గడువు కావాలన్న సీబీఐ.. జగన్ బెయిల్పై విచారణ 18కి వాయిదా
కౌంటర్ దాఖలు చేయడానికి తమకు మరింత సమయం కావాలని సీబీఐ కోరడంతో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన రెడ్డి దాఖలుచేసిన బెయిల్ పిటిషన్పై విచారణను నాంపల్లి సీబీఐ కోర్టు ఈనెల 18వ తేదీకి వాయిదా వేసింది. జగన్ బెయిల్ పిటిషన్పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలంటే తమకు కనీసం ఐదు రోజుల గడువు కావాలని సీబీఐ కోరింది. దీంతో సెప్టెంబర్ 18వ తేదీన కోర్టు ఎదుట అఫిడవిట్ దాఖలు చేయాలని సీబీఐని కోర్టు ఆదేశించి, అదే రోజుకు విచారణను వాయిదా వేసింది.
ఆస్తుల కేసులో విచారణను నాలుగు నెలల్లోగా ముగించాలని సీబీఐకి సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు సెప్టెంబర్ 9వ తేదీతోనే ముగియడంతో, సుప్రీం సూచన మేరకు వైఎస్ జగన్.. నాంపల్లి సీబీఐ కోర్టులో బుధవారం నాడు బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. సెప్టెంబరు 10వ తేదీన సీబీఐ మూడు అదనపు చార్జిషీట్లు దాఖలు చేసింది. దాంతో కలిపి మొత్తం ఇప్పటివరకు 8 చార్జిషీట్లు దాఖలుచేసినట్లయింది.
ఆస్తుల కేసులో సీబీఐ గత సంవత్సరం మే 27వ తేదీన జగన్మోహనరెడ్డిని విచారణకు పిలిపించి, ఆ పేరుతో అరెస్టుచేసిన విషయం తెలిసిందే. అప్పటినుంచి ఆయన చంచల్గూడ జైల్లో విచారణ ఖైదీగా ఉన్నారు. సెప్టెంబర్ 20వ తేదీ వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండులో ఉండాలి. తాము త్వరలోనే తుది చార్జిషీటు దాఖలుచేయనున్నట్లు కోర్టుకు సీబీఐ తెలిపింది. రాష్ట్ర విభజనపై ఇరు ప్రాంతాల్లోనూ ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్నందున తాను ఒక రాజకీయ పార్టీకి నాయకుడిగా ప్రజల్లో ఉండాల్సిన అవసరం ఉందని జగన్ తన న్యాయవాది ద్వారా కోర్టుకు దాఖలుచేసిన బెయిల్ పిటిషన్లో పేర్కొన్నారు.