
'అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించడం మరచిపోయారు'
చిత్తూరు: పేదవాడి వైద్యం కోసం ఆరాటపడింది దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక్కరేనని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. సమైక్య శంఖారావంలో భాగంగా జిల్లాలోని వరదయ్యపాలెం సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి మాట్లాడారు. అసెంబ్లీలో ప్రజల గురించి చర్చించకుండా రాష్ట్రాన్ని ఎలా విభజించాలని మాత్రమే నేతలు యోచిస్తున్నారని జగన్ మండిపడ్డారు. ఇటువంటి రాజకీయాలను చూస్తే బాధగా ఉందన్నారు. ఆ దివంగత నేత రాజశేఖర్ రెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్య శ్రీ పథకానికి తూట్లు పొడుస్తూ పేదవాడి ఆరోగ్యం గురించి ఆలోచన చెయ్యడం లేదని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.
పేదవారికి వైఎస్ఆర్ దిక్కుగా నిలిచారని అన్నారు. రాజకీయమంటే చనిపోయాక కూడా బతకడానికి ఆరాటపడడమేనని పేర్కొన్నారు. ప్రస్తుతం కుట్రలు, కుతంత్రాలతో రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. త్వరలో రాజకీయవ్యవస్థలో మార్పులొస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీలకు తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉందని జగన్ సూచించారు.