
నరేంద్ర హత్యకేసు దర్యాప్తు ముమ్మరం
నెల్లూరు(క్రైమ్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది అల్లం నరేంద్రయాదవ్ హత్య కేసు దర్యాప్తును పోలీసులు ముమ్మరం చేశారు. సివిల్ వివాదాల నేపథ్యంలోనే హత్య జరిగిందా..లేక మరేమైనా కారణాలు ఉన్నాయా..అనే కోణంలో విచారణ సాగిస్తున్నారు. ప్రత్యేక బృందాలతో నిందితుల కోసం గాలిస్తున్నారు. నరేంద్రను మంగళవారం రాత్రి సంతపేట కృష్ణమందిరం సమీపంలో గుర్తుతెలియని దుండగులు హతమార్చిన విషయం తెలిసిందే. మృతుడి ఒంటిపై సుమారు 33 కత్తిపోట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కత్తులతో దాడి చేయడంతో కిడ్నీ, గుండెకు తీవ్రగాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్లు నిర్ధారించారు. మరోవైపు హత్యకు దారితీసిన పరిస్థితులను వెలుగులోకి తెచ్చేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. హత్య జరిగిన సమయంలో నరేంద్రతో ఉన్న కోడూరు శ్రీను అలియాస్ చాపల శ్రీను పరారీలో ఉండటంతో అతని కోసం గాలింపు చేపట్టారు.
నరేంద్రకు సంతపేటలో సుమారు రూ.15 కోట్ల విలువైన స్థలం ఉంది. వివాదంలో ఉన్న ఆ స్థలాన్ని తన రాజకీయ ప్రత్యర్థి అయిన బీజేపీ నేత కప్పిర శ్రీనువాసులుకు విక్రయించే ప్రయత్నాల్లో నరేంద్ర ఉన్నట్లు సమాచారం. ఈక్రమంలోనే హత్యకు గురయ్యారనే ప్రచారం జరుగుతోంది. కప్పిర శ్రీనివాసులకు చాపల శ్రీను అనుచరుడనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో కప్పిర శ్రీనివాసులే ఈ దురాఘతానికి ఒడిగట్టాడా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. నరేంద్ర హత్య జరిగిన సమ యం నుంచే ఆయన కనిపించడం లేద ని తెలిసింది. దీంతో వాస్తవాలను నిగ్గుతేల్చే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఆరోపణలెదుర్కొంటున్న శ్రీ నివాసులతో పాటు చాపల శ్రీను ఫోను నంబర్ల ఆధారంగా దర్యాప్తు కొనసాగి స్తున్నారు. స్థల వివాదమే అయితేఅం త కిరాతకంగా హత్యచేసి ఉండరనే అభిప్రాయాన్ని కొందరు వ్యక్తంచేస్తున్నారు.
ఆస్పత్రికి చేరుకున్న పార్టీ శ్రేణులు
అల్లం నరేంద్ర మృతదేహానికి డీఎస్‌ఆర్ ప్రభుత్వ ఆస్పత్రిలో బుధవారం పోస్టుమార్టం నిర్వహించారు. ఈ క్రమంలో నెల్లూరు రూరల్, సిటీ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, పి.అనిల్‌కుమార్‌యాదవ్, డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాథ్, కార్పొరేషన్‌లో పార్టీ ఫ్లోర్ లీడర్ రూప్‌కుమార్‌యాదవ్ తో పాటు పార్టీ నేతలు, కార్యకర్తలు, మృతుడి బంధుమిత్రులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. పోస్టుమార్టం పూర్తయ్యేంతవరకు ఎమ్మెల్యే అనిల్ హాస్పిటల్ వద్దే ఉన్నారు. అనంతరం మృతదేహాన్ని మృతుడి నివాసానికి తరలించారు. నరేంద్ర కుటుంబసభ్యులను ఎమ్మెల్యేలు పరామర్శించారు.