
పేదల పక్షపాతి వైఎస్సార్‌సీపీ
పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో ఎమ్మెల్యే చాంద్‌బాషా
కదిరి : పేద, బడుగు, బలహీన వర్గాలు, మైనార్టీలు, ఇలా అన్ని వర్గాల పేద ప్రజల కోసం పుట్టిందే వైఎస్సార్‌సీపీ అని ఆపార్టీ ఎమ్మెల్యే అత్తార్ చాంద్‌బాషా పేర్కొన్నారు. శనివారం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఆ పార్టీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి, పార్టీ కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు ఎమ్మెల్యే స్వగృహం వద్ద నుంచి క్లాక్ టవర్ మీదుగా స్థానిక మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలోని వైఎస్సార్ విగ్ర హం వద్దకు భారీ ర్యాలీ చేశారు. అక్కడ వైఎస్ విగ్రహానికి పూలమాలలు వేసి, నివాళులర్పించారు. అనంతరం వలీసాబ్‌రోడ్‌లో పార్టీ జెండాను ఎమ్మెల్యే ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీని ఆవిర్భావంలోనే అణచివేయాలని కొన్ని పార్టీలు కుట్రపన్నాయని, అయితే ప్రజల మద్దతుతో దిగ్విజయంగా ఐదేళ్లు పూర్తి చేసుకుందన్నారు. త్వరలోనే పార్టీకి, ప్రజలకు మంచిరోజులొస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తనతో పాటు జిల్లాకు చెందిన మరికొందరు వైఎస్సార్‌సీపీ నాయకులు టీడీపీలో చేరుతారని కొందరు దుష్ర్పచారం చేస్తున్నారని, అలాంటి మాటలు పట్టించుకోవద్దన్నారు. టీడీపీ మునిగిపోయే నావ లాంటిదయితే వైఎస్సార్‌సీపీ ఉదయించే సూర్యుడి లాంటిదని పేర్కొన్నారు.