జనమే జనం
- షర్మిల రోడ్డుషోలు,బహిరంగ సభలకు విశేష స్పందన
- ఎండలు లెక్కచేయకుండా కిక్కిరిసిన జనం
- నాలుగు నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం
సాక్షి,చిత్తూరు: సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజంపేట, చిత్తూరు ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల విజయం కోసం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి వైఎస్ షర్మిల జిల్లాలో ఆదివారం నిర్వహించిన రోడ్డుషో, బహిరంగ సభలకు జనం నుంచి విశేషస్పందన లభించింది. షర్మిల సభలు, రోడ్డుషోలతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఒక్కసారిగా వేడెక్కింది. తంబళ్లపల్లె, కుప్పం, పలమనేరు, పూతలపట్టు నియోజకవర్గాల్లో ఆమె సుడిగాలి పర్యటన చేసి వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
తంబళ్లపల్లె, కుప్పం నియోజకవర్గాల్లో సభలు, రోడ్డుషోలకు హాజరైన జనం ఎండలను కూడా లెక్కచేయకుండా నిలుచున్నారు. షర్మిలపై పూలవర్షం కురిపించి ఘనంగా స్వాగతం పలికారు. ముఖ్యంగా సభలకు మహిళలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. కుప్పం, ములకలచెరువు, వీ కోట, తంబళ్లపల్లె పట్టణాల్లో రోడ్లపై షర్మిలను చూసేందుకు ఆమె వాహనం వెంట జనం పరుగులుదీశారు.
రహదారుల్లో వాహనాలపై నుంచి, రోడ్డు పక్కన భవనాల పైనుంచి ఆమెను చూసేందుకు వేచి ఉన్నారు. రాజన్న పాలన రావాలన్నా, సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎం చేయాలని, ఇందుకోసం వైఎస్సార్‌సీపీ అభ్యర్థులకు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని షర్మిల పిలుపునిచ్చారు. వైఎస్ చేపట్టిన ప్రజాసంక్షేమ పథకాలను, జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే అమలుచేయనున్న సంక్షేమ పథకాలను వివరించారు.
ప్రతి వర్గానికి భరోసా కల్పించిన నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డేనని గుర్తు చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరి అభివృద్ధిని ఆకాంక్షించి సంక్షేమ పథకాలను అమలు చేసిన మహానేత వైఎస్సారేనన్నారు. ఓటు వేసేటప్పుడు ఒక్కసారి వైఎస్సార్‌ను తలుచుకుని ఫ్యాను గుర్తుకు ఓటు వేసి రాజన్న రాజ్యం వచ్చేందుకు తోడ్పడాలని పిలుపునిచ్చారు. చంద్రబాబును విమర్శించిన ప్రతి సందర్భంలోనూ జనం నుంచి చప్పట్లు, విజిల్స్‌తో విశేష స్పందన లభించింది.
షర్మిల ఎన్నికల ప్రచార సభల్లో రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కలిచెర్ల ప్రభాకర్‌రెడ్డి, టీఎన్ ప్రమీలమ్మ, కుప్పం ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రమౌళి, నియోజకవర్గ సమన్వయకర్త సుబ్రమణ్యంరెడ్డి, పలమనేరు ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్ అమరనాథరెడ్డి, చిత్తూరు పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సామాన్యకిరణ్, పూతలపట్టు ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ సునీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
పర్యటన ములకలచెరువులో ప్రారంభం
ఆదివారం ఉదయం ములకలచెరువులో బహిరంగ సభతో వైఎస్ షర్మిల పర్యటన ప్రారంభమైంది. నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెలో ప్రచార సభలో పాల్గొన్నారు. ఇక్కడ వైఎస్సార్ సీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రవీణ్‌కుమార్‌రెడ్డిని, రాజంపేట లోక్‌సభ అభ్యర్థి మిథున్‌రెడ్డిని గెలిపించాల్సిందిగా ప్రచారం నిర్వహించారు. మధ్య మధ్యలో కాన్వాయ్‌లో నుంచే వైఎస్ రాజశేఖరరెడ్డి తరహాలో చేతులు ఊపుతూ ఆయన్ను తలపిస్తూ షర్మిల అభివాదం చేయటం జనాన్ని విశేషంగా ఆకట్టుకుంది.
మదనపల్లె బైపాస్ రోడ్డు, పుంగనూరు మీదుగా ఆమె కుప్పం చేరుకున్నారు. అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడి నుంచి పలమనేరు నియోజకవర్గంలోని వీ కోట చేరుకుని రోడ్డుషో నిర్వహించారు. ఎన్నికల బహిరంగసభలో పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఎన్ అమరనాథరెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. వీ కోట నుంచి పూతలపట్టు నియోజకవర్గానికి బయలుదేరిన ఆమెకు దారిపొడవునా ప్రజలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు.
ముఖ్యంగా మహిళలు భారీ ఎత్తున ఆమె కోసం వేచి ఉన్నారు. పూతలపట్టు నియోజకవర్గం లోని బంగారుపాళెంలో ఎన్నికల ప్రచార సభలో పాల్గొని డాక్టర్ సునీల్‌కుమార్‌ను ఎమ్మెల్యేగా ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. పలమనేరు, కుప్పం, పూతలపట్టు నియోజకవర్గాల్లో చిత్తూరు లోక్‌సభ అభ్యర్థి డాక్టర్ సామన్య కిరణ్‌కు ఓట్లేసి గెలిపించాలని కోరారు.
కుప్పంలో అనూహ్య స్పందన
వైఎస్ షర్మిల ఎన్నికల ప్రచారానికి కుప్పం నియోజకవర్గంలో జనం నుంచి అనూహ్య స్పందన లభించింది. కుప్పం నుంచి వైఎస్సార్ సీపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న మాజీ ఐఎఎస్ అధికారి చంద్రమౌళి గెలుపును కాంక్షిస్తూ షర్మిల ఎన్నికల బహిరంగ సభలో ప్రసంగించారు. రాజన్న కూతుర్ని చూడాలన్న ఆశతో వచ్చిన జనసందోహంతో సభాస్థలి అయిన కుప్పం బస్టాండ్ ప్రాంతం కిక్కిరిసింది.
నియోజకవర్గంలోని గుడుపల్లె, శాంతిపురం, కుప్పం, రామకుప్పం మండలాల్లోని మారుమూల గ్రామాల నుంచి జనం పెద్ద ఎత్తున సభకు రావడం విశేషం. కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబు నిర్లక్ష్యం వల్ల ఇంకా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయితే కుప్పం నియోజకవర్గాన్ని ఏ రకంగా అభివృద్ధి చేయనున్నారనే విషయూలను షర్మిల వివరించినప్పుడు జనం విశేషంగా స్పందించారు.
ఐదుసార్లు గెలిపించిన కుప్పం ప్రజలకు చంద్రబాబు ఏమైనా చేశారా ? కుప్పం సమస్యల గురించి అసెంబ్లీలో ఏనాడైనా ప్రశ్నించారా ? అని షర్మిల ప్రశ్నించినప్పుడు ... లేదూ...లేదు.. అంటూ సభికులు స్పందించారు. స్వార్థ ప్రయోజనాల కోసం చంద్రబాబు విజయూ డెరుురీని మూయించారని, తొమ్మిదేళ్లు అధికారంలో, మిగతా కాలం ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ఏనాడూ కుప్పం ప్రజల బాగోగులను పట్టించుకోలేదని దుయ్యబట్టారు. కుప్పం సభలో చిత్లూరు మాజీ ఎమ్మెల్యే సీకే బాబు, మాజీ ఎంపీ మహాసముద్రం జ్ఞానేంద్రరెడ్డి పాల్గొన్నారు.