చంద్రబాబూ ధైర్యముందా?: వైఎస్ విజయమ్మ
నీ చీకటి పాలన మళ్లీ తెస్తానన్న హామీతో ఎన్నికలను ఎదుర్కోగలవా?: వైఎస్ విజయమ్మ
‘‘ఐదేళ్ల వైఎస్ రాజశేఖరరెడ్డి సువర్ణయుగాన్ని చూశాం.. తొమ్మిదేళ్ల చంద్రబాబు చీకటి పాలనా చూశాం.. కిరణ్ ప్రభుత్వం చంద్రబాబు-2 పరిపాలనను తలపించింది. మున్సిపల్, పంచాయతీరాజ్, లోక్‌సభ, శాసనసభ ఎన్నికలు వరుసగా వస్తున్నాయి. ఆల్‌ఫ్రీ అంటూ బాబు.. సమైక్య చాంపియన్ నంటూ కిరణ్‌లు మరోసారి మోసం చేయడానికి వస్తున్నారు. ఆ ఇద్దరికీ గుణపాఠం చెప్పండి’’ -విజయమ్మ
అనంతపురం: ‘‘వైఎస్ రాజశేఖరరెడ్డి ఐదేళ్ల పాలనను తిరిగి తెస్తామనే వాగ్దానంతో మేం ఎన్నికలకు వెళుతున్నాం.. మరి తొమ్మిదేళ్ల నీ చీకటి పాలన ను తిరిగి తెస్తానన్న హామీతో ఎన్నికలను ఎదుర్కొనే ధైర్యం ఉందా?’’ అంటూ టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం అనంతపురం జిల్లా కదిరి, పుట్టపర్తి, హిందూపురం మున్సిపాలిటీల్లో ఆమె రోడ్ షోలు నిర్వహించి.. బహిరంగ సభల్లో ప్రసంగిం చారు. వైఎస్ విజయమ్మ ప్రసంగం ఆమె మాటల్లోనే..
మేం చెప్పినట్లు చేసుంటే విభజన ఆగిపోయేది..
సీడబ్ల్యూసీ, యూపీఏ పక్షాలు తెలంగాణ తీర్మానం చేసిన తక్షణమే ప్రజాప్రతినిధులు మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని, విభజనను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కానీ కాంగ్రెస్, టీడీపీలు పట్టించుకోలేదు. తెలంగాణ బిల్లు అసెంబ్లీకి చేరకముందే శాసనసభను సమావేశపరచి, సమైక్య తీర్మానం చేసి రాష్ట్రపతికి పంపాలని నాటి సీఎం కిరణ్‌కుమార్ రెడ్డిని వైఎస్సార్ సీపీ డిమాండ్ చేసింది. కానీ రాష్ట్ర విభజనను ఆపుతానంటూ చివరి క్షణం వరకూ సీఎం పదవిని అనుభవించిన కిరణ్.. అంతా అయిపోయాక ఆ పదవికి రాజీనామా చేసి, తానే సమైక్య చాంపియన్‌ను అంటూ మోసం చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నారు.. కిరణ్‌కు బుద్ధి చెప్పండి.
వైఎస్ సువర్ణయుగాన్ని జగన్ తెస్తారు..
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంగా చేస్తే వైఎస్ సువర్ణయుగాన్ని మళ్లీ తెస్తారు. సీఎంగా పదవి చేపట్టిన తొలిరోజునే ‘అమ్మఒడి’ పథకం ఫైలుపై సంతకం చేస్తారు.. ఈ పథకం కింద.. కుటుంబంలో ఇద్దరు పిల్లలు బడికి వెళితే ప్రతినెలా రూ.వెయ్యి అమ్మ ఖాతాలో జమ అవుతుంది. రూ.200గా ఉన్న వృద్ధాప్య పెన్షన్‌ను రూ.700కు పెంచుతారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.3వేల కోట్లతో స్థిరీకరణ నిధిని ఏర్పాటుచేసే ఫైలుపై సంతకం చేసా ్తరు. డ్వాక్రా రుణాలను మాఫీ చేసే ఫైలుపై నాలుగో సంతకం చేస్తారు.’’
చంద్రబాబువన్నీ బూటకపు వాగ్దానాలే..
‘‘తొమ్మిదేళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబూ.. మీరు ఏనాడైనా పంట రుణాలు మాఫీ చేయాలని కేంద్రానికి లేఖ రాసే ఆలోచన చేశారా? కనీసం పంట రుణాలపై వడ్డీనైనా మాఫీ చేసే ఆలోచన చేశారా? వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇద్దామనే సాహసం చేశారా? 2004 ఎన్నికల్లో వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తామని వైఎస్ హామీ ఇస్తే.. అలా చేస్తే కరెంటు తీగలపై బట్టలు ఆరేసుకోవాల్సిందేనని బాబు ఎగతాళి చేయలేదా? పోనీ.. ఏ ఒక్క వాగ్దానాన్నైనా అమలు చేశారా? ఇప్పుడు ఆల్‌ఫ్రీ అంటూ మోసం చేయడానికి ఊరూవాడా తిరుగుతున్నారు. బూటకపు వాగ్దానాలతో వస్తోన్న బాబుకు గుణపాఠం చెప్పండి. తన తొమ్మిదేళ్ల పాలనలో బిల్లీరావు, రామోజీరావు, మురళీమోహన్, సీఎంరమేశ్, నామా నాగేశ్వరరావు, సుజనా చౌదరిలకు మాత్రమే లబ్ధి చేకూర్చారు.