సుధీర్ రెడ్డిపై ఈసీకి వైఎస్సార్ సీపీ ఫిర్యాదు
హైదరాబాద్: ఎల్బీ నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారని ఎన్నికల సంఘానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. ఎన్నికల కోడ్కు విరుద్దంగా ఓ మహిళకు రూ. 32,500 మంజూరు చేశారని తెలిపింది. ఆయనపై చర్య తీసుకోవాలని కోరింది. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఆయనను అనర్హుడిగా ప్రకటించాలని విజ్ఞప్తి చేసింది.
సుధీర్ రెడ్డి, ఆయన భార్య కమలపై ఈనెల 15న కూడా వైఎస్సార్ సీపీ ఫిర్యాదు చేసింది. సేవా కార్యక్రమాల పేరుతో ఆమె ఓటర్లకు గాలం వేస్తున్నారని ఆరోపించింది. గుజరాతీలు ఎక్కువగా నివసించే డైమండ్ కాలనీలో రూ. 50 లక్షలతో అభివృద్ధి పనులు చేపడతామని సుధీర్ రెడ్డి హామీయిచ్చారని తెలిపింది. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన వీరిపై చర్య తీసుకోవాలని ఎన్నికల సంఘాన్ని వైఎస్సార్ సీపీ కోరింది.