వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం అప్పు తీసుకురావడం కూడా గొప్పే అన్నట్లు వ్యవహరిస్తున్నారని వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు విమర్శించారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో అంబటి విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం దుబారా కార్యక్రమాలు చేస్తోందని మండిపడ్డారు. పంటి వైద్యం కోసం లక్షలు ఖర్చు చేస్తున్నారని, మరమ్మతుల పేరుతో కోట్ల రూపాయలు అనవసరంగా ఖర్చు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజాస్వామ్య విలువలు కాపాడే పరిస్థితి ప్రస్తుతం ఏపీలో లేదని వ్యాఖ్యానించారు.
శాసనసభ స్పీకర్ కోడెల శివప్రసాదరావు, చంద్రబాబు నాయుడి ఫోటోకు పాలాభిషేకం చేయడం ఏంటి అని ప్రశ్నించారు. స్పీకర్ స్థానంలో ఉండే వ్యక్తి అందరికీ ఆమోదయోగ్యంగా, తటస్థంగా వ్యవహరించాలని సూచించారు. స్పీకర్ కోడెల తీరు బాధాకరమన్నారు. స్పీకర్ వ్యవస్థని భ్రష్టు పట్టేలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. స్పీకర్ పదవిని వదిలి బాబుకు పాలాభిషేకం చేసుకోండని సూచించారు. ప్రజాస్వామ్య విలువలను మంట కలుపుతున్న కోడెల శివప్రసాదరావు వెంటనే స్పీకర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment