కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ సీపీ నేత దారుణ హత్య
కర్నూలు: కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ప్రభాకర్ నాయుడు గురువారం టీడీపీ నాయకుల చేతిలో దారుణ హత్యకు గురైయ్యారు. ఈ రోజు జిల్లాలోని తలుకూరు మైనింగ్ గనుల వద్ద ప్రభాకర్ నాయుడు అనుచరుడు భాస్కర్తో కలసి వెళ్తుండగా టీడీపీ నాయకులు ముకుమ్మడిగా మారణాయుధాలతో దాడి చేశారు. అనంతరం టీడీపీ నాయకులు అక్కడి నుంచి పరారైయ్యారు. ఈ దాడిలో ప్రభాకర్ నాయుడు అక్కడికక్కడే మరణించారు. భాస్కర్ పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు వెంటనే స్పందించి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని భాస్కర్ను ఆస్పత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. తమపై టీడీపీ నేతలే దాడి చేశారని భాస్కర్ ఆరోపించారు. ప్రభాకర్ నాయుడు మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.