సాక్షి, తాడేపల్లి: కోర్టు స్టే ఉన్నచోట్ల మినహా, మిగిలిన ప్రాంతాల్లో డిసెంబరు 25న డి-ఫామ్ పట్టాలతో ఇళ్ల స్థలాలు పంపిణీ చేస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తెలిపారు. అదే రోజున 15 లక్షల ఇళ్ల నిర్మాణం కూడా మొదలు పెడతామని పేర్కొన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకుంటే అర్హులకూ 90 రోజుల్లో అవకాశం ఇస్తామన్నామని, ఈ మేరకు 1.20 లక్షల మందిని కొత్తగా జాబితాలో చేర్చినట్లు వెల్లడించారు. తన క్యాంపు కార్యాలయంలో స్పందన కార్యక్రమంపై సీఎం జగన్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, జేసీలతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఇళ్ల పట్టాల పంపిణీ, జగనన్న తోడు పథకం, ఉపాధి హామీ పనులు, నాడు- నేడు, కోవిడ్-19 నివారణ తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు. డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శ్రీరంగనాథరాజు, ఆదిమూలపు సురేష్, డీజీపీ గౌతమ్ సవాంగ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.
వాటి మార్కెట్ విలువ రూ. 23 వేల కోట్లు
ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. ‘‘తొలుత మార్చి 25న ఉగాది రోజు ఇవ్వాలనుకున్నాం. ఆ తర్వాత ఏప్రిల్ 14, అంబేడ్కర్ జయంతి రోజున, ఆ తర్వాత ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తైన సందర్భంగా మే 30న, దివంగత నేత వైయస్సార్ జయంతి రోజు అయిన జూలై 8న, ఆ తర్వాత ఆగస్టు 15న, చివరగా అక్టోబరు 2 గాంధీ జయంతి రోజున పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలనుకున్నాం. కానీ అన్నీ వాయిదా పడ్డాయి. ప్రతిపక్ష కుటిల రాజకీయాల వల్ల పేదల ఇళ్ల స్థలాలు ఇవ్వడం కోసం న్యాయపోరాటం చేయాల్సి వస్తోంది’’అని పేర్కొన్నారు. ‘‘గతంలో పెద్ద పారిశ్రామిక వేత్తలకు ఎకరాలకు ఎకరాలు కట్టబెట్టారు. కానీ ఇప్పుడు పేదలకు ఇప్పుడు సెంటు, సెంటున్నర స్ధలం ఇస్తామంటే అడ్డుకుంటున్నారు. ఈ యుద్ధంలో గెలుస్తాం. దేవుడు మనకు అండగా ఉంటాడు. ఇది చాలా గొప్ప కార్యక్రమం. ఇళ్ల స్థలాల కోసం 66,518 ఎకరాలు సేకరించాం. వాటి మార్కెట్ విలువ రూ.23 వేల కోట్లు. మొత్తం 30,68,821 మంది పేదలకు పంచబోతున్నాం’’అని ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేశారు.
‘‘ఇక కొత్త దరఖాస్తుల నేపథ్యంలో 80 వేల మందికి కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంది. కాబట్టి వేగంగా ఆ పని చేయండి. డిసెంబరు 10వ తేదీ లోగా భూసేకరణతో పాటు, ప్లాట్ల గుర్తింపు 100 శాతం పూర్తి కావాలి. అర్హులైన లబ్ధిదారులు ఇంకా ఎక్కడైనా మిగిలిపోతే, వారినీ కొత్తవారి జాబితాలో చేర్చాలి. వచ్చే నెల 25న ఇళ్ల స్థలాలు పంపిణీ చేసే నాటికి ఇంటి నిర్మాణాలకు సంబంధించిన లబ్దిదారుల జియో ట్యాగింగ్ పూర్తి కావాలి. పథకాన్ని అమలు చేసేందుకు ఆరోజు నాటికి కలెక్టర్లు సిద్ధంగా ఉండాలి. కోర్టు స్టేలు ఉన్నచోట ఆ స్టేలను వెకేట్ చేయించుకునేలా కలెక్టర్లు గట్టి ప్రయత్నం చేయాలి’’ అని సీఎం జగన్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. (చదవండి: తుంగభద్ర పుష్కరాలకు సీఎం వైఎస్ జగన్)
సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్- ముఖ్యాంశాలు
1). ఇళ్ల స్థలాల పట్టాల పంపిణీకి ఏర్పాట్లు. పక్కా ఇళ్ల నిర్మాణం:
- పథకంలో ఇప్పటి వరకు 30,68,281 మంది లబ్ధిదారులను గుర్తించాం.
- అధికారంలోకి వచ్చిన మూడు నెలల నుంచే ఈ కార్యక్రమం మొదలు పెట్టాం.
- గిట్టని వాళ్లు కోర్టులకు వెళ్లారు, పేదలకు ఇంటి స్థలం ఇవ్వకుండా రాజకీయం చేస్తున్నారు.
టిడ్కో ఇళ్లు–ఇళ్ల నిర్మాణం:
- టిడ్కో ద్వారా రాష్ట్రంలో 2,62,216 ఇళ్ల నిర్మాణం.
- వాటిలో ఇప్పటికే 1,43,600 ఇళ్లు నిర్మాణంలో ఉన్నాయి. వాటిని 300 చదురపు అడుగుల్లో నిర్మిస్తున్నాం
- ఇంకా 365 చదరపు అడుగుల్లో 44,300 ఇళ్లు, 430 చదరపు అడుగుల్లో 74,300 ఇళ్ల నిర్మాణం జరుగుతోంది.
గత ప్రభుత్వ బకాయిలు:
- టిడ్కోకు సంబంధించి గత ప్రభుత్వం రూ.3200 కోట్లు బకాయి పెట్టి పోయింది.
- ఒక వైపు ఆ బకాయిలు తీరుస్తూనే, మన ప్రభుత్వం వచ్చాక ప్రజల కోసం ఇప్పటికే రూ.1200 కోట్లు ఇచ్చాం.
- ఈ వారంలో మరో రూ.400 కోట్లు, ఇంకో రూ.600 కోట్లు 15 రోజుల్లో ఇస్తాం.
మూడేళ్ల పాటు ప్రాజెక్టు:
- రూ.2500 కోట్లు టిడ్కో ఇళ్ల మౌలిక వసతుల కోసం ఖర్చు, ఆ మేరకు టెండర్లు పిలవబోతున్నాం.
- డిసెంబరు 15 నాటికి ఆ టెండర్ల ప్రక్రియ పూర్తి చేయాలి.
- ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం కోసం ప్రభుత్వం చేయబోయే వ్యయం రూ.9550 కోట్లు.
- అందుకే ఈ ఏడాది, వచ్చే ఏడాది, ఆ తర్వాత ఏడాది కూడా పనులు చేపట్టి పూర్తి చేస్తాం.
బాబు ముద్దా? జగన్ ముద్దా?:
- వలంటీర్లు వచ్చే సోమవారం (23వ తేదీ) నుంచి ఈనెల 30వ తేదీ వరకు టిడ్కో లబ్ధిదారుల్లో 300 చదరపు అడుగుల ఇల్లు పొందుతున్న వారి దగ్గరకు ప్రభుత్వ లెటర్ తీసుకుని పోతారు.
- మీకు బాబు ముద్దా? జగన్ ముద్దా? అని అడుగుతారు.
- మీకు బాబు స్కీమ్ కావాలా? జగన్ స్కీమ్ కావాలా? అని కూడా అడుగుతారు.
- అందులో బాబు స్కీమ్‌లో ఏముంటుంది? జగన్ స్కీమ్‌లో ఏముంటుంది? అన్నది స్పష్టంగా రాయండి.
బాబు స్కీమ్:
- లబ్ధిదారుడు రూ.3 లక్షల అప్పును నెలకు రూ.3 వేల చొప్పున 20 ఏళ్ల పాటు వడ్డీతో సహా మొత్తం రూ.7 లక్షలు కట్టాలి.
- ఆ తర్వాతే ఇంటిపై హక్కులు వారి చేతికి వస్తాయి.
- అప్పుడే ఆ ఇంటి పట్టా వారికందుతుంది.
జగన్ స్కీమ్:
- కేవలం ఒక్క రూపాయితో వెంటనే అగ్రిమెంట్ ఆఫ్ సేల్, ఏ అప్పు లేకుండా ఇప్పుడే సర్వ హక్కులతో ఇల్లు.
- తర్వాత పక్కాగా ఫ్రీ రిజిస్ట్రేషన్.
- ఈ వివరాలు చెప్పి, వారికి ఏ స్కీమ్ కావాలన్నది తెలుసుకోండి.
1 రూపాయికే అగ్రిమెంట్ ఆఫ్ సేల్:
- డిసెంబరు 25న, 300 చదరపు అడుగుల టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ చేస్తాం.
- పేదలకు హక్కుగా ఇచ్చిన ఇళ్లను బలవంతంగా స్వాధీనం చేసుకోవడం ఎందుకు?
- చంద్రబాబు ఏం మాట్లాడుతున్నాడో ప్రజలకు కూడా అర్ధం కావడం లేదు.
- జగన్ స్కీమ్ కావాలనుకున్న వారికి కూడా డిసెంబరు 25న కేవలం ఒక్క రూపాయితో అగ్రిమెంట్ ఆఫ్ సేల్.
ఆ ఇళ్లకూ చంద్రబాబు బకాయిలు:
- గ్రామీణ ఇళ్లకు సంబంధించి చంద్రబాబు వదిలి పెట్టి పోయిన బకాయిలు రూ.1432 కోట్లు.
- అందులో ఈ వారంలో సుమారు రూ.470 కోట్లు విడుదల చేయబోతున్నాం.
- ఆ తర్వాత మిగిలిన రూ.962 కోట్లు వచ్చే డిసెంబరు 25న బటన్ నొక్కి విడుదల చేస్తాం.
కొత్త ఇళ్ల నిర్మాణం:
- నవరత్నాలులో చెప్పిన మరో కార్యక్రమం అమలు చేయబోతున్నాం
- తొలి దశలో దాదాపు 15.10 లక్షల ఇళ్ల నిర్మాణం.
- ఒక్కో ఇంటిని రూ.1.80 లక్షల వ్యయంతో, అన్నీ ఒకే మాదిరిగా నిర్మిస్తారు.
- ఒక్క రూపాయి కూడా పేదలపై భారం పడదు.
- ఇంటి నిర్మాణానికి అవసరమైన పూర్తి సామాగ్రి సెంట్రల్ ప్రొక్యూర్‌మెంట్ ద్వారా సరఫరా. నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం.
- క్వాలిటీ అనేది ప్రభుత్వానికి ట్రేడ్ మార్క్. బ్రాండ్ ఇమేజ్.కాబట్టి ఎక్కడా రాజీ పడొద్దు.
- పేదల ఇళ్ల నిర్మాణానికి ఇసుక ఉచితంగా సరఫరా చేస్తారు.
- 67.50 లక్షల టన్నుల సిమెంట్, 7.20 లక్షల టన్నుల ఇనుము అవసరం అవుతుంది.
- ఈ ఇళ్ల నిర్మాణం వల్ల 21 కోట్ల పని దినాలు లభించనున్నాయి.
- ఆ విధంగా దగ్గరుండి పేదలకు ఇళ్లు కట్టించి ఇస్తాం.
- మెటేరియల్ ఇస్తాం. లేబర్ కాంపొనెంట్ వారికే ఇస్తాం.
సచివాలయాల పాత్ర:
- ఇళ్ల నిర్మాణంలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషిప్తాయి.
- డిజిటల్ అసిస్టెంట్, వెల్ఫేర్ అసిస్టెంట్, ఇంజనీరింగ్ అసిస్టెంట్‌తో పాటు, వలంటీర్లు కూడా పని చేస్తారు.
- లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలు ప్రారంభించడం మొదలు, వారికి అవసరమైన అన్ని పనులు చేస్తారు.
- జిల్లా స్థాయిలో జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) ఆ బా«ధ్యత చూస్తారు.
- ఇంజనీరింగ్ అసిస్టెంట్లు క్వాలిఫైడ్. వారి సేవలు ఉపయోగించుకోండి. అందుకు తగిన ఎస్‌ఓపీ ఖరారు చేయండి.
ఎప్పటిలోగా ఆ ఇళ్లు?:
- తొలి దశలో నిర్మించనున్న ఇళ్లను 18 నెలల్లో (2022 జూన్ నాటికి) పూర్తి చేయాలని లక్ష్యం,
- రెండో దశలో గ్రామీణ ప్రాంతాల్లో 13 లక్షల ఇళ్లు నిర్మిస్తారు. వచ్చే ఏడాది, 2021 డిసెంబరులో వాటి నిర్మాణం ప్రారంభించి 2023 జూన్ నాటికి పూర్తి చేయాలని లక్ష్యం.
- వచ్చే ఏడాది ఇళ్ల నిర్మాణం అనేది ప్రభుత్వ అతి పెద్ద కార్యక్రమం.
- తొలి దశలో 167 నియోజకవర్గాలలో ఇళ్ల నిర్మాణాలు మొదలు కానున్నాయి.
2). జగనన్న తోడు.
- నవంబరు 25న పథకం ప్రారంభం.
- వీధుల్లో చిరు వ్యాపారులకు ఐడీ కార్డులు ఇవ్వడంతో పాటు, వారికి వడ్డీ లేకుండా రూ.10 వేల రుణం.
- వడ్డీని ప్రభుత్వం బ్యాంకులకు కడుతుంది.
- పథకంలో ఇప్పటి వరకు 6.29 లక్షల దరఖాస్తులకు బ్యాంకులు టైఅప్ అయ్యాయి.
- మిగిలిన దరఖాస్తులను కూడా వెంటనే బ్యాంకులకు పంపాలి.
- ఈ నెల 24వ తేదీలోగా బ్యాంకులతో లబ్ధిదారులను అనుసంధానం చేసే కార్యక్రమాన్ని కలెక్టర్లు పూర్తి చేయాలి.
3). జాతీయ ఉపాథి హామీ పనులు:
- పనులు బాగా జరుగుతున్నాయి. ఇంకా కొన్నింటిపై ఫోకస్ పెట్టాల్సి ఉంది.
- దాదాపు రూ.150 కోట్ల విలువైన పనులు ఒక్కో వారంలో జరుగుతున్నాయి.
- అదే సమయంలో కేవలం రూ.150 కోట్లు మాత్రమే బకాయి ఉండగా, ఈనాడు పూర్తిగా తప్పుడు వార్తలు రాస్తోంది.
- గ్రామాల్లో పనులకు ఎవ్వరూ రాకుండా కుటిల ప్రయత్నం. బిల్లులు ఇవ్వడం లేదని తప్పుడు వార్తలు రాస్తోంది.
అవి సకాలంలో పూర్తి కావాలి:
- గ్రామ, వార్డు సచివాలయాలు, ఆర్బీకేలు, బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లు (బీఎంసీయూ), వైయస్సార్ ఆరోగ్య కేంద్రాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, స్కూళ్లకు ప్రహరీలల నిర్మాణం వచ్చే ఏడాది మార్చి 31 వరకు పూర్తి కావాలి.
- బీఎంసీయూల నిర్మాణానికి సంబంధించి ఆర్బీకేల పక్కనే భూములు ఇచ్చేలా చూడండి.
- ఈనెల 30 నాటికి స్థలం ఇవ్వడంతో పాటు, అన్నీ మంజూరు చేయాలి.
- వచ్చే నెల 15 నాటికి తప్పనిసరిగా పనులు మొదలు కావాలి.
- ప్రతి నియోజకవర్గంలో రూ.10 కోట్ల విలువైన పనులు చేయాలి. సకాలంలో అవి పూర్తి చేస్తే, అదనంగా మరో రూ.5 కోట్ల విలువైన పనులు.
- అన్ని పనుల్లో గ్రామ, సచివాలయాల్లో ఉన్న గ్రామ ఇంజనీరింగ్ అసిస్టెంట్లను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలి.
4). నాడు–నేడు
స్కూళ్లు:
- తొలిదశలో 15,715 స్కూళ్లలో పనులు చేపట్టగా, 78 శాతం పూర్తి.
- డిసెంబరు 31 టార్గెట్‌గా పనులు పూర్తి చేయాలి. దీనిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి.
- ఇంకా బాత్‌రూమ్‌ల శ్లాబ్ వంటి పనులు జరగాల్సిన262 చోట్ల అవసరమైన ఇసుక, సిమెంటు సరఫరా చేయాలి.
- పేరెంట్ కమిటీలపైనే పూర్తి భారం వేయకుండా జేసీలు బాధ్యత తీసుకుని ప్రతి రెండు రోజులకు ఒకసారి సమీక్షించాలి.
జగనన్న విద్యా కానుక:
- పిల్లలకు కిట్ ఇచ్చాం. అందులో ఏమైనా లోపాలు ఉంటే, వాటిని సవరించండి.
- నాణ్యతపై పూర్తి దృష్టి పెట్టాలి.
- పిల్లలు ఎవరికైనా షూ సైజ్ సరిపోకపోయినా, లేక పెద్దగా అయినా తెలుసుకోండి. ఆ మేరకు ప్రతి స్కూల్‌లో నోటీసులు పెట్టి, పూర్తి వివరాలు సేకరించండి.
- పిల్లలను వాటిని స్కూల్‌కు స్వయంగా తీసుకురమ్మని చెప్పి, అక్కడే పరిష్కారం చూపాలి.
- బ్యాగ్ ఎలా ఉందో చూడండి. ఒకవేళ చినిగిపోతే క్వాలిటీ పెంచాలి.
- పిల్లలకు అది ఒక ప్యాషన్. వారు బాగా చదువుకోవాలి.
- కాబట్టి కలెక్టర్లు మానవతా దృక్పథంతో వ్యవహరించాలి. ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
- మగ పిల్లలకు మూడు జతల యూనిఫామ్ కుట్టుకూలీ రూ.40 చొప్పున మొత్తం రూ.120 తల్లుల ఖాతాలో పడుతుందా? లేదా? అన్నది కూడా చూడాలి.
- వచ్చే సోమవారం నుంచి ఈ కార్యక్రమం జరగాలి.
అంగన్‌వాడీ కేంద్రాలు (వైఎస్సార్ ప్రిప్రైమరీ స్కూళ్లు):
- రాష్ట్రంలో 27,543 అంగన్‌వాడీలు అద్దె భవనాల్లో ఉన్నాయి.
- సొంత భవనాల నిర్మాణం కోసం 22,630 స్థలాలు గుర్తించారు.
ఆహ్లాదకర వాతావరణం:
- ఊరిలోకి రాగానే సచివాలయం, వైయస్సార్ విలేజ్ క్లినిక్, ఆర్బీకే, ప్రిప్రైమరీ స్కూల్.. ఇలా అన్నీ కనిపిస్తాయి.
- అంత చక్కటి పరిస్థితి మీరు చేశారంటే, మీ హయాంలో జరిగిందని అందరూ చెప్పుకుంటారు. అలా మీరు గుర్తుండిపోతారు.
- కాబట్టి కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలి.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు
- భవిష్యత్తులో అవి గ్రామాల్లో వైద్య రంగంలో పెను మార్పులు తీసుకురానున్నాయి.
- వాటిలో హెల్త్ అసిస్టెంట్లు ఉంటారు, ఆశా వర్కర్లు కూడా ఉంటారు.
- ఏ నిర్మాణంలో అయినా నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి.
- జేసీలు దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి.
5). కోవిడ్–19
- రాష్ట్రంలో ఇప్పుడు రోజూ దాదాపు 75 వేల పరీక్షలు చేస్తున్నాము.
- మరోవైపు పాజిటివిటీ రేటు కూడా తగ్గింది.
- ఇప్పటి వరకు రాష్ట్రంలో 91,54,263 పరీక్షలు
- అందులో 8.54 లక్షల పాజిటివిటీ కేసులు. 9.33 శాతం
- ప్రతి 10 లక్షల మందిలో 1,71,428 పరీక్షలు.
- పాజిటివ్ కేసులు కూడా గత నెలలో తగ్గాయి.
- కోవిడ్ నివారణ చర్యల్లో జిల్లాల కలెక్టర్లును అభినందించాలి.
కోవిడ్ సెకండ్ వేవ్ వస్తోంది:
- మొత్తం యూరప్ కోవిడ్‌తో వణుకుతోంది.
- ఢిల్లీలో మరో లాక్‌డౌన్‌కు రెడీ. ఫ్రాన్స్, లండన్‌లో షట్‌డౌన్. అమెరికా కూడా తీవ్ర ఇబ్బంది పడుతోంది.
- ప్రపంచంలోని చాలా దేశాల్లో వస్తోంది.
- అక్కడ మొదలు కాగానే, ఇక్కడా వస్తోంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి.
- స్కూళ్లు, కాలేజీలు తెరుస్తున్నాం కాబట్టి, కలెక్టర్లు శ్రద్ద తీసుకోవాలి.
- ప్రస్తుతానికి కోవిడ్ పాజిటవ్ కేసులు తగ్గినా, సెకండ్ వేవ్ వస్తుంది కాబట్టి కలెక్టర్లు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
104 నెంబరు:
- 104 నెంబర్‌ను సింగిల్ పాయింట్ కాంటాక్ట్‌గా అభివృద్ది చేయాలి.
- 104 నంబరుపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాలి.
- ఆ నెంబరుకు ఫోన్ చేస్తే 30 నిమిషాల్లో బెడ్ కేటాయించాలి.
హెల్ప్ డెస్క్‌లు– సేవలు:
- ప్రతి ఆస్పత్రిలో హెల్ప్ డెస్క్‌లు ఉండేలా చూడాలి.
- అన్ని ప్రభుత్వ, ప్రై వేటు ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్లో తప్పనిసరిగా హెల్ప్ డెస్కులు ఉండాలి.
- అన్ని ఆరోగ్యశ్రీ ఆస్పత్రులలో డిసెంబరు 10 నాటికి ఆరోగ్యమిత్రలతో హెల్ప్ డెస్క్‌లు, సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలి.
- అదే విధంగా ఆరోగ్యమిత్రలకు శిక్షణ కార్యక్రమం కూడా ముగించాలి.
- ఆ హెల్ప్ డెస్కులలో కేవలం కూర్చోవడమే కాకుండా, ఆరోగ్యమిత్రలు ఏం చేయాలన్న దానిపై ఒక నిర్దిష్ట ఎస్‌ఓపీ ఖరారు చేయండి.
- తను ఎందుకు కూర్చున్నాడు? తాను ఏం చేయాలి? తనపై సీసీ కెమెరా నిఘా ఎందుకు ఉంది? తాను రోగులకు ఏ రకంగా సహాయం చేయాలి? అన్న దానిపై ఆరోగ్యమిత్రలకు స్పష్టమైన అవగాహన ఉండాలి.
- అదే విధంగా వారు ఆరోగ్య ఆసరా ఎలా అమలవుతోంది? అన్నది జేసీలు చూడాలి.
- అస్పత్రులలో 9800 పోస్టులు మంజూరు చేశాం. _ వాటిలో జిల్లా స్ధాయిలో కలెక్టర్లు ఆధ్వర్యంలో7700 పోస్టులు భర్తీ చేయాల్సి ఉండగా, ఇప్పటికే 5797 పోస్టులు భర్తీ అయ్యాయి.
- మిగిలిన పోస్టులు కూడా త్వరగా భర్తీకి చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు ఆదేశం.
6). ఖరీఫ్‌లో ధాన్యం సేకరణ. రబీ సాగుకు సన్నద్దం.
- ఏ పంట అయినా కూడా అమ్ముడుపోకుండా ఉంటే, దానిపై కలెక్టర్లు, జేసీలు దృష్టి పెట్టాలి.
- రైతులకు కనీస మద్దతు ఇస్తూ గ్రామ స్థాయిలో ధాన్యం సేకరిస్తున్న ఏకైక రాష్ట్రంగా గుర్తింపు.
- ఆర్బీకేల స్థాయిలో 5812 ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు.
- వాటిలో వివిధ పంటలకు సంబంధించి 4,29,481 మంది రైతులు ఆర్బీకేల వద్ద నమోదు చేసుకున్నారు.
- వరి, మొక్కజొన్న, పత్తి, వేరుశనగ, రాగి తదితర పంటలకు సంబంధించి రైతులు రిజిస్టర్ చేసుకున్నారు.
- ఆర్బీకేల వద్ద రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత 15 రోజుల లోపలే ధాన్యం కొనుగోలు చేయాలి. అంత కంటే ఆలస్యం చేయొద్దు.
- అదే విధంగా రైతుల వివరాలు, సేకరణ వివరాలు ఆర్బీకేల వద్ద తప్పనిసరిగా ప్రదర్శించాలి.
- ధాన్యం సేకరించిన 15 రోజుల్లో తప్పనిసరిగా పేమెంట్లు జరగాలి.
- కాబట్టి రైతుల పట్ల అందరూ మానవతా దృక్పథంతో ఉండాలి.
- ధాన్యం సేకరణలో ఈ–ప్రొక్యూర్‌మెంట్ తప్పనిసరి. ఎక్కడా మన రైతులకు నష్టం జరగకూడదు.
ఎఫ్‌ఏక్యూ రిలాక్స్:
- వేరుశనగ రైతుల కష్టాలు తీర్చేందుకు కనీస నాణ్యతా ప్రమాణాలు (ఎఫ్‌ఏక్యూ) లేని పంటకు కూడా గ్రేడెడ్ ఎమ్మెస్పీ రూ.4500 ప్రకటించాం.
- ఆ మేరకు ఎఫ్‌ఏక్యూలో మినహాయింపులు ఇచ్చాం.
- దీన్ని అన్ని ఆర్బీకేల వద్ద బాగా ప్రచారం చేయాలి.
రబీ సాగు – సన్నద్ధత:
- ఆర్బీకేలు, మండల, జిల్లా స్థాయిలలో అవసరమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అవసరం ఎంత అన్నది చూసి, వాటి లోటు లేకుండా చూడాలి.
- అన్నింటిలో నాణ్యతకు అత్యధిక ప్రాధాన్యం.
- కలెక్టర్లు, జేసీలు స్వయంగా మానిటర్ చేస్తే తప్ప, తిరిగితే తప్ప సమస్యలు తెలియవు. వాటిని పరిష్కరించలేరు.
- ఇంకా వ్యవసాయ సలహా మండళ్లు కూడా ఉన్నాయి. అవి ప్రతి శుక్రవారం సమావేశమవుతున్నాయి. క్షేత్రస్థాయిలో అవి నివేదికలు ఇస్తున్నాయి.
- వాటిని జేసీలు మండల వ్యవసాయ అధికారి ద్వారా చూడాలి. ఆ మేరకు అన్నీ స్వయంగా పర్యవేక్షించాలి.
- సీఎం–యాప్, ఈ–క్రాప్ డేటా ఎలా నమోదు, వినియోగం అన్నది చూడాలి.
- కాబట్టి జేసీలు, కలెక్టర్లు తప్పనిసరిగా సచివాలయాలు, ఆర్బీకేలు సందర్శించాలి.
- ఈ–క్రాప్ డేటా ఆధారంగా, గ్రామంలో ఉండాల్సినవి అన్నీ ఉన్నాయా? లేవా? అన్నవి చూడాలి.
ఉభయ గోదావరి జిల్లాలు:
- ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గుర్రపు డెక్కతో కాలువలు పూడుకు పోయాయి, వాటిని తొలిగించి నీరు సాఫీగా పారేలా చర్యలు చేపట్టాలి.
- పోలవరం కాఫర్ డ్యామ్ పనులు జరుగుతాయి కాబట్టి, ఉభయ గోదావరి జిల్లాల్లో ఏప్రిల్ 1 తర్వాత నీటి సరఫరా ఆగిపోతుంది.
- అందువల్ల డిసెంబరు 31 లోగా రబీకి సంబంధించి వరినాట్లు, ఇతర పనులు పూర్తయ్యేలా చూడాలి.
- ఈ విషయంలో కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ, ధ్యాస పెట్టాలి.
- అందుకోసం రైతులతో మాట్లాడాలి. ఆ రెండు జిల్లాలకు చెందిన మంత్రులు కూడా చొరవ చూపాలి.
Comments
Please login to add a commentAdd a comment