
అన్ని నదులపైనా తీవ్ర ప్రభావం
సాక్షి, న్యూఢిల్లీ: ‘‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ కృష్ణా జలాల పంపకంలో 75 శాతం డిపెండబిలిటీని 65 శాతానికి తగ్గించిన ప్రభావం రాబోయే రోజుల్లో ఒక్క కృష్ణా నది విషయంలోనే కాదు అన్ని నదుల జలాల పంపిణీపైనా తీవ్రంగా ఉంటుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌కు స్పష్టం చేసింది. శుక్రవారం అఖిలపక్షంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రైతు విభాగం కన్వీనర్ ఎం.వి.ఎస్.నాగిరెడ్డి ప్రధానిని కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మారెడ్డి మాట్లాడుతూ.. అంతర్జాతీయంగా ఎక్కడైనా సరే 75 శాతం డిపెండబిలిటీనే పరిగణనలోకి తీసుకుంటున్నారు తప్ప 65 శాతం ఎక్కడా లేదని తెలిపారు. 75 శాతం డిపెండబిలిటీకే కట్టుబడి ఉండాల్సిన అవసరం ఉందని చెప్పారు. భేటీ తర్వాత నాగిరెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘‘బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ దిగువ రాష్ట్రాలకు ఉన్న హక్కులను ఖాతరు చేయలేదు. ఆయన మిగులు జలాలను పంచారు.. కానీ తరుగు సంవత్సరాల్లో నీటిని ఎలా పంచుకోవాలి? పై రాష్ట్రాల్లో వర్షాలు సరిగా పడకుంటే, నదిలో నీళ్లు సరిగా లేకపోతే మిగతా రాష్ట్రాలు ఏ విధంగా నీటిని పంచుకుంటాయనేది వివరించలేదు. ఇది దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌ను శాశ్వతంగా దెబ్బతీస్తుంది’’ అని ప్రధాని దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. నీటి విడుదల ఆలస్యమైతే రెండు పంటలు పండించే ఆంధ్రప్రదేశ్‌లో ఒక పంటకే పరిమితం కావాల్సి వస్తుందని చెప్పామన్నారు. ‘‘బచావత్ అవార్డు ప్రకారం మిగులు జలాల వినియోగం వెసులుబాటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంది. ఆ ఉద్దేశంతోనే ప్రాజెక్టులు కట్టుకుంటే... ఒక్క తెలుగు గంగకు మాత్రమే 25 టీఎంసీలు నీళ్లు ఇచ్చి, మిగులు జలాలపై ఆధారపడిన మరో ఆరు ప్రాజెక్టులకు ఏ కేటాయింపులు చేయలేదు. ఇప్పటికే రాష్ట్రం ఆయా ప్రాజెక్టులపై రూ.30 వేల కోట్లు వెచ్చించింది.
ఆ ఆరు ప్రాజెక్టులను ట్రిబ్యునల్ ఎక్కడా పట్టించుకోలేదు..’’ అని అన్నారు. ఏపీ ప్రభుత్వ ఎస్‌ఎల్‌పీలో కేంద్ర ప్రభుత్వం కూడా భాగస్వామి కావాలని కోరినట్లు ఉమ్మారెడ్డి చెప్పారు. సుప్రీంకోర్టు తుదితీర్పు వచ్చేవరకు, సరైన న్యాయం జరిగేంతవరకు ట్రిబ్యునల్ తీర్పును నోటిఫై చేయవద్దని కోరామన్నారు. ట్రిబ్యునల్ మధ్యంతర తీర్పు వచ్చినప్పటి నుంచే ఈ పోరాటం చేసివుంటే చాలా బాగుండేదని, తుది తీర్పు వచ్చేవరకు అధికారపక్షం పట్టించుకోక పోవడం బాధాకరమని నాగిరెడ్డి ఆవేదన వెలిబుచ్చారు. 2010లో మధ్యంతర తీర్పు వచ్చినప్పుడు రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ‘జలదీక్ష’ చేసిన సంగతిని గుర్తుచేశారు. వైఎస్ ఇచ్చిన లేఖవల్లే మిగులు జలాల్లో అన్యాయం జరిగిందని పలు పార్టీలు చేస్తున్న విమర్శలన్నీ పూర్తిగా తప్పని, ఇదంతా మోసపూరితంగా చేస్తున్న ప్రచారమని స్పష్టం చేశారు. వైఎస్ వచ్చాకే ఆరు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని, ట్రిబ్యునల్ ఏర్పడిన తర్వాతే ఇవన్నీ చేపట్టడం జరిగిందనేది వాస్తవమని చెప్పారు.
అన్ని అంశాలు పరిశీలిస్తామన్నారు
‘బ్రిజేశ్ ట్రిబ్యునల్ గతంలో బచావత్ అవార్డు ఇచ్చిన రక్షణలను ఉల్లంఘించింది. పై రాష్ట్రాలకు అనేక కేటాయింపులు ఇచ్చారు. ఇది సరైంది కాదు. ఈ తీర్పు వల్ల దేశంలోని అన్ని ప్రాజెక్టులకు కొత్త చిక్కులొస్తాయి. అందువల్ల తీర్పు గెజిట్ నోటిఫికేషన్ రాకుండా చూడాలని, ప్రభుత్వం వేసిన ఎస్‌ఎల్‌పీలో కేంద్రం ఇంప్లీడ్ కావాలని ప్రధానిని కోరాం. ఆయన అన్ని అంశాలను అధ్యయనం చేస్తామని హామీ ఇచ్చారు..’
- మంత్రులు సుదర్శన్‌రెడ్డి, జానారెడ్డి
ఆలమట్టి ఎత్తు పెంచే అధికారం లేదని చెప్పాం
‘ట్రిబ్యునల్ తీర్పు రాష్ట్రానికి డెత్ వారెంట్ రాసినట్లుగా ఉందని చెప్పాం. ట్రిబ్యునల్‌కు కేవలం నీటిని పంచే హక్కు మాత్రమే ఉందని, ఆలమట్టి ఎత్తును పెంచే హక్కు ఏ మాత్రం లేదని వివరించాం..’ - రావుల, కోడెల (టీడీపీ)
బ్రిజేశ్‌ను కొనసాగించొద్దన్నాం
‘కృష్ణా జలాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసిన బ్రిజేశ్‌కుమార్‌కే రాష్ట్రాల విభజన అనంతరం నదీ జలాల పంపిణీపై పర్యవేక్షణ బాధ్యతలు కట్టబెడుతూ జీవోఎం సిఫారసులు చేసింది. ఆయన్ను పర్యవేక్షకునిగా కొనసాగించరాదని ప్రధానిని కోరాం..’
- నారాయణ, గుండా మల్లేశ్ (సీపీఐ)
ప్రధాని నిస్సహాయత వ్యక్తం చేశారు
‘ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చాక ఏం చేయలేం కదా? అన్న తరహాలో ప్రధాని తన నిస్సహాయతను వ్యక్తం చేశారు. తెలంగాణ నీటి అవసరాలకు అనుగుణంగా ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలని ప్రధానిని విడిగా కోరాం..’- వినోద్ (టీఆర్‌ఎస్)
మహబూబ్‌నగర్, నల్లగొండలకు న్యాయం చేయమన్నాం
‘ట్రిబ్యునల్ తీర్పులో మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు తీరని అన్యాయం జరిగింది. పార్లమెంట్‌లో దీనిపై చర్చకు వచ్చిన సమయంలో అయినా ఈ రెండు జిల్లాలకు న్యాయం జరిగేలా చూడాలని ప్రధానిని కోరాం..’
- నాగం జనార్ధన్‌రెడ్డి (బీజేపీ)
పర్యవసానాలు అధ్యయనం చేస్తామన్నారు
‘మిగులు జలాలపై ఆధారపడి తెలంగాణ, సీమల్లో ఆరు ప్రాజెక్టులు కడుతున్నారు. ప్రస్తుత తీర్పుతో ఆ ప్రాజెక్టులకు నీరందక రాష్ట్రం ఎడారిగా మారుతుందని చెప్పాం’.
- రాఘవులు, జూలకంటి రంగారెడ్డి, సీపీఎం