తూర్పు గోదావరి (కొవ్వూరు) : ఈ యువకుడి పేరు పిల్లి శివరామకృష్ణ. ఊరు కొవ్వూరు. చదివింది బీటెక్. చైన్నె, ముంబయి వంటి ప్రాంతాల్లో బుల్లెట్ బండిపై మొబైల్ బార్భీక్యూ చికెన్ దుకాణాన్ని అతను చూశాడు. అనుకున్నదే తడవుగా బుల్లెట్ కొనుగోలు చేశాడు. రూ.3 లక్షలు వెచ్చించి బుల్లెట్‌కు బార్భీక్యూ అమర్చాడు. వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి విక్రయిస్తున్నాడు. బుల్లెట్‌కు వివిధ రకాల లైట్లు అమర్చడంతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కొవ్వూరు పట్టణంలో కొత్తరకంగా వ్యాపారం ప్రారంభించడంతో స్థానికులను సైతం ఆకట్టుకుంటున్నారు.
కలర్స్, ఆయిల్స్, టెస్టింగ్ సాల్ట్, కార్న్ ఫ్లోర్, మైదా వంటివి వాడకుండానే వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేయడంతో పట్టణ వాసులు క్యూ కడుతున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద దీనిని రోడ్డు మార్జిన్‌లో గురువారం ప్రారంభించారు. ఈ నోట ఆ నోట విని ఈ వెరైటీ ఫుడ్ తినడానికి మాంసాహార ప్రియులు క్యూ కడుతున్నారు. ఇలా బుల్లెట్‌కు అన్నీ అమర్చుకోవడం ద్వారా వ్యాపారానికి అనువుగా ఉన్న ప్రాంతాలకు మార్చుకోవచ్చని శివ అంటున్నారు. అంతేకాకుండా విందు భోజనాలకు సైతం వివిధ రకాల చికెన్ ఐటెమ్స్ తయారు చేసి సరఫరా చేస్తానని చెబుతున్నారు.
తాను 2013లో బీటెక్ పూర్తి చేసిన అనంతరం హైదరాబాద్‌లో వింగ్స్ అండ్ ఫ్రైస్ రెస్టారెంట్‌లో మూడేళ్లు మేనేజర్‌గా పనిచేశానని చెప్పారు. డోమినో పిజ్జా రాజమహేంద్రవరం, హైదరాబాద్‌లో రెండేళ్ల పాటు పనిచేశానన్నారు. అనంతరం ప్రశాంత్ కిషోర్ టీములో కొన్నాళ్లు పనిచేశానని శివ చెబుతున్నారు. తనకు హోటల్ రంగంతో ఉన్న అనుబంధంలో ఈ వ్యాపారం ప్రారంభించినట్టు వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment