వైఎస్సార్‌సీపీ నేత నరేంద్ర దారుణహత్య
నెల్లూరు (క్రైం): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, న్యాయవాది అల్లం నరేంద్ర(37) మంగళవారం రాత్రి దారుణహత్యకు గురయ్యారు. సంతపేటకు చెందిన ఆయన ప్రస్తుతం ఫత్తేఖాన్‌పేటలో నివాసం ఉంటున్నారు. ప్రాక్టీస్ కోసం సంతపేటలోని కృష్ణమందిరంలో ఓ గదిని అద్దెకు తీసుకుని ఉన్నాడు. మంగళవారం రాత్రి చాపల శ్రీనుతో కలిసి గదివద్దకు వచ్చాడు. ఆ ప్రాంతంలో బండి మీద సుండలు తిని రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వ్యక్తులు ముగ్గురు వచ్చి మారణాయుధాలతో దాడి చేశారు. వెనుకవైపు నుంచి విచక్షణారహితంగా కత్తులతో 26 పోట్లు పొడిచారు. గట్టిగా కేకలు వేసిన నరేంద్ర అక్కడే కుప్పకూలిపోయాడు. అరుపులు విని సమీపంలోనే నివాసం ఉంటున్న తల్లి, సోదరి, ఇరుగురుపొరుగు వారు అక్కడకి చేరుకున్నారు.
గమనించిన దుండగులు ఘటనా స్థలం నుంచి పరారయ్యారు. ఎక్కువ చోట్ల కత్తితో పొడవటంతో నరేంద్ర శరీరంలోని కొన్నిభాగాలు బయటకు వచ్చాయి. స్థానికులు వెంటనే ఆయనను ఓ ఆస్పత్రికి తర లించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. నరేంద్రకు నాలుగేళ్ల క్రితమే అనుపమతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణి. సమాచారం అందుకున్న నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ హుటాహుటిన ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. ఘటనపై ఆరా తీశారు. హంతకులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. నెల్లూరు సిటీ డీఎస్పీ మక్బుల్, సీఐలు మాణిక్యరావు, సుబ్బారావు, ఎస్‌ఐలు ఘటనా స్థలానికి చేరుకుని స్థానికులను విచారించారు. నరేంద్ర కొద్ది గంటల క్రితమే ఎమ్మెల్యే అనిల్‌తో కలిసి రంగనాథస్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన కార్యకర్తగా వ్యవహరిస్తున్నారు. నరేంద్ర హత్య నగరంలో కలకలం సృష్టించింది.