నెల్లూరు(సెంట్రల్): ‘ప్రజల సమస్యల పరిష్కారం కోసం, గ్రామస్తుల కోరిక మేరకు ఒక ఎమ్మెల్యే పాదయాత్రగా ప్రజల మధ్యకు వెళ్లాలనుకుంటే పోలీసులు అడ్డుకోవడం ఏమిటి. ప్రజాస్వామ్యంలో ఉన్నామా? అనే అనుమానాలు కలుగుతున్నాయని’ కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. నెల్లూరులోని మాగుంటలే అవుట్‌లో ఉన్న జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మత్స్యకారులతో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. అధికార పార్టీ నేతలు, పోలీసులు కలిసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారన్నారు. నెల రోజులుగా కావలి నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం ఏ విధంగా ఉందో ప్రజలు చూస్తున్నారన్నారు. తీర ప్రాంత ప్రజల ఇబ్బందులు, కష్టాలు తెలుకోవాలని, అక్కడ ఏమి అభివృద్ధి చేయాలో తెలుసుకునేందుకు తాను తీర ప్రాంత సేవా సంకల్ప పాదయాత్ర చేస్తున్నానన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని తీర ప్రాంత గ్రామాల్లో 50 కిలో మీటర్ల మేర పాదయాత్ర నిర్వహించామన్నారు. కానీ ఇప్పటి వరకు ఎక్కడా ఎటువంటి గొడవలు, శాంతిభద్రతలు తలెత్తలేదన్నారు.
చట్టసభకు ప్రతినిధిని.. గ్రామంలోకి వెళ్లనివ్వరా
కావలి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపించి.. చట్ట సభకు ప్రతినిధిని చేసిన ప్రజల బాగోగులు తెలుసుకోవడం నా ధర్మం. ప్రజాప్రతినిధిగా గ్రామస్తుల ఆహ్వానం మేరకు.. గ్రామంలోకి వెళ్తుంటే.. పోలీసులు నిలువరించడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్‌సీపీకి, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి మత్స్యకారుల్లో వస్తున్న ఆదరణ చూసి టీడీపీ నాయకులు ఓర్వలేక ఉన్నారని తెలిపారు. టీడీపీ నేతలు బీద సోదరులు స్వగ్రామం ఇస్కపల్లి పంచాయతీ పరిధిలో మత్స్యకారుల భూములు ఆక్రమించి వారిని మత్స్యకారులను దోచుకుంటున్నారు. తానే ఆ గ్రామాలకు వెళ్తే వీరి బండారం బయటపడుతుందనే ఉద్దేశంతోనే తనను మూడు మత్స్యకార గ్రామాల్లోకి వెళ్లనివ్వకుండా అధికార బలాన్ని ఉపయోగించి అడ్డుకుంటున్నారని చెప్పారు. గతంలో కొంది మంది అల్లరి మూకలతో బీద సోదరులు అల్లరి చేయించి, దీన్ని గ్రామ ప్రజలందరి వివాదంగా చెబుతుండడం సిగ్గు చేటన్నారు. ఆ గ్రామంలో గత ఎన్నికల్లో తమకు ఎన్ని ఓట్లు వచ్చాయో కూడా పోలీసులకు తెలిపామన్నారు. గతంలో పలుమార్లు ఆ గ్రామాలకు కూడా వెళ్లడం జరిగిందన్నారు. అప్పుడు ఎటువంటి గొడవలు జరగనవి ఇప్పుడు ఎందుకు జరుగుతాయని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీ ఒత్తిడితోనే తమను పోలీసులు అడ్డుకుంటున్నారని ఆరోపించారు.
శాంతిభద్రతలకు విఘాతమనడం హాస్యాస్పదం
శాంతిభద్రతలకు విఘాతం కలిగితే అడ్డుకోవాల్సిన పోలీసులే.. ప్రజాప్రతినిధిగా గ్రామ ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు వెళ్తానంటే శాంతిభద్రతలకు విఘాతం అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. పోలీసులు రక్షణ కల్పించలేమని చెప్పడం ఏమిటో అర్థం కావడం లేదన్నారు. అధికార టీడీపీ పెద్దల నుంచి వచ్చిన ఒత్తిడితోనే పోలీసులు ఈ విధంగా చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. గ్రామస్తులు సైతం ఎటువంటి విఘాతం కల్పించరని చెబుతున్నా పోలీసులు వినకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
చేతులెత్తేసిన పోలీసులు
శాంతి భద్రతలకు విఘాతం కలిగితే తాము భద్రత కల్పించలేమని నగర డీఎస్పీతో పాటు నగరంలోని పలు స్టేషన్ల సీఐలు ఎమ్మెల్యేకు చెప్పడం గమనార్హం. పోలీసులే ఈ విధంగా చెప్పడం ఏమిటని ఎమ్మెల్యే ప్రశ్నించారు. పోలీసులు మాత్రం తామే ఏమి చేయలేమని చెబుతూ ఎమ్మెల్యేను, ఆయనతో పాటు మత్స్యకారులను బలవంతంగా జీపులో ఎక్కించి స్టేషన్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment