మహానేత వైఎస్సార్ కంటి చూపుతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి పాలించారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు.
పొదలకూరు, న్యూస్‌లైన్ : మహానేత వైఎస్సార్ కంటి చూపుతో రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి పాలించారని వైఎస్సార్‌సీపీ సీఈసీ సభ్యుడు, సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గడపగడపకూ సమైక్యదీవెన యాత్రను గురువారం పొదలకూరు మండలం లింగంపల్లిలో కొనసాగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ మరణానంతరం రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే నాయకుడు కరువయ్యారన్నారు. అభివృద్ధి ఒకవైపు, సంక్షేమ పథకాలు మరోవైపు కొనసాగించి జనరంజకంగా పాలించిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచి పాలించే సత్తా వైఎస్సార్ తర్వాత ఆయన తనయుడు జగన్‌కే ఉందన్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని దీవిస్తే ఆయన రాష్ట్రాన్ని ముక్కలు కాకుండా కాపాడుతారన్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు ఇచ్చిన లేఖవల్లే తెలంగాణ విభజన ప్రక్రియ కొనసాగుతోందన్నారు. బాబులాంటి నాయకుడ్ని ప్రజల్లో తిరగనీయకుండా జాగ్రత్త పడాలని పిలుపునిచ్చారు. ఓట్లు వేయించుకుని ప్రజలకు కనిపించకుండా తిరిగే నాయకులకు తనను విమర్శించే అర్హత లేదన్నారు.
ప్రజలతో ఓట్లు వేయించుకుని తాను కాంట్రాక్టు పనులు చేయడం లేదని పరోక్షంగా సర్వేపల్లి ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. జగన్ ఆశీస్సులతో వైఎస్సార్‌సీపీ సర్వేపల్లి అభ్యర్థిగా తాను అసెంబ్లీ బరిలో నిలబడతానని ధైర్యంగా చెప్పగలనని, తన పార్టీని విమర్శించే వారు ఏ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగుతారో ప్రకటించాలన్నారు. అసమర్థ ముఖ్యమంత్రి వల్ల తెలంగాణ విభజన ప్రక్రియ వేగంగా సాగుతోందని విమర్శించారు. కండలేరు జలాలను చిత్తూరు జిల్లాకు తరలించేందుకు రూ.2600 కోట్లు నిధులను వెచ్చించేందుకు సీఎం, జిల్లా మంత్రి కూడబలుక్కున్నట్టు ఆరోపించారు.
కాకాణి వెంట వైఎస్సార్‌సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోనం బ్రహ్మయ్య, పేర్నేటి శ్యాంప్రసాద్‌రెడ్డి, బిరదోలు శ్రీకాంత్‌రెడ్డి, పార్టీ మండల కన్వీనర్ పెదమల్లు రమణారెడ్డి, పొదలకూరు సర్పంచ్ తెనాలి నిర్మలమ్మ, లింగంపల్లి నాయకులు ఎ.వెంకటరమణారెడ్డి, సుందరరామిరెడ్డి, పొదలకూరు నాయకులు వాకాటి శ్రీనివాసులురెడ్డి, వూకోటి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.