నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు | Chandrababu Government Failed To Complete The Pereru Project | Sakshi
Sakshi News home page

నీళ్ల కోసం కాదు..నిధుల దోపిడికే! పేరూరు

Published Mon, Apr 8 2019 10:14 AM | Last Updated on Mon, Apr 8 2019 10:16 AM

Chandrababu Government Failed To Complete The Pereru Project - Sakshi

నీరు లేక పూర్తిగా ఎండిపోయిన పేరూరు డ్యాం అంతర్‌ భాగం

రాప్తాడు నియోజకవర్గ రైతుల కల పేరూరు ప్రాజెక్టు. 70 ఏళ్ల క్రితం నిర్మితమైన ఆ ప్రాజెక్టుకు నీళ్లొస్తే ఈ ప్రాంతాల ముందు కోనసీమ దిగదుడుపే. ఎటు చూసినా పచ్చని పంట చేలతో వ్యవసాయాన్ని పండుగలా చేసేవారు. అలాంటి పేరూరు ప్రాజెక్ట్‌కు నీటి వనరులు లేకుండా పోయాయి. సాగునీళ్లు అందుతాయని, బీడు భూముల్లో పంటలు పండి తమ బతుకులు మారుతాయని వేల కుటుంబాలు ఏళ్ల తరబడి నిరీక్షిస్తూ వచ్చాయి. ప్రతి ఎన్నికల్లోనూ పేరూరు ప్రాజెక్ట్‌ను నీటితో నింపుతామంటూ నాయకులు లబ్ధి పొందుతూ వచ్చారు. రాప్తాడు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు ఎన్నికల్లోనూ పరిటాల సునీతనే ఎమ్మెల్యేగా గెలుపొందారు.

ఈ రెండు ఎన్నికల్లోనూ పేరూరు ప్రస్తావనే ఆమెకు ఓట్లు పడేలా చేశాయి. కానీ నీళ్లవ్వలేదు.  తాజా ఎన్నికల్లో సునీత తనయుడు శ్రీరాం బరిలో నిలిచారు. ఇప్పుడు కూడా ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు పేరూరు ప్రస్తావనే తెరపైకి తీసుకువచ్చారు. అసలు ప్రాజెక్ట్‌ను తామే తెచ్చామని, దానికి నీళ్లు రావాలంటే తిరిగి తనను గెలిపించాలని ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలకు తెరలేపారు. వాస్తవానికి ప్రాజెక్టు నిర్మాణంలో పరిటాల కుటుంబానికి రాజకీయ కోణం మినహా మానవీయ కోణం లేదనేది అక్షర సత్యం.  

ప్రకాష్‌రెడ్డి పోరాటాలు..
పేరూరు ప్రాజెక్టుకు నీళ్లివ్వాలని వైఎస్సార్‌ సీపీ రాప్తాడు సమన్వయకర్త, ప్రస్తుత ఆ పార్టీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పలు పోరాటాలు చేశారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో చొరవ తీసుకుని  ప్రకాష్‌రెడ్డి అందించిన ఫీజుబులిటీ రిపోర్టు ఆధారంగా రూ.119కోట్లతో ప్రాజెక్టుకు నీళ్లిచ్చేందుకు అధికారులు ప్రణాళిక రూపొందించారు. హంద్రీ–నీవాలో భాగంగా ‘పేరూరు బ్రాంచ్‌కెనాల్‌’ ఏర్పాటు చేసి నీళ్లు ఇవ్వాలని భావించారు. వైఎస్సార్‌ మరణానంతరం ఈ ప్రణాళికను చెత్తబుట్టలో పడేశారు. తర్వాత మడకశిర బ్రాంచ్‌ కెనాల్‌ ద్వారా తురకలాపట్నం నుంచి నీళ్లిస్తే పైసా ఖర్చు లేకుండా పేరూరుకు నీళ్లివ్వొచ్చని విపక్షపార్టీల నేతలను కలుపుకుని ప్రకాష్‌రెడ్డి పలుమార్లు ప్రభుత్వానికి విన్నవించారు. అయినా నాలుగేళ్లుగా పేరూరు ప్రాజెక్టును మంత్రి సునీత పట్టించుకోలేదు.  

ప్రణాళిక ప్రకారమే నిధుల దోపిడీ 
పేరూరు ప్రాజెక్ట్‌కు నీరు ఇవ్వాలనే అంశాన్ని ఎన్నికలకు ముందు మంత్రి సునీత తెరపైకి తెచ్చారు. గత ప్రభుత్వం డీపీఆర్‌ ప్రకారం బోరంపల్లి లిప్ట్‌ నుంచి రూ.119 కోట్లతో ఈ ప్రాజెక్టుకు నీళ్వివ్వొచ్చు. ఈ అంచనా వ్యయాన్ని రూ.803కోట్లకు పెంచేలా సునీత పావులు కదిపారు. కేవలం అడ్డగోలు గా నిధులు దోచుకోవడంలో భాగం గానే అంచనా వ్యయాన్ని పెంచినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టు పరిధిలో పుట్టకనుమ, సోమరవాండ్లపల్లి వద్ద రెండు రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఇందులో 0.6 టీఎంసీలతో 26లక్షల క్యూబిక్‌ మీటర్ల విస్తీర్ణంలో  పుట్టకనుమ రిజర్వాయర్‌ నిర్మించి నీళ్లివ్వాలని అప్పటి ఎమ్మెల్యే బి.నారాయణరెడ్డి ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. ఇప్పుడు ప్రభుత్వం నిర్మిస్తున్న పుట్టకనుమ సామర్థ్యం కూడా 0.6టీఎంసీలే! అయితే విస్తీర్ణం మాత్రం 26లక్షల నుంచి 76లక్షలకు పెంచారు. అంటే 50లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిని పెంచారు. నిల్వ సామర్థ్యం పెరగనప్పుడు ప్రాజెక్టు విస్తీర్ణం పెరగడం దోపిడీకి అద్దం పట్టింది.  

దోపిడీపై న్యాయ పోరాటం..  
పేరూరుకు నీళ్లిచ్చేందుకు ప్రత్యామ్నాయాలు ఉన్నా, తక్కువ ఖర్చుతో పనులు పూర్తి చేసే మార్గాలు ఉన్నా,కేవలం ప్రజాధనాన్ని దోపిడీ చేసేందుకు రూ.803కోట్లతో ప్రభుత్వం పాలన అనుమతులు ఇవ్వడంపై ఆయకట్టు రైతులు జెడ్పీటీసీ రవీంద్రారెడ్డి, పి.నల్లపురెడ్డి తదితరులు లోకాయుక్తను ఆశ్రయించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో 59లోని లోపాలు, నిపుణుల కమిటీ వ్యవహరించిన తీరు, ప్రభుత్వం ఆమోదించిన డీపీఆర్‌లోని లోపాలు, ఆయకట్టు పరిస్థితి తదితర అంశాలను ససాక్ష్యాలతో వివరించారు.

పేరూరుకు నీళ్లిచ్చే పేరుతో సోమరవాండ్లపల్లి, పుట్టకనుమ రిజర్వాయర్లను పొందుపరిచారని, నిజానికి ఆ రిజర్వాయర్ల పరిధిలో ఆయకట్టు లేదని, కేవలం కాస్ట్‌బెనిఫిట్‌ రేషియో ప్రకారం పాలన అనుమతులు వచ్చేందుకే వాటిని పొందుపరిచారని పిటీషన్‌లో పేర్కొన్నారు. ఆ రిజర్వాయర్ల పరిధిలో పేర్కొన్న గ్రామాలకు హంద్రీ–నీవా, పీఏబీఆర్‌ డిస్ట్రిబ్యూటరీల ద్వారా నీరు ఇచ్చే అవకాశం ఉందని వివరించారు. కేవలం పెంచిన అంచనాలకు ఆమోద ముద్ర వేయించుకుని, ప్రజాధనాన్ని దోచుకునేందుకే ఈ రిజర్వాయర్లను డీపీఆర్‌లో పొందుపరిచారని అభ్యంతరం వ్యక్తం చేశారు. అయినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు.  

ఇదీ ప్రాజెక్టు చరిత్ర 
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పేరూరు ప్రాజెక్టును 1950–58లో నిర్మించారు. 1.82 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అప్పట్లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. 3.5 కిలో మీటర్లున్న ప్రాజెక్టు పరిధిలో 10,048 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారు. కుడికాలవ పరిధిలో 9,448, ఎడమకాలవ పరిధిలో 600 ఎకరాల ఆయకట్టుకు నీరివ్వాలి. గత 60 ఏళ్లలో ఈ ప్రాజెక్ట్‌కు పూర్తిస్థాయిలో 14 సార్లు నీళ్లు వచ్చాయి. 75 శాతం ఒకసారి,  25 శాతం ఒకసారి వచ్చాయి. దాదాపు 34 ఏళ్లు ఈ ప్రాజెక్ట్‌కు చుక్కనీరు చేరలేదు. 25 సంవత్సరాల పాటు ఈ ప్రాంతానికి ఎమ్మెల్యేలుగా ఎన్నికవుతూ వచ్చిన పరిటాల కుటుంబీకులు ఈ పాతికేళ్లలో ఏనాడూ ప్రాజెక్ట్‌ గురించి పట్టించుకోకపోవడం గమనార్హం. ఫలితంగా ప్రాజెక్టుపై ఆధారపడిన భూములన్నీ బీళ్లుగా మారాయి. బతికే మార్గం లేక రైతులు వలసబాట పట్టారు.  

గుడ్‌విల్‌ కింద రూ.47 కోట్లు? 
పేరూరుకు నీటిని తరలించే పనులను మెయిల్‌ అనే నిర్మాణసంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు టెండర్‌ దక్కేలా సునీత ముందే పథకం రచించారు. దీంతో ‘గుడ్‌విల్‌’ కింద రూ.47కోట్లను మంత్రి కుటుంబీకులకు ఆ సంస్థ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ డబ్బులే ఇప్పుడు ఎన్నికల్లో పరిటాల కుబీంకులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. ఈ క్రమంలో అసలు రాప్తాడు ఎమ్మెల్యేగా ఇన్నేళ్లుగా ఎవరు కొనసాగుతున్నారు? ఎందుకు ఈ ప్రాజెక్టుకు నీరు రాలేదు? ఇందులో ఎవరి వైఫల్యం ఉంది? పేరూరు ప్రాజెక్టు పేరుతో దోపిడీ ఎలా జరిగింది? రైతులకు ఏతీరున అన్యాయం జరిగింది? అనే అంశాలపై నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చర్చ నడుస్తోంది. 

పొలాన్ని బలవంతంగా లాక్కొన్నారు 
కేఎన్‌ పాళ్యం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్‌ 336–1లో ఐదు ఎకరాల భూమికి 1976లో నా భర్త మంగల ముత్యాలప్ప పేరున ప్రభుత్వం డి–పట్టా ఇచ్చిం ది. 4 నెలల క్రితం పేరూరు డ్యాంకు కాలువ పనులకంటూ మా భూమిని ఇతరుల పేరుమీద మార్చి బలవంతంగా లాక్కొన్నారు. ఈ విషయంపై జిల్లా అధికారులు సైతం మాకు న్యాయం చేయలేదు.

మంగల నరసమ్మ, మద్దెలచెరువు, కనగానపల్లి మం‘‘  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement