అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం | YS Jaganmohan Reddy assurance to the Vaidya Mitra and Medical Staff | Sakshi
Sakshi News home page

అధైర్యపడొద్దు.. అండగా ఉంటాం

Published Mon, Jan 14 2019 4:13 AM | Last Updated on Mon, Jan 14 2019 4:16 AM

YS Jaganmohan Reddy assurance to the Vaidya Mitra and Medical Staff - Sakshi

పులివెందుల పార్టీ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ని కలిసి సమస్యను వివరిస్తున్న దివ్యాంగులు

సాక్షి ప్రతినిధి, కడప: ‘‘అన్నా.. ఉద్యోగాలు కోల్పోతున్నాం.. మా కుటుంబాలు వీధిపాలు కానున్నాయి.. పదేళ్లు సేవ చేసినా ఫలితం లేకుండా పోతోంది..’’ అంటూ చిరుద్యోగులు, ‘‘రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వేతర రంగ సంస్థల్లో 3 శాతం రిజర్వేషన్లు కేటాయించాల్సి ఉండగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. మమ్మల్ని ప్రోత్సహించండి..’’ అంటూ దివ్యాంగులు ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎదట వాపోయారు. వారి విన్నపాలకు స్పందించిన ప్రతిపక్షనేత.. ‘అధైర్యపడొద్దు. అండగా ఉంటాం. తోలుమందం ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి. నిబ్బరంగా ఉండాలి’ అని సూచించారు. ఆదివారం వైఎస్సార్‌ జిల్లా పులివెందుల కార్యాలయంలో ఆయన విన్నపాలను స్వీకరించారు. ఎన్టీఆర్‌ వైద్యసేవ ట్రస్ట్‌ ఉద్యోగులు, పీహెచ్‌సీ, నెట్‌వర్క్‌ ఆస్పత్రుల వైద్యమిత్రలు, టీం లీడర్లు సంయుక్తంగా కలిసి వారి సమస్యను విన్నవించారు. ‘‘పదేళ్ల పాటు చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాం. తక్కువ వేతనాలతో ఎన్టీఆర్‌ వైద్యసేవ పథకానికి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చాం. మమ్మల్ని తప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనేక ఎత్తుగడలను ప్రదర్శిస్తోంది. హైకోర్టు అనుకూలమైన తీర్పు వెల్లడిస్తే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అర్హత పరీక్షలు నిర్వహించుకోవాలని సుప్రీం సలహా ఇస్తే ఎలాగైనా ఇంటికి పంపాలని సంబంధం లేని ప్రశ్నలతో పరీక్ష నిర్వహించారు. పూర్తిగా నష్టపోయి మేము, మా కుటుంబాలు రోడ్డున పడాల్సి వస్తోంది. ఇదివరకు పనిచేస్తున్న సిబ్బందినే కొనసాగించాలి’’ అని జగన్‌కు విన్నవించుకున్నారు.  

ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదు.. 
వైద్య విధాన పరిషత్‌ కాంట్రాక్టు కార్మికులు మాట్లాడుతూ కేవలం రూ.3,500 వేతనంతో విధులు నిర్వర్తించామని, దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డికి 2009 జూన్‌ 15న విన్నవిస్తే రూ.2 వేలు జీతం పెంచారని, రెగ్యులర్‌ చేయాలని కోరగా ఏడాది తర్వాత చేస్తామన్నారని తెలిపారు. ఆయన మరణంతో తర్వాతి ప్రభుత్వాలు పట్టించుకోలేదని విన్నవించారు. అలాగే ప్రభుత్వేతర సంస్థలైన ఏపీఎస్‌ఆర్టీసీ, ఎపీఎస్‌ఈబీల్లో దివ్యాంగులకు 3 శాతం రిజర్వేషన్లు కేటాయించి, బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలను భర్తీ చేయించేలా కృషి చేయాలని కారుణ్య డిజేబుల్, ఆర్ఫాన్స్‌ అండ్‌ వెల్ఫేర్‌ ఎంపవర్‌మెంట్‌ సొసైటీ సభ్యులు కోరారు. దివ్యాంగుల వివాహ ప్రోత్సాహక బహుమతిని రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచాలని కోరారు. అదేవిధంగా పంచాయితీరాజ్, రూరల్‌ డెవలప్‌మెంట్‌ శాఖ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, ఇందిరప్రభ, జలసిరి పథకాలల్లో ఎనిమిదేళ్లుగా పనిచేస్తున్న జియాలజిస్టులు తమకు రూ.10 వేలు జీతం తగ్గించారని వాపోయారు. బాధితుల ఆవేదనను ఓపిగ్గా విన్న తర్వాత ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వారిని సముదాయించారు. ‘‘రాబోవు రోజుల్లో మనందరి ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, మీకు అండగా నిలుస్తుంది. ఎలాంటి ఆవేదన పెట్టుకోవద్దు’’ అని సూచించారు.
పార్టీ  కార్యాలయంలో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న వైఎస్‌ జగన్‌ 

హైదరాబాద్‌కు వైఎస్‌ జగన్‌
ప్రజా సంకల్పయాత్ర ముగించుకుని వైఎస్సార్‌ జిల్లా పర్యటనకు వచ్చిన ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌ ఆదివారం రాత్రి హైదరాబాద్‌ బయలుదేరి వెళ్లారు. ఆదివారం ఉదయం నుంచి సాయంత్రం వరకు పులివెందులలో పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను కలుసుకుంటూ, సమస్యలు వింటూ బిజీ బిజీగా గడిపిన ప్రతిపక్షనేత.. రాత్రి కడప రైల్వే స్టేషన్‌కు చేరుకుని వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్‌లో హైదరాబాద్‌ బయల్దేరారు. రైల్వేస్టేషన్‌కు కడప ఎమ్మెల్యే అంజద్‌బాషా, మాజీ ఎంపీ అవినాష్‌రెడ్డి, కమలాపురం నియోజకవర్గ సమన్వయకర్త దుగ్గాయపల్లె మల్లిఖార్జునరెడ్డి వచ్చారు.

బిజీబిజీగా గడిపిన ప్రతిపక్షనేత
పులివెందులలో మూడోరోజు ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బిజీబిజీగా గడిపారు. తన కార్యాలయంలో ఉదయం 9 గంటల నుంచే కార్యకర్తలకు, ప్రజానీకానికి జగన్‌ అందుబాటులో ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. కాగా, నేతలందరితో వైఎస్‌ జగన్‌ మమేకమయ్యారు. అనంతపురం, నెల్లూరు జిల్లాల నాయకులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. హిందూపురం పార్లమెంటు అధ్యక్షుడు నదీంఅహమ్మద్, మాజీ మంత్రులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, వైఎస్‌ వివేకానందరెడ్డి, మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి కలిశారు. ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు ప్రసాద్‌రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, ఎస్‌బీ అంజాద్‌బాషా, మేయర్‌ సురేష్‌బాబు,  మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్‌నాథ్‌రెడ్డి, జమ్మలమడుగు సమన్వయకర్త డాక్టర్‌ సుధీర్‌రెడ్డి తదితరులు వైఎస్‌ జగన్‌తో సమావేశమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement