కిరణ్, బాబు సమర్ధులైతే విభజన బిల్లు రాష్ట్రానికొచ్చేదా?
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడులపై వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ మండిపడ్డారు. కిరణ్, బాబు సమర్ధులైతే విభజన బిల్లు అసలు రాష్ట్రానికే వచ్చి ఉండేది కాదని తెలిపారు. వాళ్ల అసమర్ధత కారణంగానే బిల్లు అసెంబ్లీకి వచ్చిందన్నారు. పది కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అంశంపై కిరణ్, చంద్రబాబులు నాటకాలాడుతున్నారని విజయమ్మ విమర్శించారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు పోరాడుతున్న ఒకే ఒక్క పార్టీ వైఎస్సార్ సీపీనేనని ఆమె తెలిపారు. తాము ఇలా పోరాడుతన్నా వైఎస్సార్ సీపీపై విమర్శలకు దిగుతున్నారన్నారు. విభజన బిల్లును తప్పుబడుతున్న కిరణ్, బాబులకు ఆ విషయం ఇప్పుడు గుర్తొచ్చిన్నట్లుందన్నారు. అసలు బిల్లుపై చర్చ జరగడం దురదృష్టకరమని విజయమ్మ తెలిపారు.
సమైక్య కోసం ఎవరు లీడ్ చేసినా..వారి వెంట వైఎస్సార్ సీపీ నడుస్తుందన్నారు. సమైక్య రాష్ట్రం కోసం ఎవరితోనైనా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని విజయమ్మ తెలిపారు. రాష్ట్ర ప్రజలంటే కిరణ్, చంద్రబాబులకు తమాషాగా ఉందన్నారు. వైఎస్సార్ సీపీని విమర్శించేవారికే జవాబు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. కాంగ్రెస్,టీడీపీలకు ప్రజల్లోకి వెళ్లే ధైర్యం లేదని విజయమ్మ ఎద్దేవా చేశారు.