పరిమళించిన మానవత్వం | YS Jagan touched the People hearts with his humanity | Sakshi
Sakshi News home page

పరిమళించిన మానవత్వం

Published Wed, Jun 5 2019 3:52 AM | Last Updated on Wed, Jun 5 2019 10:25 AM

YS Jagan touched the People hearts with his humanity - Sakshi

విశాఖలో కాన్వాయ్‌ ఆపి నీరజ్‌ స్నేహితులతో మాట్లాడుతున్న సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి, విశాఖపట్నం: ఓ యువకుడి ప్రాణం నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చూపిన చొరవ జనం హృదయాల్ని కదిలించింది. మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి తిరిగి వెళ్లేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రికి విమానాశ్రయం ఆవరణలో ‘బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్‌ పట్టుకుని కొంతమంది యువతీ యువకులు నినాదాలు చేస్తూ కనిపించారు. అతి వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లోంచి రెప్పపాటు వ్యవధిలో ఆ దృశ్యాన్ని గమనించిన సీఎం జగన్‌ వెంటనే కాన్వాయ్‌ ఆపండని ఆదేశించారు. వాహనం లోంచి కిందికి దిగి, బారికేడ్‌ అవతల ఉన్న ఆ యువతీ యువకులను తన వద్దకు అనుమతించాలంటూ అధికారులకు చెప్పారు. వారు తన వద్దకు రాగానే  అసలేం జరిగిందంటూ ఆప్యాయంగా పలకరించారు. బ్లడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌కుమార్‌ ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఈనెల 30న ఆపరేషన్‌ చేయించకపోతే కష్టమని వైద్యులు చెప్పారన్నారు.

నీరజ్‌ని ఎలా బతికించుకోవాలో తెలీక మీ దృష్టిలో పడాలని ఇలా చేశామన్నారు. వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి.. ‘నీరజ్‌ బతుకుతాడు.. ఎప్పటిలానే మీతో సరదాగా, సంతోషంగా ఉంటాడు.. మీరేం అధైర్య పడొద్దు’ అంటూ తన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తన ఫోన్‌ నంబర్‌ను యువకులకు ఇస్తూ..  పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్‌ కాటంనేని భాస్కర్‌ను పిలిచి నీరజ్‌ ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే.. ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం వెల్లివిరిసింది. సీఎం జగన్‌ సార్‌ దేవుడంటూ నినాదాలు మిన్నంటాయి. నీరజ్‌ మిత్రుల కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. వారు చేతులు జోడించి నమస్కరిస్తుండగా.. జగన్‌ చిరునవ్వుతో అక్కడి నుంచి బయలుదేరారు. పదవి అంటే పెత్తనం కాదని, ప్రజల కష్టాల్ని పంచుకునే అధికారమని నిరూపించారని అక్కడున్న పలువురు కొనియాడారు. 

ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం 
ఎయిర్‌ పోర్టులో యువత ప్రదర్శించిన బ్యానర్‌ని చూసి సీఎం స్పందించారు. సీఎం సెక్రటరీ హాస్పిటల్‌ వాళ్లతో మాట్లాడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా సీఎం ఆఫీసుకు వివరాలు పంపిస్తాం. అక్కడి నుంచి క్రెడిట్‌ నోట్‌ రాగానే ఆస్పత్రికి అందిస్తాం. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయిస్తున్నాం.     
– కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్‌.

ఇదీ నీరజ్‌ దీనగాధ..
విశాఖలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన జాగరపు అప్పలనాయుడు, జాగరపు దేవి దంపతుల కుమారుడు నీరజ్‌ కుమార్‌. స్థానిక రైతు బజార్‌లో తల్లి కూరగాయలు అమ్ముకుని, తండ్రి కూలికి వెళ్లి కుటుంబం నెట్టుకొస్తున్నారు. నీరజ్‌ కుమార్‌ 2018లో స్థానిక రవీంద్రభారతి స్కూల్‌లో పదో తరగతి పూర్తి చేశాడు. డిప్లమో చదువుదామని దరఖాస్తు చేశాడు. ఇంతలో బ్లడ్‌ క్యాన్సర్‌ బారినపడ్డాడు. నీరజ్‌ని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో అతని తల్లిదండ్రులు కొడుకు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. నీరజ్‌తో పాటు చదువుకున్న స్నేహితులు, ఉపాధ్యాయులు రెండు నెలలుగా విరాళాలు సేకరిస్తున్నారు.  

మా స్నేహితుడికి పునర్జన్మనిచ్చారు..
‘మా స్నేహితుడు నీరజ్‌కుమార్‌కు బ్లడ్‌ క్యాన్సర్‌ అని తెలిసినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాం. రెండు నెలలుగా దాతల కోసం తిరుగుతున్నాం. అందరం కలిసి ప్రయత్నిస్తే ఇప్పటి దాకా కేవలం రూ.40 వేలు మాత్రమే వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ వస్తున్నారని మేము ఉదయం 8 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లో వేచి చూశాం. పోలీసులు మమ్మల్ని లోపలకు పంపించలేదు. దారిలో నిలుచుంటే సీఎంకు కనపడకపోతామా అనే ఆశ. ఆ ఆశతోనే మధ్నాహ్నం బ్యానర్‌ పట్టుకుని నిలుచున్నాం. కాన్వాయ్‌ మా ముందు నుంచి కాస్త ముందుకెళ్లి ఆగిపోయింది. సీఎం కారు దిగి మమ్మల్ని దగ్గరకు రప్పించుకున్నారు. మా స్నేహితుడి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయించారు. ఇది నిజంగా నీరజ్‌కు పునర్జన్మే.             
– నీరజ్‌ స్నేహితులు

ఈ ముఖ్యమంత్రి మా పాలిట దేవుడు
మా బాబు నీరజ్‌కు ఇక్కడే (హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్‌ ఆస్పత్రి)లో వైద్యం చేయిస్తున్నాం. ఆపరేషన్‌ చేయాలన్నారు. చేతిలో డబ్బుల్లేవు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఏరోజుకారోజు వచ్చే ఆదాయంతో బతికే మేము మా బిడ్డ వైద్యానికయ్యే రూ.25 లక్షలు సమకూర్చుకోలేమని దిగులుతో ఉన్నాం. మా వాడి స్నేహితులు, టీచర్లు దాతల నుంచి చందాలు వసూలు చేసైనా ప్రాణం నిలబెట్టాలని చూస్తున్నారు. నీరజ్‌కు ఆపరేషన్‌ చేయిస్తామని సీఎం జగన్‌ చెప్పారని మంగళవారం మధ్యాహ్నం బంధువులు, మావాడి స్నేహితులు మాకు ఫోన్‌ చేశారు. ఇది కలా లేక నిజమా.. అనుకుని కాసేపు తేరుకోలేదు. ఈ విషయం టీవీల్లో కూడా వస్తోందని మళ్లీ ఫోన్లు వచ్చాయి. పట్టలేనంత సంతోషం వేసింది. ముఖ్యమంత్రి జగన్‌ గారు మాకు నిజంగా దేవుడే. మా కుటుంబం జీవితకాలం ఆయనకు రుణపడి ఉంటుంది. జగన్‌ గారి ఔదార్యంతో మా బిడ్డను దక్కించుకుంటామన్న ధైర్యం వచ్చింది. కష్టాల్లో ఉన్న వారి పట్ల స్పందించే గుణం జగన్‌లో ఉందని విన్నాం. కానీ ఇప్పుడు మా అనుభవంలో చూస్తున్నాం’ అని వారు గద్గద స్వరంతో పేర్కొన్నారు. గత ఏడాది విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్‌ గారిని కత్తితో పొడిచి చంపేయాలని చూశారు. ఇప్పుడు అదే ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో నా బిడ్డను బతికించడానికి ఆయన పూనుకున్నారు. ఆయనది ఎంత మంచి మనసు!.
–‘సాక్షి’తో నీరజ్‌కుమార్‌ తల్లిదండ్రులు దేవి, అప్పలనాయుడు, సోదరుడు అనిల్‌కుమార్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement