
రాష్ట్ర సమైక్యతకు గుర్తు వైఎస్ఆర్: ప్రవీణ్ కుమార్
హైదరాబాద్: రాష్ట్ర సమైక్యతకు గుర్తు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రవీణ్ కుమార్ రెడ్డి కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. అన్ని ప్రాంతాలకు అభివృద్ధి ఫలాలను అందించి, ఉద్యమాలు రాకుండా వైఎస్ చూశారన్నారు. ఈ రోజు రాష్ట్రం సమైక్యంగా ఉందంటే దానికి ప్రధాన కారణం వైఎస్ఆరే అని అన్నారు.
టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు అరాచకాలతోనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని విమర్శించారు. రాష్ట్రాన్ని చీల్చమని ఆరుసార్లు అడిగిన బాబు వైఎస్ రాజశేఖర రెడ్డిపై అబాండాలు వేస్తున్నారన్నారు. ఆనాడు ప్రణబ్ ముఖర్జీ కమిటీకి రాష్ట్రాన్ని విభజించమని ఒక లేఖ ఇచ్చారు. ఆ తరువాత మరో లేఖ ఇచ్చారు. 2012లో ఎవరూ అడగకపోయినా రాష్ట్రాన్ని విడగొట్టమని అడిగారు. తెలుగుజాతి ఆత్మగౌరవానికి భంగం కలిగించే విధంగా సోనియాతో బాబు భాగస్వాములైన మాట వాస్తవం కాదా? అని అడిగారు.
ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బస్సు యాత్ర పేరుతో ప్రజలలోకి వెళుతున్నారని ప్రశ్నించారు. తెలుగు జాతిని నిట్టనిలువునా నరకమని చెప్పింది చంద్రబాబు అని మండిపడ్డారు. తెలుగుజాతి విధ్వంసం యాత్ర చేయాలి, తెలుగు ప్రజలకు వెన్నుపోటు పొడిచిన యాత్ర చేయాలన్నారు. తెలుగు జాతికి క్షమాపణలు చెప్పడానికి ఆయన బస్సుయాత్ర చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంటుందని తెలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాజీనామాలు చేశారు. అప్పుడే టిడిపి వారు రాజీనామాలు చేయకుండా, ఇప్పుడు నాటకాలు అడుతున్నారని విమర్శించారు.
చెట్టును నరికినవారికి ఉరిశిక్ష విధించాలని నిన్న ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారని, తెలుగు జాతిని అడ్డంగా నరకడానికి ప్రయత్నిస్తున్న సోనియా గాంధీకి ఏ శిక్ష విధించాలో సిఎం చెప్పాలన్నారు.