రవిశంకర్, ల్యాండ్‌ అడ్మినిస్ట్రేషన్‌ చీఫ్‌ కమిషనర్‌ నీరబ్‌కుమార్‌ ప్రసాద్, గృహనిర్మాణశాఖ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌జైన్, వైద్య ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఉపాధి పనులపై దృష్టి 
గత సర్కారు బకాయి పెట్టిన ఉపాధి హామీ డబ్బులను మన ప్రభుత్వం చెల్లించాల్సి వస్తోంది. కేంద్రం నుంచి కూడా మనకు నిధులు రావాల్సి ఉంది. ఉపాధి హామీ పనులపై పూర్తిగా దృష్టి పెట్టాలి. గ్రామం రూపురేఖలు పూర్తిగా మార్చబోయే వ్యవస్ధను మనం ఏర్పాటు చేస్తున్నాం. గ్రామాల్లోకి అడుగుపెట్టిన వెంటనే ఓ రకమైన సంతృప్తి కలుగుతుంది. గ్రామ సచివాలయం, ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున సేవలందించే వలంటీర్లు, ఇంగ్లిష్‌ మీడియం స్కూలు, మరో నాలుగు అడుగులు వేస్తే కనిపించే వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్, ఆర్బీకే, మరో నాలుగడుగులు వేస్తే డిజిటల్‌ లైబ్రరీ, ఇంగ్లిష్‌ మీడియం ఫౌండేషన్‌ స్కూల్‌.. వీటితో పాటు పాల సేకరణకు సంబంధించి ఏఎంసీయూ, బీఎంసీయూలు కనిపిస్తాయి. ఇవన్నీ గ్రామాల స్వరూపాన్ని పూర్తిగా మార్చేస్తాయి. గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ విలేజ్‌ క్లినిక్స్, ఏఎంసీయూ, బీఎంసీయూల నిర్మాణాలకు సంబంధించి అక్టోబర్‌ 2 నాటికి 75 శాతం భవనాలు పూర్తి చేసేలా ధ్యాస పెట్టాలి. అప్పటికి పూర్తి చేయగలిగితే మంచి సానుకూల సందేశాన్ని ఇచ్చినట్లవుతుంది. 

సిటిజన్‌ అవుట్‌ రీచ్‌... 
తనిఖీల సమయంలో అధికారులు కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. సిటిజన్‌ అవుట్‌రీచ్‌ కార్యక్రమంపై పర్యవేక్షణ చేయాలి. గ్రామ, వార్డు సచివాలయాల పరిధిలో వివిధ సంక్షేమ పథకాల పట్ల అవగాహన కల్పించాలి. సచివాలయాల సిబ్బంది లబ్ధిదారులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. పథకం అమలుకు ఒకరోజు ముందు ఈ సమావేశం జరగాలి. పథకం ప్రయోజనాలు అందిన తర్వాత వెల్ఫేర్‌ అసిస్టెంట్‌ వలంటీర్‌తో కలిసి లబ్ధిదారుడి వద్దకు వెళ్లి డిజిటల్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌తోపాటు భౌతికంగా రశీదు కూడా ఇవ్వాలి.

తిరస్కరణకు కారణాలను పరిశీలించాలి
కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లు, మున్సిపల్‌ కమిషనర్లు, ఐటీడీఏ పీవోలు, సబ్‌ కలెక్టర్లు అందరినీ గ్రామ, వార్డు సచివాలయాల్లో తనిఖీలు చేయాలని చెప్పాం. తనిఖీల విషయంలో అందరూ మంచి పురోగతి చూపారు. వీటి ద్వారా సచివాలయాల సమర్థత మరింత పెరిగి ప్రజలకు మెరుగ్గా సేవలు అందించాలి. వివిధ శాఖల పోస్టర్లు, సంక్షేమ పథకాల క్యాలెండర్లు, బయోమెట్రిక్‌ హాజరు, రిజిస్టర్లు, రికార్డుల నిర్వహణ తీరుతోపాటు సచివాలయాల సిబ్బంది, వలంటీర్ల పనితీరును కూడా తనిఖీల సమయంలో పరిశీలించాలి. వారికి అవగాహన కల్పించాలి. ఫిర్యాదుల (గ్రీవెన్స్‌) నంబర్‌ను ప్రదర్శిస్తున్నారో లేదో గమనించాలి. తిరస్కరించిన అర్జీలను ఏ ప్రాతిపదికన నిరాకరించారో చూడాలి. ఒక అర్జీని తిరస్కరించినప్పుడు దరఖాస్తుదారుడు మళ్లీ దరఖాస్తు చేస్తే అది జేసీ వద్దకు వెళ్లాలి. దీనిపై ఆ అధికారి పరిశీలన చేయాలి. ఇది చాలా ముఖ్యమైన అంశం.

చదవండి: సీఎం జగన్‌ సమక్షంలో న్యుమోకాకల్‌ కాంజుగేట్‌ వ్యాక్సిన్‌ డ్రైవ్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement