* బాబు హయాంలో ఆ ప్రాజెక్టుకు గ్రహణం
* తొమ్మిదేళ్ల హయంలో ఖర్చు చేసింది రూ.13.5 కోట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రకాశం జిల్లాకు వరప్రదాయని వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హాయంలో పరుగులు పెట్టగా.. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి గ్రహణం పట్టింది. ఫ్లోరైడ్, కరువు పీడిత ప్రకాశం జిల్లాతో పాటు నెల్లూరు, కడప జిల్లాల్లోని 30 మండలాల్లో 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15.25 లక్షల మందికి తాగునీటి సౌకర్యం కల్పించడానికి రూ. 5,150 కోట్ల అంచనా వ్యయంతో పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టును చేపట్టారు. 1995లోనే ప్రాజెక్టుకు అనుమతి వచ్చింది.
గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఈ ప్రాజెక్టుకు పలుమార్లు శంకుస్థాపనలు చేశారు. ఆయన అప్పటి 9 సంవత్సరాల పాలనలో ప్రాజెక్టుకు చేసిన వ్యయం కేవలం రూ. 13.5 కోట్లే. అది కూడా చిల్లర ఖర్చు కిందే చూపించారు. నిర్మాణం కోసం చేసిన ఖర్చు దాదాపు శూన్యమే. వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సాగునీటి ప్రాజెక్టుకు విశేష ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఈ ప్రాజెక్టుకు రూ. 1,448.14 కోట్లు ఖర్చు చేశారు. పనులు వేగంగా చేయడానికి అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు.
అనంతరం రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు కూడా వైఎస్ ఒరవడినే కొనసాగించాయి. వారిద్దరి హయాంలో రూ. 2053.05 కోట్లు ఖర్చు చేశారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు రెండోసారి అధికారం చేపటే ్టనాటికి ప్రాజెక్టు పనుల్లో 63 శాతం పూర్తయ్యాయి. ఇప్పుడు బాబు అధికారం చేపట్టిన తర్వాత జరిగిన పని కేవలం 3.25 శాతమే.ప్రాజెక్టు పనుల్లో 66.25 శాతం పూర్తయ్యాయి. ప్రాజెక్టులో భాగంగా ఒక్కొక్కటి 18.8 కిలోమీటర్ల పొడవైన రెండు సొరంగాలను తవ్వుతున్నారు. బాబు అధికారం చేపట్టేనాటికి ఒకటో సొరంగం 6.75 కిలోమీటర్లు మిగిలిపోయి ఉండగా, ఈ రెండేళ్లకాలంలో తవ్వింది కేవలం 0.75 కిలోమీటర్లే.
రెండో సొరంగం దాదాపు 10 కిలోమీటర్లు తవ్వాల్సి ఉంది. ఇందులోనూ 0.6 కిలోమీటర్లు తవ్వకం పనులు జరిగాయి. చంద్రబాబు ప్రభుత్వం ఈ రెండేళ్ల కాలంలో చేసిన ఖర్చు రూ. 500 కోట్ల లోపే. గతంలో చేసిన పనులకు చెల్లించాల్సిన బిల్లులు, అదనపు ధరల చెల్లింపులకే అధిక శాతం ఇవ్వడం గమనార్హం.
వైఎస్ హయాంలోనే వెలిగొండకు వెలుగు
Published Sun, Apr 17 2016 3:28 AM | Last Updated on Sun, Sep 3 2017 10:04 PM
Advertisement
Advertisement