
పార్లమెంటుకు ప్రత్యేక హోదా పోరాటం!
- నేడు లోక్‌సభలో ప్రైవేటు బిల్లు
- ప్రవేశపెట్టబోతున్న వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ
న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రజల ఆకాంక్ష అయిన ప్రత్యేక హోదాపై పార్లమెంటులో గళమెత్తేందుకు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై పార్లమెంటు వేదికగా పోరాడేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా శుక్రవారం లోక్‌సభలో ప్రత్యేక హోదాపై ప్రైవేట్ మెంబర్ బిల్లును పార్టీ ప్రవేశపెట్టబోతున్నది. పార్టీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఈ బిల్లును ప్రవేశపెట్టబోతున్నారు. వైఎస్‌ఆర్‌సీపీ తరఫున ఆయన ప్రవేశపెట్టబోతున్న ప్రత్యేక హోదా బిల్లు.. ప్రైవేటు మెంబర్ బిజినెస్‌లో 9వ ఐటెంగా లిస్ట్ అయింది.
ప్రత్యేక హోదా కోసం గత కొన్నేళ్లుగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అలుపులేని పోరాటాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల హోదాకు మద్దతుగా విశాఖ ఆర్కే బీచ్‌లో తలపెట్టిన ఉద్యమానికి కూడా వైఎస్ జగన్ సంపూర్ణ మద్దతు ఇచ్చారు. హోదాకు మద్దతుగా ఆయన కొవ్వొత్తుల ప్రదర్శనలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొవ్వొత్తుల ప్రదర్శనలో పాల్గొనేందుకు వచ్చిన ఆయనను విశాఖ విమానాశ్రయంలోనే నిర్బంధించి.. నిరంకుశంగా ప్రభుత్వం వెనుకకు పంపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హోదా సాధించేవరకు అలుపెరుగని పోరాటాన్ని సాగిస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ఇందులోభాగంగానే పార్లమెంటు వేదికగా హోదా పోరాటాన్ని సాగించేందుకు వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు సిద్ధమవుతున్నారు.