
26న కాకినాడలో వైఎస్ జగన్ ప్రచారం
ప్రతిపక్ష నేత పర్యటన ఖరారు
కాకినాడ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తూర్పు గోదావరి జిల్లా కాకినాడ కార్పొరేషన్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆయన ఈ నెల 26వ తేదీన నగరంలోని 12 డివిజన్లలో కార్పొరేషన్ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను వైఎస్సార్‌సీపీ ప్రోగ్రాం కో–ఆర్డినేటర్ తలశిల రఘురామ్, మాజీ మంత్రి పి.పార్థసారథి గురువారం విలేకరులకు తెలిపారు.
జగన్ ఎన్నికల ప్రచారం శనివారం కాకినాడ జగన్నాథపురం ప్రాంతంలోని చంద్రిక థియేటర్ నుంచి ప్రారంభమై 12 డివిజన్ల మీదుగా కొనసాగుతుందన్నారు. 25, 26 డివిజన్ల పరిధి నుంచి ప్రారంభమై 24, 23, 22, 21, 20, 19, 16, 18, 17,15 డివిజన్ల మీదుగా గాంధీ సెంటినరీ వద్ద ప్రచారం ముగుస్తుందన్నారు. ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు జగన్ పర్యటన జరుగుతుందన్నారు. కాకినాడలో పార్టీ అధ్యక్షుడి పర్యటనను విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ శ్రేణులను కోరారు.