ఇందిరమ్మ పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న వైఎస్ రాజశేఖర్‌రెడ్డి (ఫైల్)
కపిలేశ్వరపురం (మండపేట): ఎన్నికల ప్రచారం వేడెక్కింది. పార్టీల తమ అభ్యర్థులను గెలిపించే పనిలో వ్యూహప్రతివ్యూహాలు రచిస్తున్నారు. అభ్యర్థులైతే గెలిచేందుకు కలిసి వచ్చే అంశాలపై దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్నారు. ఈ దశలో ఎవరికి ఓటేద్దామా అనే ఆలోచన చేస్తున్న క్రమంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పాలనా తీరును ప్రజలు గుర్తు చేసుకుంటున్నారు. ఆయన హయాంలో పలు సంక్షేమ పథకాలకు ఇందిరమ్మ పథకం అని పేరు పెట్టారు. ఆ రాష్ట్ర వ్యాప్త పథకానికి పునాది పడింది జిల్లాలోని కపిలేశ్వరపురం మండలం పడమర ఖండ్రికలోనే.
స్థానిక పంచాయతీ కార్యాలయం వద్ద 2006లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి పథకం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పథకం అమలులో భాగంగా గ్రామంలోని దళిత కుటుంబమైన నేల సౌధామణి ఇంటి నిర్మాణ పనులకు వైఎస్సార్ కొబ్బరికాయ కొట్టారు. ఈ పర్యటనలో ఆయన ప్రజలతో మమేకమయ్యారు. ఆ చిరునవ్వు నేటికీ గ్రామంలో చెక్కు చెదరలేదు. ప్రజల గుండెలోతుల్లో ఇమిడిన ఆయన నడవడిక తీపి గుర్తులను ప్రజలు మననం చేసుకుంటున్నారు. పేదలకు ఎన్నటికీ సాధ్యం కావనుకున్న విద్య, వైద్య సదుపాయాలను కల్పిస్తూ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డికే చెల్లిందంటున్నారు.
ఆయనే స్వయంగా కొబ్బరికాయ కొట్టారు
వైస్ రాజశేఖర్‌రెడ్డిగారు పడమర ఖండ్రికలో ఇందిరమ్మ పథకాలను ప్రారంభించేందుకు వచ్చినప్పుడు గృహ నిర్మాణ పథకం పనులను మా ఇంటితోనే ప్రారంభించారు. ఆయన మీ వైఎస్సార్ ఇంటి నిర్మాణ పనులను ప్రారంభించేందుకు మీ ఇంటికి వస్తారమ్మా అన్నప్పుడు పెద్దొళ్లు మనింటికేం వస్తారులే అనుకున్నాను. ఆ రోజు ఆయన ఎంతో ఆప్యాయతగా వచ్చి కొబ్బరికాయ కొట్టారు. నేను మా పిల్లలు ఆశ్చర్యపోయాం. నవ్వుతూ ఎంతో ఆప్యాయతతో పలకరించారు. ఆయన పుణ్యమా అని ఇల్లు కట్టుకోగలిగాం. నాలాంటి వాళ్లెందరికో మేలు చేసిన గొప్పాయన ఆయన.
– నేల సౌదామణి, పడమర ఖండ్రిక
Comments
Please login to add a commentAdd a comment