
తీర్మానం లేకుండా చర్చంటే ఉరితాడు బిగించుకున్నట్టే?
సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజనను మొత్తంగా తిరస్కరించకుండా పునర్విభజన బిల్లు మీద శాసనసభలో చర్చించడమంటే అర్థమేమిటి? విభజనకు అంగీకరించడం కాదా? శాసనసభలో సమైక్య తీర్మానం జరగకుండా విభజన బిల్లుపై చర్చించడమంటే మన మెడకు మనమే ఉరి బిగించుకున్నట్లవుతుంది. రాష్ట్రాన్ని విభజించడానికి ఉద్దేశించిన బిల్లుపై చర్చ జరగడానికి ససేమిరా వీల్లేదని అడ్డుకోవడం సమైక్యవాదానికి ద్రోహం చేయడమవుతుందా? ఈ ముఖ్యమంత్రికి ఏమైనా మతి చలించిందా! లేక తన మెదడును ఈయన సోనియాగాంధీకి తాకట్టు పెట్టారా?’’ అంటూ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డిపై వైఎస్సార్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీలు బిల్లుపై చర్చలో పాల్గొనాలంటూ సీఎం కిరణ్ బుధవారం చెప్పటంపై అంబటి ఒక ప్రకటనలో స్పందించారు. ‘‘బిల్లు మీద ఓటింగ్‌కు అవకాశం లేదంటూనే అసెంబ్లీలో చర్చ జరపాలంటారు. అంశాల వారీగా చర్చ జరపాలంటారు.
అలా చేస్తే విభజన ఆగుతుందని వీరు హామీ ఇవ్వగలరా?’’ అని ప్రశ్నిం చారు. విభజన బిల్లు మీద చర్చ చేయకపోతే సమైక్యానికి కట్టుబడినట్లు కాదనే సిద్ధాంతాన్ని కూడా ప్రచారం చేస్తున్నారంటూ అభ్యంతరం తెలిపారు. ‘‘కిరణ్‌కు సోనియా సిద్ధాంతం నచ్చక పోతే.. సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని ఆయన వ్యతిరేకిస్తూంటే.. పోరాడాల్సింది సోనియా మీదా? లేక సమైక్యవాద వైఎస్సార్ కాంగ్రెస్ మీదా? తెలుగుదేశం పార్టీ వారు చొక్కా పట్టుకోవాల్సింది విభజన లేఖ ఇచ్చిన చంద్రబాబుని కాదా?’’ అని ప్రశ్నించారు.
బిల్లు మీద చర్చ జరిగితే ఎలాగూ ఈ శాసనసభ ఆ బిల్లుపై వ్యక్తం చేసే అబిప్రాయాన్ని కేంద్రం తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలన్న నిబంధన రాజ్యాంగంలో లేదు కాబట్టే.. 23వ తేదీ లోగా చర్చను పూర్తిచేసి వెంటనే బిల్లును కేంద్ర ప్రభుత్వం చేతుల్లో పెట్టాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. సమైక్య తీర్మానం చేస్తే తప్పనిసరిగా పార్లమెంటు కూడా ఆ తీర్మానాన్ని పరిగణనలోకి తీసుకోక తప్పదని, సమైక్య తీర్మానం చేస్తే ఈ శాసనసభ విభజన వద్దు అన్నదని, విభజనకు వ్యతిరేకంగా తీర్మానం చేసిందని రేపు సుప్రీంకోర్టులో పోరాడటానికి అవకాశం ఉంటుందని ఆయన పేర్కొన్నారు.