దాగుడుమూతలు!
కలడు కలడు అనువాడు కలడో, లేడో అని కలవరిస్తున్నారు పాలకులు. అధోజగత్తు అధినేత ఆచూకీ కోసం మల్లగుల్లాలు పడుతున్నారు. మాఫియా డాన్ అడ్రస్ పై పూటకోమాట చెబుతున్నారు. వందల మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన కిరాతక ముఠా నాయకుడి జాడపై నేతాశ్రీలు పిల్లిమొగ్గలు వేస్తున్నారు. పొరుగు దేశంలో ఉన్నాడా, లేదా అనేది చెప్పలేకపోతున్నారు.
1993 ముంబై మారణహోమానికి కారకుడైన మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఆచూకీపై పాలకుల ప్రకటనతో గందరగోళం నెలకొంది. మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న దావూద్ అప్పట్లో లొంగిపోతానన్నడని ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ వెల్లడించి తుట్టును కదిపారు. ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే లొంగిపోతానని దావూద్ తనకు ఫోన్ చేశాడని తన పుస్తకంలో పేర్కొన్నారు. అయితే సీబీఐ ఒప్పుకోకపోవడంతో డాన్ లొంగిపోలేదన్నారు. లొంగిపోతే ఎందుకు వద్దంటామని అప్పటి సీబీఐ డైరెక్టర్ విజయరామారావు గడుసుగా ప్రశ్నించారు.
దీనికి కొనసాగింపుగా పార్లమెంట్ లో ప్రభుత్వం తప్పులో కాలేయడంతో 'దావూద్ అడ్రస్' వార్తల్లో అంశంగా మారిపోయింది. మాఫియా డాన్ ఎక్కడున్నాడో ఇంతవరకూ తెలియదని హోం శాఖ సహాయ మంత్రి హరిభాయ్ పార్తీభాయ్ చౌధురీ.. లోక్ సభలో చేసిన ప్రకటనతో ఎన్డీఏ సర్కారు అభాసుపాలైంది. దావూద్ పాకిస్థాన్ లోనే ఉన్నాడని, అతడిని రప్పించి తీరుతామని ప్రకటించి హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్.. జరిగిన నష్టాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేశారు. అయితే దావూద్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సన్నాయి నొక్కులు నొక్కారు.
పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ దావూద్ ను అంతం చేసి ఉంటుందన్న అనుమానాన్ని ఓ ఉన్నతాధికారి వ్యక్తం చేశారు. పాలకుల చేతగానితనం వల్లే దావూద్ దేశం సరిహద్దు దాటాడు. వందలాది మంది ప్రాణాలు పోవడానికి కారకుడైన కిరాతకున్ని కటకటాల వెనక్కి పంపిచకపోవడంలో విధాన నిర్ణేతల వైఫల్యం కొట్టిచ్చినట్టుగా కనబడుతోంది. దీన్నినుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే ఆచూకీ అంటూ హడావుడి చేస్తున్నారే గానీ పొరుగు దేశంపై ఒత్తిడి పెంచి డాన్ ను తీసుకురాలేపోతున్నారు.