
సాక్షి ప్రతినిధి, కర్నూలు : ఏటా వర్షాలు..పచ్చని పంట భూములు..రైతు మోములో చెరగని చిరునవ్వు.. భయం లేని యువత భవిత.. ఇవన్నీ రాజన్న రాజ్యం సొంతం. 2004 నుంచి 2009 వరకు రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించిన మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జిల్లాలోని నల్లకాల్వ వద్ద హెలికాప్టర్ ప్రమాదంలో మరణించారు. ఆయన హఠాన్మరణం తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో చీకట్లు అలుముకున్నాయి. మహానేత మరణం అందరినీ కలిచివేసింది. ఆయన మరణాన్ని తట్టుకోలేక ఎందరో అభిమానులు ప్రాణాలొదిలారు. ఒక్క కర్నూలు జిల్లాలోనే 38 మంది గుండెపోటుతో మరణించారంటే రాజన్న పట్ల ప్రజల్లో అభిమానం ఎంతగా గూడు కట్టుకుందో అర్థం చేసుకోవచ్చు.
వైఎస్సార్ ఆశయ సాధనే ధ్యేయంగా..
వైఎస్సార్ మరణం తర్వాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడానికి, రాజన్న మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలకు అండగా నిలవడానికి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పించారు. ఇందులో భాగంగా తండ్రి మరణించిన ప్రాంతంలోనే 2009 సెప్టెంబరు 25న ఆత్మకూరు నియోజకవర్గం నల్లకాల్వలో బహిరంగ సభ నిర్వహించారు. తన తండ్రి మరణాన్ని జీర్ణించుకోలేక ప్రాణాలొదిలిన వారి కుటుంబాలను పరామర్శించడం తన కనీస బాధ్యత అని, ఓదార్పు యాత్ర చేపట్టి బాధితులకు బాసటగా నిలుస్తానని ప్రకటించారు. తద్వారా జగన్ తొలి అడుగు జిల్లాలోనే పడింది. ఈ ఒక్క అడుగు కోట్లాది మంది ప్రజలను ఏకం చేసింది.
ఓదార్పు యాత్ర
జిల్లాలో ఓదార్పు యాత్ర 2011 జూలై 18న ప్రారంభమైంది. 207 గ్రామాల మీదుగా 1,339 కిలోమీటర్ల మేర యాత్ర సాగింది. మొత్తం 37 కుటుంబాలను ఓదార్చారు. ఈ సందర్భంగా ప్రజలు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి అడుగడుగునా బ్రహ్మరథం పట్టారు. వారివారి ప్రధాన వీధులు, కూడళ్లలో 152 వైఎస్సార్ కాంస్య విగ్రహాలను జగన్‌తో ఆవిష్కరింపజేసి.. ప్రేమానురాగాలను చాటుకున్నారు.
కర్నూలులో జలదీక్ష
కృష్ణా, తుంగభద్ర నదులపై ఎగువ రాష్ట్రాలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టులతో రాష్ట్ర ప్రజలు, రైతులు ఆందోళనకు గురయ్యారు. సాగు, తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతాయని భావించారు. దీనిపై స్పందించాల్సిన అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ‘ఓటుకు నోటు’ కేసుకు భయపడి మిన్నకుండి పోయారు. రాష్ట్ర ప్రజల జీవన్మరణ సమస్య కావడంతో వైఎస్ జగన్ స్పందించారు. రాష్ట్రంలోకి తుంగభద్ర, కృష్ణా నదులు తొలి అడుగులు వేసే కర్నూలు జిల్లాలోనే జలదీక్ష చేపట్టాలని సంకల్పించారు. అనుకున్నదే తడువుగా 2016 మే 16న కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు వద్ద జలదీక్ష చేపట్టారు. మూడు రోజుల పాటు కొనసాగిన దీక్షకు రాష్ట్ర నలుమూలల నుంచి రైతులు, ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు.
హోదా కోసం ‘యువభేరి’
ప్రత్యేక హోదా వస్తే పారిశ్రామికీకరణ జరిగి ఉపాధి, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, తద్వారా యువత సంక్షేమం సాధ్యపడుతుందనే ఉద్దేశంతో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘యువభేరి’ ద్వారా సమరభేరి మోగించారు. రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన యువభేరి సభల్లో భాగంగా 2016 అక్టోబరు 25న కర్నూలు శివారులోని వీజేఆర్ ఫంక్షన్ హాల్‌లో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సభకు హాజరైతే పీడీ కేసులు పెడతామన్న అప్పటి టీడీపీ ప్రభుత్వ పెద్దల హెచ్చరికలను ఏ మాత్రమూ లెక్క చేయకుండా జిల్లా వ్యాప్తంగా విద్యార్థులు, యువతీ యువకులు, మేధావులు, ఉద్యోగులు, అధ్యాపకులు వేలాదిగా తరలివచ్చారు. హోదా ఉద్యమంలో మేము సైతం అంటూ కదంతొక్కారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జిల్లా ప్రజలు ప్రతి సందర్భంలోనూ బ్రహ్మరథం పట్టారు. 2014 ఎన్నికల్లో 11 అసెంబ్లీ, రెండు పార్లమెంటు నియోజకవర్గాలలో వైఎస్సార్‌సీపీని గెలిపించి మద్దతుగా నిలిచారు. అయితే, ఆ తర్వాత అధికారపార్టీ ప్రలోభాలకు లొంగిపోయి కొద్ది మంది పార్టీ ఫిరాయించినప్పటికీ జిల్లా ప్రజలు మాత్రం ‘నేతలు వెళ్లినా..మేమంతా నీ వెంటే జగనన్నా..’ అంటూ స్పష్టం చేశారు. జిల్లాలో 2017 నవంబరు 14 నుంచి డిసెంబరు 3వ తేదీ వరకు 18 రోజుల పాటు సాగిన ప్రజాసంకల్ప పాదయాత్రకు ప్రజలు వెల్లువలా తరలివచ్చి సంఘీభావం ప్రకటించారు. 7 నియోజకవర్గాల్లోని 14 మండలాలు, 66 గ్రామాల గుండా పాదయాత్ర సాగింది. మొత్తం 263 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో 100, 200, 300 కిలోమీటర్ల మైలురాళ్లను ఇక్కడే చేరుకున్నారు. ఈ సందర్భంగా లక్షలాది మంది జనంతో మమేకమైన వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి..వారి సమస్యలను తెలుసుకున్నారు. జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంతో పాటు తాగునీటి సమస్య లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. రైతులను ఆదుకోవడంతో పాటు గుండ్రేవుల, సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టుల నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వంతో చర్చించి ముందడుగు వేస్తామని ప్రకటించారు. రైతులకు బీమాతో పాటు గిట్టుబాటు ధరకు హామీనిచ్చారు.
క్లీన్‌స్వీప్
ఈ ఎన్నికల్లో జిల్లా మొత్తం జగన్ వెంటే నడిచింది. 14 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు రెండు ఎంపీ స్థానాల్లోనూ వైఎస్సార్‌సీపీని ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపించారు. జిల్లా చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతిపక్షానికి తావులేకుండా చేశారు. కోట్ల–కేఈ వంటి ఉద్దండులతో పాటు భూమా, బుడ్డా, గౌరు, టీజీ కుటుంబాలకు రాజకీయ మనుగడ లేకుండా తీర్పు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment