అధిష్టానానికి వంతపాడటంలో పోటీ!
వరద బాధితులను పరామర్శించేందుకు నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్లిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మను అరెస్టు చేశారు. వైఎస్ఆర్ సిపి సమైక్యవాదానికి కట్టుబడి ఉంది. సమైక్యరాష్ట్రం కోసం పోరాడుతోంది. శాసనసభలో ఆ పార్టీ నాయకురాలు బాధితులను ఓదార్చడానికి వెళ్లినప్పటికీ రాజకీయం చేశారు. ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటాయని ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేశారు. సమైక్యవాది తెలంగాణలో పర్యటిస్తే ఉద్రిక్త పరిస్థితి ఏర్పడుతుందని పోలీసులు ఇలా వ్యవహరించారు. ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ సీమాంధ్రలో వరద ముంపు ప్రాంతాలలో పర్యటించడానికి వస్తే వారిని ఈ పోలీసులు అడ్డుకుంటారా? అరెస్ట్ చేస్తారా? ఎందుకంటే రాష్ట్రాన్ని విభజించడానికి సిద్దపడిందే వారు. ఒక పక్క సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఈ పరిస్థితులలో వారు అక్కడకు వెళితే అక్కడి ప్రజలు తప్పక నిరసన తెలియజేస్తారు. విజయమ్మ తెలంగాణలో పర్యటిస్తే ఉద్రిక్తత ఏర్పడుతుందనుకుంటే, సోనియా సీమాంధ్రలో పర్యటించినా ఉద్రిక్తత ఏర్పడాలి కదా? విజయమ్మ పట్ల ప్రవర్తించిన విధంగానే సోనియా వచ్చినప్పుడు కూడా పోలీసులు అలాగే ప్రవర్తిస్తారా?
విజయమ్మ పర్యటనకు వెళ్లినప్పుడు వ్యతిరేకించిన పోలీసులు టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు మాత్రం ఖాకీకార్పెట్ పరిచారు. దానిని సీనియర్ మంత్రి జానారెడ్డి చక్కగా సమర్థించారు. తెలంగాణకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చినందునే అడ్డుకోవడంలేదని ఆయన చెప్పారు. జానారెడ్డి చెప్పిన ప్రకారం ప్రధాని, సోనియాలు సీమాంధ్రలో పర్యటిస్తే అడ్డుకోవాలా? ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోడానికి తహతహలాడే సీనియర్ రాజకీయవేత్త జానారెడ్డి మాటలు ఆ అర్ధం వచ్చేవిధంగానే ఉన్నాయి.
తెలంగాణలో చంద్రబాబును ఈ జానారెడ్డి అనుయాయులు అడ్డుకోలేదంటేనే కాంగ్రెస్, చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు స్పష్టమవుతున్నాయి. ఈ విధంగా అడుగడుగునా వారి కుట్రలు వెలుగు చూస్తూను ఉన్నాయి. వ్యవసాయాన్ని పండగ చేసిన దివంగత ముఖ్యమంత్రి సతీమణిని కష్టంలో ఉన్న రైతు దగ్గరకు వెళ్లకుండా కిరణ్ ప్రభుత్వం అడ్డుకుంది. వ్యవసాయం దండగమారి పని అని చెప్పిన చంద్రబాబును మాత్రం సకల సెక్యూరిటీతో రైతు దగ్గరకు తీసుకెళ్లింది. చంద్రబాబు, కిరణ్‌కుమార్‌రెడ్డి ఇద్దరూ ఒకరికొకరు సంపూర్ణంగా సహకరించుకుంటున్నారు. వారు ప్రజల కోసం కాకుండా తమను తాము కాపాడుకునే ప్రయత్నంలో ఉన్నట్లు తేలిపోయింది. ప్రజలను మోసం చేయడానికి మాత్రమే వారు వేరు జెండాలు మోస్తున్నారు. అధిష్టానానికి వంతపాడటంలో ఇద్దరూ పోటీపడుతున్నారని స్పష్టమైపోయింది. సమైక్యం కోసమే నిలబడ్డానని ఒక పక్క సీఎం ప్రజలను మాయ చేస్తుంటే, విభజన కోసం చంద్రబాబు ఢిల్లీలో దీక్ష చేసి తెలుగు ప్రజలకు ద్రోహం చేశారు.
కాంగ్రెస్ పార్టీ చంద్రబాబును దత్తపుత్రుడిలా చూసుకుంటుంది. ఆయనపై సీబీఐను వాలనివ్వకుండా చూసుకుంది. తెలంగాణలో ఆయన పర్యటనకు భారీ భద్రత కల్పించింది. ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తోంది. చంద్రబాబు ప్రసంగాలు వినడానికి వచ్చే ప్రజలకంటే ప్రభుత్వం ఆయనకు కల్పించిన సెక్యూరిటీయే ఎక్కవుగా కనబడుతున్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి రైతులకు ధైర్యం చెబుతున్న విజయమ్మను చూస్తే కాంగ్రెస్‌కే కాదు, టీడీపీకి కూడా భయమే. వైఎస్ఆర్ ప్రజల గుండెల్లో బతికే ఉన్నారని కాంగ్రెస్, టీడీపీలు తట్టుకోలేకపోతున్నాయి. నల్గొండ జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉండటం, ఇంకా బలపడుతుండటం ఆ పార్టీల నేతలు జీర్ణించుకోలేకపోయారు. నిన్న విజయమ్మ పర్యటను అడ్డుకున్న మంత్రి ఉత్తమ్ కుమార్ భార్య ఇప్పుడు చంద్రబాబు పర్యటనను ఎందుకు అడ్డుకోవడంలేదన్న వైఎస్‌ఆర్ సీపీ నేతల ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేకపోతున్నారు.