దోషిగా నిలబడతారు | YS Vijayamma writes to Prime Minister Manmohan Singh on 'bifurcation' | Sakshi
Sakshi News home page

దోషిగా నిలబడతారు

Published Thu, Aug 15 2013 1:32 AM | Last Updated on Sat, Jun 2 2018 4:41 PM

YS Vijayamma writes to Prime Minister Manmohan Singh on 'bifurcation'

ముందు తరాలు క్షమించవు
* ‘విభజన’పై ప్రధానికి విజయమ్మ లేఖ
అధికారముందని తప్పుడు నిర్ణయం తీసుకుంటే రాష్ట్రం మనిషి చేసిన ఎడారిలా మారుతుంది
రాయలసీమ, ఆంధ్రల్లో ప్రజాప్రతినిధుల రాజీనామాలు, బంద్‌లు, సమ్మె జరుగుతున్నాయి
ఈ పరిస్థితుల్లో నూరు శాతం ఏకాభిప్రాయం తర్వాతే నిర్ణయమని ఎలా చెప్పగలుగుతారు?
షిండేకు రాసిన లేఖ, బహిరంగ లేఖలనూ ప్రధానికి పంపిన వైఎస్సార్ సీపీ గౌరవాధ్యక్షురాలు
 
సాక్షి, హైదరాబాద్: ‘‘అందరికీ ఆమోదయోగ్యంగా, ఎవరికీ అన్యాయం జరగకుండా, ఒక తండ్రిలా నిర్ణయం తీసుకోలేని పక్షంలో కేంద్రంలోని పాలకులు రాజ్యాంగం ద్వారా రాష్ట్రాన్ని విభజించే అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకోవటం ధర్మం కాదు.. రాష్ట్రాన్ని యథాతథంగా కొనసాగించటమే ధర్మం’’ అని పేర్కొంటూ వైఎస్సార్ కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వై.ఎస్.విజయమ్మ బుధవారం ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు లేఖ రాశారు.

కేంద్ర ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకుంటే.. తమకు అధికార బలం ఉంది కదా అని నిర్ణయం తీసుకుంటే.. ఈ రాష్ట్రం మనిషి చేసిన ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. అలాంటి నిర్ణయం తీసుకున్న ప్రభుత్వాన్ని తరతరాలు దోషిగా పరిగణిస్తాయని విజయమ్మ తన లేఖలో స్పష్టంచేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై విజయమ్మ తాజాగా ప్రధానమంత్రికి లేఖ రాశారు. తమ పార్టీ అధ్యక్షుడు, తాను, ఇతర ప్రజా ప్రతినిధులంతా తమ పదవులకు ఎందుకు రాజీనామాలు చేయాల్సివచ్చిందో ఈ లేఖలో ప్రధానికి వివరించారు.

రాష్ట్రంలో ఉన్న మూడు పార్టీలు - వైఎస్సార్ కాంగ్రెస్, ఎంఐఎం, సీపీఐ (ఎం) - ఈ మూడు కూడా ఒకే మాట చెప్తున్నాయని.. న్యాయం చేయలేకపోతే రాష్ట్రాన్ని విడగొట్టవద్దు, యథాతథంగా కలిపే ఉంచండి.. అంటున్నాయని వివరించారు. రాష్ట్రాన్ని విభజించాలన్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఒకవైపు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు చేస్తున్నపుడు, ఆ రెండు ప్రాంతాల ప్రజలు, ఉద్యోగులు బంద్‌లు సమ్మెలు చేస్తున్నపుడు.. రాజకీయ పార్టీలన్నింటి మధ్య వంద శాతం ఏకాభిప్రాయం సాధించిన తరువాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కాంగ్రెస్ పార్టీ ఎలా చెప్పగలుగుతోందని ఆమె ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని విడగొట్టటానికి ఒప్పుకున్నది తెలుగుదేశం పార్టీ, టీఆర్‌ఎస్, కాంగ్రెస్, సీపీఐ, బీజేపీ - ఈ ఐదు పార్టీలు మాత్రమేనని, ఓట్ల కోసం సీట్ల కోసం అధికార పార్టీ అన్యాయం చేస్తూంటే.. ఓట్లు పోతాయని, సీట్లు పోతాయని, తమకు రావాల్సిన క్రెడిట్ రాకుండా పోతుందని ప్రతిపక్షంలో ఉన్న కొన్ని పార్టీలు విభజన ద్వారా జరిగే అన్యాయాన్ని గురించి స్పందించకుండా ఉంటే.. ఇక ఈ రాష్ట్రం తరఫున ఇక్కడి వారి గోడు ఎవరికి చెప్పుకోవాలని విజయమ్మ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎలా ఉంది అంటే... నెత్తిన తుపాకి పెట్టి ఒప్పుకుంటారా? చస్తారా? అని అడిగినట్లుగా ఉంది... ఒకవేళ అంగీకరించకపోయినా, మా ఇష్ట ప్రకారం మేం చెయ్యాలనుకున్నది చేస్తాం... అన్నట్లు ఉంది’’ అని ఆమె ఆగ్రహం వ్యక్తంచేశారు.

‘‘ఇక్కడి రాజకీయ పార్టీల మధ్య దాదాపుగా నూరు శాతం ఏకాభిప్రాయం వచ్చింది అని కాంగ్రెస్ వారు చెప్పటం తప్పుదారి పట్టించటం కాదా? కేంద్రంలో ఉన్న వాళ్లు ఇలా ఎందుకు చెప్తున్నారో? ఇన్ని కోట్ల మంది మా రాష్ట్రాన్ని విడగొట్టొద్దు అని ప్రాధేయపడుతున్నా.. వీరందరి జీవితాలతో చెలగాటం ఆడటం న్యాయమేనా?’’ అని ప్రశ్నించారు. తమ రాజీనామా సందర్భంలో తాము విడుదల చేసిన లేఖను కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నామని, దాన్ని చదవి ఇక్కడి సమస్యలను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.

రాష్ట్రానికి సంబంధించి ఏకపక్షంగా నిర్ణయం చేయకుండా ఇరు ప్రాంతాలకు సమన్యాయం జరిగేలా నిర్ణయం ఉండాలని కోరుతూ గత నెల 16న కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌షిండేకు పార్టీ తరఫున రాసిన లేఖను, అలాగే సీడబ్ల్యూసీ సమావేశానికి ఒక రోజు ముందు  జూలై 29న.. అడ్డగోలు విభజన వల్ల ఉత్పన్నమయ్యే పరిస్థితులను వివరిస్తూ బహిరంగ లేఖ ద్వారా వైఎస్సార్ సీపీ తెలియజేసిన వివరాలను విజయమ్మ తన లేఖతో పాటు పొందుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement