పుడమి పులకించగా.. రైతు పరవశించగా.. | YS Rajasekhara Reddy Government Development Programs | Sakshi
Sakshi News home page

పుడమి పులకించగా.. రైతు పరవశించగా..

Published Wed, Apr 10 2019 11:14 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

YS Rajasekhara Reddy Government Development Programs - Sakshi

అది 1995–2003 మధ్య కాలం.. ఎన్టీఆర్‌ నుంచి పదవి లాగేసుకుని చంద్రబాబు తొమ్మిదేళ్లు రాష్ట్రాన్ని ఏలిన సమయం. చినుకు రాలక.. పాతాళగంగపైకి పొంగక కరువు రక్కసి కరాళనృత్యం చేసిన సందర్భం. వర్షాలు లేవు, పంటలు పండవు. చేతిలో పైసా లేదు. అప్పుల కుప్పలు.. అన్నమో రామచంద్రా.. అంటూ అన్నదాత దిక్కులు చూశారు. రైతులే కాదు.. కూలీలు, పేదలు... అన్ని వర్గాల ప్రజలు పొట్ట చేతపట్టుకుని ఊళ్లకు ఊళ్లు ఖాళీ చేసి పొరుగు రాష్ట్రాలకు వలసలు వెళ్లారు. పచ్చని పల్లెసీమలు కళ తప్పాయి. అలాంటి సమయంలో వైఎస్‌ రాజశేఖరరెడ్డి ‘అనంత’ ఆశాకిరణంగా కనిపించారు. 2004లో ముఖ్యమంత్రి కాగానే జనరంజక పాలనను అందించారు. జిల్లాకు ఆత్మబంధువుగా, ఆపద్బాంధవుడయ్యారు. రైతులకు పెద్దపీట వేస్తూనే మిగతా అన్ని వర్గాలకు వెన్నుదన్నుగా నిలిచారు.   

సాక్షి, అనంతపురం అగ్రికల్చర్‌ :: తొమ్మిదేళ్ల పాలనలో చంద్రబాబు రైతులను దారుణంగా అవమానించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్లుగా సువర్ణపాలనను అందించారు.   ‘అనంత’పై ప్రత్యేక దృష్టి సారించారు. 2004లో ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేసిన తక్షణం రైతుల విద్యుత్‌ బిల్లులను మాఫీ చేస్తూ తొలిసంతకం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.1,259 కోట్లు కరెంటు బిల్లులు మాఫీ కాగా.. అందులో అనంతపురం జిల్లా రైతులకు సంబంధించిన రైతులవి రూ.70.65 కోట్లు మాఫీ అయ్యాయి. అలాగే అప్పట్లో ఉన్న 1.75 లక్షల మోటార్లకు ఉచితంగా కరెంటు ఇచ్చారు. ఆయన ఆరేళ్ల హయాంలో రూ.150 కోట్లు విలువైన  ఉచిత కరెంటు రైతులకు అందించారు. 


పెంచిన పంట రుణాలు 
వైఎస్సార్‌ హయాంలో పంట రుణాల కింద 27.37 లక్షల మంది రైతులకు రూ.6,594 కోట్లు అందజేశారు. అంతకు మునుపు 1995 నుంచి 2003 వరకు చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో 15.76 లక్షల మందికి కేవలం రూ.2,175 కోట్లు మాత్రమే పంట రుణాలు ఇచ్చారు. వైఎస్సార్‌ హయాంలో ఏటా పంట రుణాలు పెంచుతూ, అందులోనూ కొత్త రైతులకు ప్రాధాన్యత ఇవ్వడంతో వ్యవసాయం సాఫీగా సాగింది.  సకాలంలో పంట రుణాలు చెల్లించిన రైతులకు పావలా వడ్డీ కింద ఐదేళ్లలో 12 లక్షల అకౌంట్లకు రూ.44 కోట్లు ఇచ్చారు. 


బీమాతో ధీమా 
చంద్రబాబు హయాంలో మండలం యూనిట్‌గా తీసుకుని వేరుశనగ పంటల బీమాను అమలు చేయగా...చాలా మంది రైతులకు అది అందలేదు. దీంతో వైఎస్సార్‌ అధికారంలోకి రాగానే గ్రామం యూనిట్‌గా అమలు చేసి నష్టపోయిన ప్రతి రైతుకు పారదర్శకంగా బీమా పరిహారం ఇచ్చారు. 2004 నుంచి 2009 వరకు వైఎస్‌ ప్రభుత్వం దెబ్బతిన్న వేరుశనగ పంటకు సంబంధించి అర్హులైన రైతులకు పంటల బీమా కింద ఏకంగా రూ.1116 కోట్లు పరిహారం ఇచ్చారు. పంట కోత ప్రయోగాల ఆధారంగా పంట నష్టం లెక్కకట్టి పారదర్శకంగా పరిహారం అందజేశారు. 2008లో తీవ్ర వర్షాభావంతో 80 శాతం మేర పంటలు దెబ్బతినగా... అప్పట్లో జిల్లా వ్యాప్తంగా 4.64 లక్షల మంది రైతులు తమ వాటా కింద రూ.32 కోట్లు ప్రీమియం కట్టారు.

గ్రామం యూనిట్‌గా బీమా పథకం కింద అమలు చేయగా 4.59 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.620 కోట్లు పరిహారం అందింది. అదే చంద్రబాబు 1995–2003 మధ్య తొమ్మిదేళ్లలో పంటల బీమా పథకం కింద కేవలం రూ.323 కోట్లు పరిహారం ఇచ్చారు. ఇక 2011 నుంచి కొత్తగా అమలులోకి వచ్చిన వాతావరణ బీమా రైతులను ఆదుకునే పరిస్థితి లేదు. లోపభూయిష్ట నిబంధనల కారణంగా ఏటా రైతులకు తీరని అన్యాయం జరుగుతోంది. 


ఏకకాలంలో రుణమాఫీ, ప్రోత్సాహం 
ఖరీఫ్‌–2008లో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొనడంతో 9 లక్షల హెక్టార్లలో పంటలన్నీ దారుణంగా దెబ్బతిన్నాయి. ఈ సమయంలో అప్పటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో రుణమాఫీ చేశారు. 2008–09లో 3,03,937 మంది రైతులకు సంబంధించి రూ.554.92 కోట్లు రుణాలు ఒకేసారి మాఫీ అయ్యాయి. అలాగే పంట రుణాలు చెల్లించిన 3,61,269 మంది రైతులకు ప్రోత్సాహకాల కింద రూ.5 వేల చొప్పున రూ.174.04 కోట్లు అందజేశారు. మొత్తమ్మీద 6,65,206 మంది రైతులకు రూ.625 కోట్లు లబ్ధిచేకూరింది.   


విత్తనానికి బాసట 
2004 నుంచి 2009 వరకు వైఎస్సార్‌ తన ఆరేళ్ల పాలనలో 28,05,901 మంది రైతులకు 26,02,717 క్వింటాళ్లు విత్తనకాయ పంపిణీ చేశారు. దానికోసం ఏకంగా రూ.280.88 కోట్లు సబ్సిడీ వర్తింపజేశారు. ఇతర విత్తనాల కోసం రూ.80 కోట్లు ఖర్చు చేశారు. మొత్తంగా రూ.360 కోట్లు విత్తన రాయితీ అందించారు. అదే చంద్రబాబు తన తొమ్మిదేళ్లలో విత్తన వేరుశనగకు రూ.49 కోట్లు మాత్రమే కేటాయించారు. తొమ్మిదేళ్లలో కలిపి 12,73,829 మంది రైతులకు కేవలం 9,58,800 క్వింటాళ్లు విత్తన వేరుశనగ పంపిణీ చేశారు. వ్యవసాయమే కాకుండా అనుబంధ రంగాలైన పాడి, పశుసంవర్ధక, పట్టు, ఏపీఎంఐపీ, ఉద్యానశాఖలకు వైఎస్సార్‌ పెద్దపీట వేశారు. దీంతో ప్రత్యామ్నాయ వ్యవసాయంపై ఆధారపడిన రైతులు, పేదలు కూడా సమస్యల నుంచి గట్టెక్కారు. 


ఉద్యాన విప్లవం 
2004కు ముందు కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితమైన పండ్లతోటలను జిల్లా నలుమూలలా విస్తరించేలా పెద్ద ఎత్తున రాయితీలు ప్రకటించారు. వైఎస్సార్‌ తన పాలనా కాలంలో రూ.80 కోట్లు మేర సబ్సిడీ ఇవ్వడంతో కొత్తగా 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో పండ్లతోటలు విస్తరించాయి. వైఎస్సార్‌ ఇచ్చిన ప్రోత్సాహంతో అనంతపురం జిల్లా ‘ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఏపీ’గా పేరుగాంచింది. 


సూక్ష్మసాగుకు ప్రోత్సాహం 
జిల్లా రైతులకు సూక్ష్మసాగు సేద్యం అత్యవసరమని గుర్తించిన వైఎస్సార్‌... రైతులకు బిందు, తుంపర పరికరాలను ప్రోత్సహించారు. ఎస్సీ ఎస్టీలకు వంద శాతం, ఇతర రైతులకు 90 శాతం రాయితీతో సూక్ష్మసేద్యాన్ని భారీగా విస్తరించారు. ఆరేళ్ల పాలనకాలంలో రూ.280 కోట్లు బడ్జెట్‌ ఇవ్వడంతో కొత్తగా 1.13 లక్షల హెక్టార్లకు డ్రిప్, స్ప్రింక్లర్లు అందజేశారు. 


రూ.12,500 కోట్లు ఖర్చు 
చంద్రబాబు తన తొమ్మిదేళ్ల కాలంలో జిల్లా వ్యవసాయం, అనుబంధ రంగాలన్నింటికీ రూ.2,938 కోట్లు ఖర్చు చేయగా... అదే వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆరేళ్లలోనే ఏకంగా రూ.12,500 కోట్లు వెచ్చింది రైతులకు వివిధ రూపాల్లో ప్రయోజనం చేకూర్చారు.


అన్నదాత ఆత్మబంధువు.. వైఎస్సార్‌..

  •  చంద్రబాబు హయాంలో కబళించిన కరువు 
  •  2004లో వైఎస్సార్‌ సీఎం కాగానే మారిన రైతుల తలరాత 
  • ‘అనంత’ సంక్షేమానికే అధిక ప్రాధాన్యమిచ్చిన రాజన్న  
  •  పంటల బీమా కింద రూ.1,116 కోట్లు పరిహారం 
  •  రూ.100 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ 
  •  విద్యుత్‌ బకాయిలు మాఫీ.. రూ.150 కోట్లతో ఉచిత విద్యుత్‌ 
  •  రూ.555 కోట్ల రుణమాఫీ.. ప్రోత్సాహకాలకు రూ.170 కోట్లు      

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement