ప్రభుత్వం వెనుకడుగు వేస్తే...
హైదరాబాద్: ఏపీలో వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి అన్నారు. వైఎస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏపీ రైతు విభాగం రాష్ట్రస్థాయి సమావేశం ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు రుణమాఫీ చేయకుండా హామీలు గుప్పిస్తున్నారని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి ఇన్ని రోజులు గడిచినా ఒక్క రూపాయి కూడా రుణమాఫీ చేయలేదని ఆరోపించారు.
జిల్లాల్లో సాగుబడి గణనీయంగా పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రభుత్వం బేషరతుగా పంట రుణాలు మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. స్వామినాథన్ కమిటీ సిఫార్సులు అమలు చేయాలన్నారు. రుణమాఫీ విషయంలో ప్రభుత్వం వెనుకడుగు వేస్తే రైతాంగానికి తమ పార్టీ అండగా ఉంటుందని నాడిరెడ్డి భరోసాయిచ్చారు.