వంశధార నదిపై నిర్మాణంలో ఉన్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ...
శ్రీకాకుళం అర్బన్ : వంశధార నదిపై నిర్మాణంలో ఉన్న ఆఫ్‌షోర్ రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించిన పనులు త్వరంగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్.జగన్‌మోహనరెడ్డికి ఆ పార్టీ నాయకుడు పేరాడ తిలక్ విన్నవించారు. హైదరాబాద్‌లో జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలు బుధవారం జగన్‌ను కలిశారు. టెక్కలి నియోజకవర్గంలోని సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు. 2008వ సంవత్సరంలో దివంగత వై.ఎస్.రాజశేఖరరెడ్డి ఆఫ్‌షోర్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారని, ఇందుకుగాను బడ్జెట్‌లో నిధులు మంజూరు చేసి పనులు చేపట్టారన్నారు.
ఆయన మరణం తరువాత దీన్ని విస్మరించడంతో పనులు నత్తనడకన సాగుతున్నాయని జగన్‌కు వివరించారు. ప్రస్తుత టీడీపీ సర్కార్ ఆఫ్‌షోర్ రిజర్వాయర్‌పట్ల చిన్నచూపు చూస్తుందని జగన్‌కు చెప్పారు. నిధులు మంజూరు చేసేలా అసెంబ్లీలో ప్రస్తావించాలని జగన్‌ను కోరినట్లు తిలక్ తెలిపారు. హుద్‌హుద్ తుపాను నష్టపరిహారం సక్రమంగా అందలేదని, 20 మంది సర్పంచ్‌ల చెక్‌పవర్ రద్దు చేసిన విషయాన్ని, అంగన్‌వాడీలు, ఆశావర్కర్‌లు, డీలర్లపై టీడీపీ కార్యకర్తలు కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లాన్నారు. పార్టీ అధినేతను కలిసిన వారిలో కురమాన బాలకృష్ణ, ఎర్రా చక్రవర్తి, పోలాకి మోహనరావు, నడుకూరి శ్రీరామ్మూర్తి ఉన్నారు.