
సీఎం కిరణ్ కు వైఎస్ విజయమ్మ లేఖ
హైదరాబాద్: సీఎం కిరణ్ కుమార్ రెడ్డికి వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ లేఖ రాశారు. సత్వరమే అసెంబ్లీని సమావేశపరచాలంటూ ఆమె లేఖలో డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలంటూ తీర్మానాన్ని ఆమోదింపజేయాలని విజయమ్మ సీఎంకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణ నోట్ సిద్ధం కాకముందే అసెంబ్లీని సమావేశపరచాలని ఆమె కోరారు. యూపీఏ సమన్వయ కమిటీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై నిర్ణయం తీసుకున్న అనంతరం సీమాంధ్రలోని ఉద్యమం ఎగసి పడుతున్న తెలిసిందే. ఈ తరుణంలో వైఎస్ విజయమ్మ సీఎం కిరణ్ కు లేఖ రాశారు. రాష్ట్రంలోని ప్రజలకు ఎదురయ్యే ఇబ్బందులను లేఖలో వివరించారు.
అంతకుముందు సమైక్య రాష్ట్రం ఉద్యమంలో భాగంగా గురువారం వైఎస్సార్ సీపీ సీపీఎంతో చర్చలు జరిపింది. సమైక్యరాష్ట్ర ఉద్యమం కోసం సీపీఎంతో ప్రాథమిక చర్చలు జరిపామని సమావేశం ముగిసిన అనంతరం వైఎస్సార్ సీపీ నేత ఎం.వి మైసూరారెడ్డి తెలిపారు. కలిసి ఉద్యమం చేద్దామనే కోణంలో చర్చ సాగిందని ఆయన అన్నారు. రాష్ట్ర ఐక్యతకోసం సీపీఎంతో చర్చలు జరిపిన అనంతరం మైసూరా రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీలో చర్చించి నిర్ణయం త్వరలో చెప్తామన్నారని మైసూరా అన్నారు. ఉద్యమంపై రెండు పార్టీల మధ్య భావసారూప్యత ఉన్నా, కలిసి ఉద్యమం చే్ద్దామనే కోణంలో చర్చించామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.