Neeraj kumar
-
‘సుశాంత్ కేసు సాక్ష్యులకు భద్రత కల్పించాలి’
సాక్షి, ముంబై: బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో రోజు రోజుకు కీలక ఆధారాలు బయటపడుతున్నాయి. కేసుకు సంబంధించిన సమాచారం ఇవ్వడానికి ఒక్కక్కరూ బయటకు వస్తున్నారు. దీంతో సుశాంత్ సింగ్ కజిన్ సోదరుడు బీజేపీ ఎమ్మెల్యే నీరజ్ కుమార్ సింగ్ బబ్లు ఈ కేసులో నిజాలు బయటపెట్టేందుకు చాలామంది సాక్ష్యులు ఉన్నారని, వారు ప్రాణ భయంతో బయటకు రావడం లేదన్నారు. కాబట్టి ఇప్పటికే ముందుకు వచ్చిన సాక్ష్యులకు భద్రత కల్పించాలన్నారు. ఈ సందర్భంగా నీరజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ.. “ప్రతి రోజు సుశాంత్ కేసులో కొత్త సాక్షులు బయటకు వస్తున్నారు. కొత్త వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. అలాంటి వారు తమ సమాచారాన్ని కూడా సీబీఐతో పంచుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ సాక్ష్యులంతా అభద్రత భావానికి గురవుతున్నారు. ఎందుకంటే ఎక్కడా నిజాలు చెబితే వారిని చంపేస్తారోమోనన్న భయం వారిలో ఉందని పేర్కొన్నారు. (చదవండి: అప్పుడే అందరికీ ప్రశాంతత: సుశాంత్ సోదరి) అలాంటి వారి సాక్ష్యాలు సీబీఐ దర్యాప్తుకు కీలకం కావచ్చని, అటువంటి సాక్ష్యాధారాలను కొన్ని అతీత శక్తుల వల్ల కొల్పోతున్నామని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అయితే ఈ సాక్షులకు భద్రత ఎందుకు కల్పించలేదని ఆయన ముంబై పోలీసులను ప్రశ్నించారు. ముంబై పోలీసులు సాక్షులకు తగిన భద్రత కల్పించాలని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో సాక్ష్యాధారాలు నాశనం కాకుండా చూసుకోవాలని ఎమ్మెల్యే డిమాండ్ చేశారు. ‘సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో ముందుకు వచ్చిన సాక్షులందరికీ తక్షణ రక్షణ కల్పించాలని, సాక్ష్యాలు దెబ్బతినకుండా చూసుకోవాలని ముంబై పోలీసులను నేను కోరుతున్నాను. తద్వారా సీబీఐ దర్యాప్తు ప్రారంభించినప్పుడు, సాక్షులు, సాక్ష్యాలను ముందు సమర్పించవచ్చు. సాక్షికి ఏదైనా హాని జరిగితే లేదా సాక్ష్యాలను దెబ్బతీస్తే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసులో దర్యాప్తు ప్రభావితమవుతుంది’ అని నీరజ్ కుమార్ పేర్కొన్నారు. (చదవండి: ‘సుశాంత్ సినీ జీవితాన్ని అంతం చేయాలని చుశారు’) -
‘నిందితులను చంపాలనే ఆలోచన రాలేదు’
న్యూఢిల్లీ: యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన నిర్భయ కేసును పర్యవేక్షించిన ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిందితులను చంపేయాలన్న ఆలోచన తమకు ఎప్పుడూ రాలేదని చెప్పారు. దిశపై గ్యాంగ్‌రేప్ చేసిన నిందితులను పోలీసులు ఎన్కౌంటర్ చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. నిర్భయ ఘటన జరిగినప్పటి పరిస్థితులు చాలా క్లిష్టంగా ఉండేవని గుర్తు చేసుకున్నారు. డిసెంబర్ 16, 2012న నిర్భయపై గ్యాంగ్‌రేప్ జరిపి తీవ్రంగా గాయపరచడంతో ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. దీంతో దేశంలో పెద్దఎత్తున నిరసన వ్యక్తమైంది. ‘నిందితులను బాగా ఆకలిగా ఉన్న సింహాలకు వదిలేయండి. ప్రజలకు అప్పగించండి. అంటూ మాకు చాలా మెసేజ్‌లు వచ్చాయి. కానీ మేం చట్టాన్ని అనుసరించాం’ అని అన్నారు. ప్రతి ఎన్కౌంటర్ తర్వాత ఎన్నో ప్రశ్నలు ఎదురవుతాయని, ఇది ఒక ఉగ్రవాదిపైనో లేదా గ్యాంగ్‌స్టర్‌పైనో జరిగింది కాదని చెప్పారు. ఈ కేసుపై ప్రజల దృష్టి ఎక్కువగా ఉందన్నారు. -
ఫలించిన సీఎం జగన్ సాయం
సాక్షి, విశాఖపట్నం: ప్రాణాంతక వ్యాధి బారిన పడిన కొడుకుని చూసి ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. జబ్బు నయం కావాలంటే లక్ష, రెండు లక్షలు కాదు.. సుమారు 25 లక్షల రూపాయలు అవసరమవుతాయని వైద్యులు చెప్పడంతో, రోజు వారీ కూలి డబ్బుతో కుటుంబాన్ని నెట్టుకొచ్చే తమకు అంత పెద్ద మొత్తం సమకూర్చుకోవడం సాధ్యం కాదని బెంగ పెట్టుకున్నారు. ఏడాది నుంచి ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. వీరి కుటుంబ పరిస్థితి తెలిసిన కొడుకు స్నేహితులు తమ మిత్రుడిని కాపాడుకోవాలని సంకల్పించారు. ఇందులో భాగంగా ఈనెల 4న విశాఖ శారదాపీఠం సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోసం విమానాశ్రయం వద్ద ‘సేవ్ అవర్ ఫ్రెండ్’ బ్యానర్‌తో నిల్చున్నారు. కారులోంచి బ్యానర్ చూసిన ముఖ్యమంత్రి కాన్వాయ్‌ని నిలిపి వారితో మాట్లాడారు. బ్లడ్ క్యాన్సర్‌తో ప్రాణాపాయ స్థితిలో ఉన్న విశాఖ జ్ఞానాపురానికి చెందిన తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ వైద్యానికయ్యే ఖర్చు గురించి వారు సీఎంకు వివరించారు. పూర్తి వివరాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి నీరజ్‌కుమార్ వైద్యానికయ్యే ఖర్చు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని, దిగులు చెందవద్దని హామీ ఇచ్చారు. సీఎం ఆదేశాల మేరకు నీరజ్‌కుమార్‌కు వైద్యం శరవేగంగా అందుతోంది. ఇప్పటికే వైద్యం కోసం రూ.10 లక్షలు ప్రభుత్వం నుంచి చెల్లించారు. ఇంకా ఎంత అవసరమైతే అంత సొమ్ము ప్రభుత్వమే సమకూరుస్తుందని కుటుంబ సభ్యులకు, ఆస్పత్రి వర్గాలకు సీఎంవో అధికారులు స్పష్టం చేశారు. నీరజ్‌కుమార్ ఆరోగ్య పరిస్థితిని, వైద్యం అందుతున్న తీరును ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. కాగా నీరజ్‌కుమార్ క్రమంగా కోలుకుంటున్నాడు. ప్రస్తుతం కీమోథెరపీ చేస్తున్నారు. గుండెకు రక్తప్రసరణలో తలెత్తిన సమస్యను కూడా సరిచేశారు. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేకుండా వైద్యం అందిస్తున్నారు. గతంలో మాదిరిగా గొట్టం ద్వారా కాకుండా ఇప్పుడు నేరుగా నోటి నుంచి ఆహారం ఇస్తున్నారని నీరజ్‌కుమార్ తండ్రి అప్పలనాయుడు ‘సాక్షి’తో చెప్పారు. తమ కుమారుడు ఏమవుతాడోనని కొన్నాళ్లుగా ఆందోళనతో ఉన్న తమను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి దేవుడిలా ఆదుకుంటున్నారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. (చదవండి: పరిమళించిన మానవత్వం) -
పరిమళించిన మానవత్వం
సాక్షి, విశాఖపట్నం: ఓ యువకుడి ప్రాణం నిలబెట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చూపిన చొరవ జనం హృదయాల్ని కదిలించింది. మంగళవారం విశాఖ జిల్లా పెందుర్తిలోని శ్రీ శారదా పీఠాన్ని సందర్శించి తిరిగి వెళ్లేందుకు బయలుదేరిన ముఖ్యమంత్రికి విమానాశ్రయం ఆవరణలో ‘బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న మా స్నేహితుడిని కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్ పట్టుకుని కొంతమంది యువతీ యువకులు నినాదాలు చేస్తూ కనిపించారు. అతి వేగంగా వెళ్తున్న కాన్వాయ్‌లోంచి రెప్పపాటు వ్యవధిలో ఆ దృశ్యాన్ని గమనించిన సీఎం జగన్ వెంటనే కాన్వాయ్ ఆపండని ఆదేశించారు. వాహనం లోంచి కిందికి దిగి, బారికేడ్ అవతల ఉన్న ఆ యువతీ యువకులను తన వద్దకు అనుమతించాలంటూ అధికారులకు చెప్పారు. వారు తన వద్దకు రాగానే అసలేం జరిగిందంటూ ఆప్యాయంగా పలకరించారు. బ్లడ్ క్యాన్సర్‌తో బాధపడుతున్న తమ స్నేహితుడు నీరజ్‌కుమార్ ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చవుతుందని, ఈనెల 30న ఆపరేషన్ చేయించకపోతే కష్టమని వైద్యులు చెప్పారన్నారు. నీరజ్‌ని ఎలా బతికించుకోవాలో తెలీక మీ దృష్టిలో పడాలని ఇలా చేశామన్నారు. వారు చెప్పిందంతా ఓపిగ్గా విన్న ముఖ్యమంత్రి.. ‘నీరజ్ బతుకుతాడు.. ఎప్పటిలానే మీతో సరదాగా, సంతోషంగా ఉంటాడు.. మీరేం అధైర్య పడొద్దు’ అంటూ తన సెక్రటరీ ధనుంజయ్‌రెడ్డిని పిలిచి ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఆయన తన ఫోన్ నంబర్‌ను యువకులకు ఇస్తూ.. పక్కనే ఉన్న జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్‌ను పిలిచి నీరజ్ ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అంతే.. ఒక్కసారిగా అక్కడ భావోద్వేగ వాతావరణం వెల్లివిరిసింది. సీఎం జగన్ సార్ దేవుడంటూ నినాదాలు మిన్నంటాయి. నీరజ్ మిత్రుల కళ్లు ఆనంద భాష్పాలతో నిండిపోయాయి. వారు చేతులు జోడించి నమస్కరిస్తుండగా.. జగన్ చిరునవ్వుతో అక్కడి నుంచి బయలుదేరారు. పదవి అంటే పెత్తనం కాదని, ప్రజల కష్టాల్ని పంచుకునే అధికారమని నిరూపించారని అక్కడున్న పలువురు కొనియాడారు. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నాం ఎయిర్ పోర్టులో యువత ప్రదర్శించిన బ్యానర్‌ని చూసి సీఎం స్పందించారు. సీఎం సెక్రటరీ హాస్పిటల్ వాళ్లతో మాట్లాడాలని ఆదేశించారు. ఆరోగ్యశ్రీతో సంబంధం లేకుండా సీఎం ఆఫీసుకు వివరాలు పంపిస్తాం. అక్కడి నుంచి క్రెడిట్ నోట్ రాగానే ఆస్పత్రికి అందిస్తాం. ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయిస్తున్నాం. – కాటంనేని భాస్కర్, జిల్లా కలెక్టర్. ఇదీ నీరజ్ దీనగాధ.. విశాఖలోని జ్ఞానాపురం ప్రాంతానికి చెందిన జాగరపు అప్పలనాయుడు, జాగరపు దేవి దంపతుల కుమారుడు నీరజ్ కుమార్. స్థానిక రైతు బజార్లో తల్లి కూరగాయలు అమ్ముకుని, తండ్రి కూలికి వెళ్లి కుటుంబం నెట్టుకొస్తున్నారు. నీరజ్ కుమార్ 2018లో స్థానిక రవీంద్రభారతి స్కూల్లో పదో తరగతి పూర్తి చేశాడు. డిప్లమో చదువుదామని దరఖాస్తు చేశాడు. ఇంతలో బ్లడ్ క్యాన్సర్ బారినపడ్డాడు. నీరజ్‌ని హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చేర్చారు. అక్కడి వైద్యులు రూ.25 లక్షలు ఖర్చవుతాయని చెప్పారు. అంత డబ్బులేకపోవడంతో అతని తల్లిదండ్రులు కొడుకు ప్రాణాలపై ఆశలు వదులుకున్నారు. నీరజ్‌తో పాటు చదువుకున్న స్నేహితులు, ఉపాధ్యాయులు రెండు నెలలుగా విరాళాలు సేకరిస్తున్నారు. మా స్నేహితుడికి పునర్జన్మనిచ్చారు.. ‘మా స్నేహితుడు నీరజ్‌కుమార్‌కు బ్లడ్ క్యాన్సర్ అని తెలిసినప్పటి నుంచి చాలా బాధపడుతున్నాం. రెండు నెలలుగా దాతల కోసం తిరుగుతున్నాం. అందరం కలిసి ప్రయత్నిస్తే ఇప్పటి దాకా కేవలం రూ.40 వేలు మాత్రమే వచ్చాయి. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విశాఖ వస్తున్నారని మేము ఉదయం 8 గంటల నుంచి ఎయిర్‌పోర్ట్‌లో వేచి చూశాం. పోలీసులు మమ్మల్ని లోపలకు పంపించలేదు. దారిలో నిలుచుంటే సీఎంకు కనపడకపోతామా అనే ఆశ. ఆ ఆశతోనే మధ్నాహ్నం బ్యానర్ పట్టుకుని నిలుచున్నాం. కాన్వాయ్ మా ముందు నుంచి కాస్త ముందుకెళ్లి ఆగిపోయింది. సీఎం కారు దిగి మమ్మల్ని దగ్గరకు రప్పించుకున్నారు. మా స్నేహితుడి ఆపరేషన్‌కు ఏర్పాట్లు చేయించారు. ఇది నిజంగా నీరజ్‌కు పునర్జన్మే. – నీరజ్ స్నేహితులు ఈ ముఖ్యమంత్రి మా పాలిట దేవుడు మా బాబు నీరజ్‌కు ఇక్కడే (హైదరాబాద్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి)లో వైద్యం చేయిస్తున్నాం. ఆపరేషన్ చేయాలన్నారు. చేతిలో డబ్బుల్లేవు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. రోజూ నిద్రలేని రాత్రులు గడుపుతున్నాం. ఏరోజుకారోజు వచ్చే ఆదాయంతో బతికే మేము మా బిడ్డ వైద్యానికయ్యే రూ.25 లక్షలు సమకూర్చుకోలేమని దిగులుతో ఉన్నాం. మా వాడి స్నేహితులు, టీచర్లు దాతల నుంచి చందాలు వసూలు చేసైనా ప్రాణం నిలబెట్టాలని చూస్తున్నారు. నీరజ్‌కు ఆపరేషన్ చేయిస్తామని సీఎం జగన్ చెప్పారని మంగళవారం మధ్యాహ్నం బంధువులు, మావాడి స్నేహితులు మాకు ఫోన్ చేశారు. ఇది కలా లేక నిజమా.. అనుకుని కాసేపు తేరుకోలేదు. ఈ విషయం టీవీల్లో కూడా వస్తోందని మళ్లీ ఫోన్లు వచ్చాయి. పట్టలేనంత సంతోషం వేసింది. ముఖ్యమంత్రి జగన్ గారు మాకు నిజంగా దేవుడే. మా కుటుంబం జీవితకాలం ఆయనకు రుణపడి ఉంటుంది. జగన్ గారి ఔదార్యంతో మా బిడ్డను దక్కించుకుంటామన్న ధైర్యం వచ్చింది. కష్టాల్లో ఉన్న వారి పట్ల స్పందించే గుణం జగన్‌లో ఉందని విన్నాం. కానీ ఇప్పుడు మా అనుభవంలో చూస్తున్నాం’ అని వారు గద్గద స్వరంతో పేర్కొన్నారు. గత ఏడాది విశాఖపట్నం విమానాశ్రయంలో జగన్ గారిని కత్తితో పొడిచి చంపేయాలని చూశారు. ఇప్పుడు అదే ఎయిర్‌పోర్టులో ఉన్న సమయంలో నా బిడ్డను బతికించడానికి ఆయన పూనుకున్నారు. ఆయనది ఎంత మంచి మనసు!. –‘సాక్షి’తో నీరజ్‌కుమార్ తల్లిదండ్రులు దేవి, అప్పలనాయుడు, సోదరుడు అనిల్‌కుమార్ -
'దావూద్‌ను పట్టుకోవడం అంత ఈజీ కాదు'
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంను పట్టుకోవడం అంత సులభం కాదని, ఎందుకంటే అతను మన శత్రు దేశం రక్షణలో ఉన్నాడని ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్‌కుమార్ పేర్కొన్నారు. ఈ విషయంలో ఇటీవల అరెస్టైన దావూద్ బద్ధ విరోధి, గ్యాంగ్‌స్టర్ ఛోటారాజన్ కూడా చేసే సాయమేమీ లేదని ఆయన చెప్పారు. 'దావూద్ పట్టుకోగలమని మేం చెప్పలేం. ఎందుకంటే పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐ కనుసన్నలో అతను ఉండటం. అతన్ని పట్టితేవాలన్న రాజకీయ చిత్తశుద్ధి మన దేశానికి లేకపోవడం. శత్రుదేశం రక్షణలో ఉండటం వల్లే అతను ఇంకా మనకు పట్టుబడకుండా ఉండగలుగుతున్నాడు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకోవడం అంత సులభమేమీ కాదు' అని ఆయన చెప్పారు. నీరజ్‌కుమార్ 'డయల్ ఫర్ డాన్' పేరిట రాసిన పుస్తకాన్ని ముంబైలో శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నీరజ్‌కుమార్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధిగా ప్రయత్నిస్తే దావూద్‌ను భారత్‌కు తీసుకొచ్చి శిక్షించే అవకాశముంటుందని చెప్పారు. 1990లలో దావూద్ లొంగిపోవడానికి ముందుకొచ్చాడని నీరజ్‌కుమార్ తన పుస్తకంలో వెల్లడించడం.. ఇటీవల మీడియా పతాక శీర్షికలకు ఎక్కిన సంగతి తెలిసిందే. దావూద్‌తో తాను మూడుస్లారు ఫోన్లో సంభాషించానని, చివరిసారిగా తాను రిటైర్మెంట్కు ముందు 2013లో అతని నాకు ఫోన్ చేశాడని ఆయన వివరించారు. -
ఇకనైనా నన్ను వెంటాడటం మానండి: దావూద్
న్యూఢిల్లీ: తన రిటైర్మెంట్కు ముందు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఊహించని కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా.. నీరజ్‌కుమార్ ఓరోజు దావూద్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. 'క్యా సాహెబ్, ఆప్ రిటైర్ హోనే జారేహే హో. ఆబ్ తో పీచ్చా ఛోడ్ దో' (ఏంటీ సర్ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోండి) అంటూ దావూద్ కోరాడు. 2013 జూన్ మొదటి వారంలో ఈ ఘటన జరిగింది. 'ఒక రోజు నా పర్సనల్ మొబైల్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది బహుశా దావూద్ వ్యక్తిగత నెంబర్ ఉంటుంది' అని నీరజ్‌కుమార్ ఈ ఫోన్‌కాల్ గురించి వివరించారు. 'మై కన్వర్సెషన్స్ విత్ దావూద్ ఇబ్రహీం' పేరుతో ఆయన రాసిన తాజా పుస్తకంలో 'డయల్ డీ ఫర్ డాన్' అధ్యాయంలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన వృత్తిజీవితంలో నిర్వహించిన 11 టాప్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ నీరజ్‌కుమార్ ఈ పుస్తకం రాశారు. ఈ ఆపరేషన్లన్నీ అండర్ వరల్డ్, 1993 ముంబై వరుస పేలుళ్లు, దేశవ్యాప్తంగా నేరగ్యాంగుల చుట్టే తిరుగుతాయి. ఎన్నో ఆసక్తికర అంశాలున్న ఈ పుస్తకం త్వరలోనే పెంగ్విన్ బుక్స్ విడుదల చేయనుంది. -
9/11 దాడులకు భారత్ నుంచి నిధులు!
న్యూఢిల్లీ: ఉగ్రవాదుల చర్యల్లో అత్యంత హేయమైనదిగా భావించే 9/11 దాడికి భారత్ నుంచి నిధులు వెళ్లాయి. పేలుడు పదార్థాల తయారీ, విమానాల హైజాక్ నుంచి ట్విన్ టవర్స్ కూల్చివేత వరకు పథకాన్ని పక్కాగా అమలుపర్చేందుకు ఉగ్రవాదులు బోలెడు డబ్బు ఖర్చయింది. అందులో కొంత భారత్ నుంచి సమకూరింది. అది ఎలాగంటే.. కోల్‌కతాలోని అమెరికన్ సెంటర్ పై దాడి (జనవరి 2, 2002) కేసులో ఉరిశిక్ష పడిన దోషి, ప్రస్తుతం జైలులో ఉంటోన్న అఫ్తాబ్ అన్సారీ.. తన గ్యాంగ్‌తో కలిసి 2001లో ఖాదీమ్ వ్యాపార సంస్థల అధిపతి పార్థా ప్రతిమ్ రాయ్ బర్మన్ను కిడ్నాప్ చేశాడు. బాధితుడ్ని విడిచిపెట్టే క్రమంలో భారీగా సొమ్ము చేతులు మారింది. అప్పటికే దుబాయ్ నేర సామ్రాజ్యాధిపతులు, పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల నాయకులతో సంబంధాలున్న అఫ్తాబ్.. బర్మన్ కిడ్నాప్ ద్వారా లభించిన సొమ్ములో కొంత భాగాన్ని షేక్ ఒమర్ కు పంపాడు. ఈ షేక్ ఒమర్ ఎవరంటే.. 1999 కాందహార్ విమాన హైజాక్ ఉదంతంలో భారత్ విడిచిపెట్టిన ఉగ్రవాదుల్లో ఒకడు షేక్ ఒమర్. సొంత సంస్థ హర్కత్ ఉల్ ముజాహిద్దీన్ తోపాటు తాలిబన్లతో కలిసి కార్యకలాపాలు నిర్వహించేవాడు. ప్రస్తుతం పాక్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. ఇతను మొహమ్మద్ అట్టాకు అత్యంత నమ్మకస్తుడు. ఈ అట్టాయే 9/11 దాడుల కీలక సూత్రధారి. ఒమర్ కు... అన్సారీ నమ్మినబంటు కావడంతో అడిగిందే తడవుగా తన దగ్గరున్న డబ్బును పాక్ కు చేరవేశాడు . అలా ఆ సొమ్ము ట్విన్ టవర్స్ కూల్చివేతకు వినియోగించారు. దాడుల అనంతరం అట్టాను ఎఫ్ బీఐ అరెస్టు చేసింది. విచారణ సందర్భంగా స్వయంగా అట్టాయే ఈ విషయాలు వెల్లడించాడని, ఆమేరకు ఎఫ్ బీఐ అధికారి జాన్ పిస్టోల్ తన రిపోర్టులో అట్టా వాగ్మూలాన్ని నమోదుచేశారు. ఇక్కడ మనం చదివింది కేవలం ఒక ఊహ కాదు.. సాక్షాత్తూ ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ తన పుస్తకంలో వెల్లడించిన విషయాలు. నాలుగేళ్ల కిందట రిటైర్మెంట్ తీసుకున్న ఆయన.. తన ఉద్యోగానుభవాలను క్రోడీకరిస్తూ ఓ పుస్తకాన్ని రాశారు. అందులో తాను సీబీఐలో పనిచేసిప్పుడు ఎదురైన అనుభవాలను పొందుపర్చారు. 9/11 దాడులకు భారత్ నుంచి నిధులు ఎలా వెళ్లింది, మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంతో ఫోన్ లో ఏం మాట్లాడింది, దావూద్, అతని సోదరుడు అనీస్ ల నుంచి ఎలాంటి అభ్యర్థనలు ఎదురైంది పూసగుచ్చినట్లు వివరించారు. నీరజ్ కుమార్ ప్రస్తుతం బీసీసీఐ అవినీతి నిరోధక శాఖకు చీఫ్ గా వ్యవహరిస్తున్నారు. -
టి20 వరల్డ్ కప్ కమిటీలో ఎంవి శ్రీధర్
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నిర్వహించనున్న టి20 ప్రపంచకప్ లో తెలుగు వ్యక్తికి కీలక పదవి దక్కింది. క్రికెట్ ఆపరేషన్స్ జనరల్ మేనేజర్ గా ఎంవి శ్రీధర్ నియమితులయ్యారు. టి20 ప్రపంచకప్ కు ఆర్గనైజింగ్ కమిటీని బీసీసీఐ శుక్రవారం ప్రకటించింది. ఢిల్లీ మాజీ పోలీసు కమిషనర్ నీరజ్ కుమార్ ను భద్రత, అవినీతి నిరోధక విభాగం(ఏసీఎస్ యూ) ముఖ్య సలహాదారుగా నియమించింది. ఆర్గనైజింగ్ కమిటీలోని ఇతర సభ్యులు అమృత మాథుర్: ప్రిన్సిపాల్ కోఆర్డినేటర్ ఆర్పీ షా: టోర్నమెంట్ మేనేజర్ కేవీపీ రావు: మేనేజర్(క్రికెట్ ఆపరేషన్స్) నిశాంత్ జీత్ అరోరా: బీసీసీఐ, టోర్నమెంట్ మీడియా మేనేజర్ మయాంక్ పరీఖ్: మేనేజర్(లాజిస్టిక్ అండ్ హాస్పిటాలిటీ) ప్రొఫెసర్ రత్నాకర్ శెట్టి: కమిటీ సలహాదారు -
దాగుడుమూతలు!
కలడు కలడు అనువాడు కలడో, లేడో అని కలవరిస్తున్నారు పాలకులు. అధోజగత్తు అధినేత ఆచూకీ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. మాఫియా డాన్ అడ్రస్ పై పూటకోమాట చెబుతున్నారు. వందల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన కిరాతక ముఠా నాయకుడి జాడపై నేతాశ్రీలు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. పొరుగు దేశంలో ఉన్నాడా, లేదా అనేది చెప్పలేకపోతున్నారు. 1993 ముంబై మారణహోమానికి కారకుడైన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీపై పాలకుల ప్రకటనతో గందరగోళం నెలకొంది. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న దావూద్ అప్పట్లో లొంగిపోతానన్నడని ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించి తుట్టును కదిపారు. ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే లొంగిపోతానని దావూద్ తనకు ఫోన్ చేశాడని తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే సీబీఐ ఒప్పుకోకపోవడంతో డాన్ లొంగిపోలేదన్నారు. లొంగిపోతే ఎందుకు వద్దంటామని అప్పటి సీబీఐ డైరెక్టర్ విజయరామారావు గడుసుగా ప్రశ్నించారు. దీనికి కొనసాగింపుగా పార్లమెంట్ లో ప్రభుత్వం తప్పులో కాలేయడంతో 'దావూద్ అడ్రస్' వార్తల్లో అంశంగా మారిపోయింది. మాఫియా డాన్ ఎక్కడున్నాడో ఇంతవరకూ తెలియదని హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురీ.. లోక్ సభలో చేసిన ప్రకటనతో ఎన్డీఏ సర్కారు అభాసుపాలైంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని, అతడిని రప్పించి తీరుతామని ప్రకటించి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే దావూద్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సన్నాయి నొక్కులు నొక్కారు. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ దావూద్ ను అంతం చేసి ఉంటుందన్న అనుమానాన్ని ఓ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. పాలకుల చేతగానితనం వల్లే దావూద్ దేశం సరిహద్దు దాటాడు. వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన కిరాతకున్ని కటకటాల వెనక్కి పంపిచకపోవడంలో విధాన నిర్ణేతల వైఫల్యం కొట్టిచ్చినట్టుగా కనబడుతోంది. దీన్నినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆచూకీ అంటూ హడావుడి చేస్తున్నారే గానీ పొరుగు దేశంపై ఒత్తిడి పెంచి డాన్ ను తీసుకురాలేపోతున్నారు. -
తెలంగాణలో పెట్టుబడులకు సిద్ధం
సీఎం కేసీఆర్‌ను కలసిన జిందాల్ ప్రతినిధులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తాము సుముఖంగా ఉన్నట్లు జిందాల్ కంపెనీ ప్రకటించింది. రాష్ర్ట ప్రభుత్వ నూతన పారిశ్రామిక విధానం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు. జిందాల్ సా లిమిటెడ్ సీఈవో నీరజ్‌కుమార్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్‌కుమార్ తదితరులు గురువారం సచివాలయంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. తెలంగాణ అభివృద్ధిలో తాము భాగస్వాములు అయ్యేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వాటర్‌గ్రిడ్ పథకానికి అవసరమయ్యే పైపులను సరఫరా చేసేందుకు జిందాల్ ప్రతినిధులు సంసిద్ధత వ్యక్తం చేశారు. తెలంగాణలో పైపుల తయారీ కేంద్రాన్ని నెలకొల్పుతామన్నారు. ఉక్కు పరిశ్రమ స్థాపనలో జిందాల్ కంపెనీకి ఉన్న అనుభవం దృష్ట్యా బయ్యారం ప్రాంతంలో పరిశ్రమను స్థాపనకు సిద్ధంగా ఉండాలని సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా వారికి సూచించారు. వాటర్‌గ్రిడ్‌కు పైపుల సరఫరాపై జిందాల్ ప్రతిపాదనలను పరిశీలిస్తామన్నారు. పరిశ్రమలకు కావలసినంత భూమి, నీరు, తెలంగాణలో అందుబాటులో ఉందని, విద్యుదుత్పత్తి కోసం చేస్తున్న ప్రయత్నాలు రెండేళ్లలో ఫలిస్తాయని సీఎం వెల్లడించారు. హైదరాబాద్‌లో మెట్రోరైల్‌ను మరింత విస్తరిస్తామని, నగర శివార్లలో ఫార్మా, ఫిల్మ్‌సిటీ ఏర్పాటు చేయబోతున్నట్టు చెప్పారు. ఏరోస్పేస్, ఐటీ పరిశ్రమల విస్తరణకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు. రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలని జిందాల్ ప్రతినిధులను సీఎం కేసీఆర్ కోరారు. సమావేశంలో సీఎం ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, జిందాల్ కంపెనీ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రాజీవసింగ్ కూడా పాల్గొన్నారు.