ఇకనైనా నన్ను వెంటాడటం మానండి: దావూద్
న్యూఢిల్లీ: తన రిటైర్‌మెంట్‌కు ముందు ఓ సీనియర్ ఐపీఎస్ అధికారికి అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం నుంచి ఊహించని కాల్ వచ్చింది. ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా మరికొన్ని రోజుల్లో పదవీ విరమణ చేస్తారనగా.. నీరజ్‌కుమార్ ఓరోజు దావూద్ నుంచి ఫోన్ కాల్ అందుకున్నారు. 'క్యా సాహెబ్, ఆప్ రిటైర్ హోనే జారేహే హో. ఆబ్ తో పీచ్చా ఛోడ్ దో' (ఏంటీ సర్ ఇది. మరికొన్ని రోజుల్లో రిటైర్ అవ్వబోతున్నారు. ఇప్పటికైనా నన్ను వెంటాడటం మానుకోండి) అంటూ దావూద్ కోరాడు.
2013 జూన్ మొదటి వారంలో ఈ ఘటన జరిగింది. 'ఒక రోజు నా పర్సనల్ మొబైల్‌కు ఓ గుర్తుతెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చింది. అది బహుశా దావూద్ వ్యక్తిగత నెంబర్ ఉంటుంది' అని నీరజ్‌కుమార్ ఈ ఫోన్‌కాల్ గురించి వివరించారు. 'మై కన్వర్సెషన్స్ విత్ దావూద్ ఇబ్రహీం' పేరుతో ఆయన రాసిన తాజా పుస్తకంలో 'డయల్ డీ ఫర్ డాన్' అధ్యాయంలో ఈ విషయాన్ని వెల్లడించారు.
తన వృత్తిజీవితంలో నిర్వహించిన 11 టాప్ ఆపరేషన్స్ గురించి వివరిస్తూ నీరజ్‌కుమార్ ఈ పుస్తకం రాశారు. ఈ ఆపరేషన్లన్నీ అండర్ వరల్డ్, 1993 ముంబై వరుస పేలుళ్లు, దేశవ్యాప్తంగా నేరగ్యాంగుల చుట్టే తిరుగుతాయి. ఎన్నో ఆసక్తికర అంశాలున్న ఈ పుస్తకం త్వరలోనే పెంగ్విన్ బుక్స్ విడుదల చేయనుంది.