ఇంటింటా కంటి వెలుగు | YSR Kanti Velugu Scheme Will Start At Prakasam Today | Sakshi
Sakshi News home page

ఇంటింటా కంటి వెలుగు

Published Thu, Oct 10 2019 9:51 AM | Last Updated on Thu, Oct 10 2019 12:01 PM

YSR Kanti Velugu Scheme Will Start At Prakasam Today - Sakshi

అధికారులతో చర్చిస్తున్న విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌

సాక్షి, ఒంగోలు: ‘వైఎస్సార్‌ కంటి వెలుగు’ పథకం కింద ఒకటి నుంచి పదవ తరగతి విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు యంత్రాంగం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. గురువారం నుంచి 16వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో 4,80,405 మందికి పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా 4402 ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులందరికీ కంటి పరీక్షలు నిర్వహించనున్నారు. ఇందుకోసం 911 బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు, ఒక ఆరోగ్య కార్యకర్త, ఒక ఆశ కార్యకర్త ఉంటారు. రోజుకు 100 నుంచి 150 మందికి పరీక్షలు నిర్వహించే విధంగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. 

ప్రతి విద్యార్ధికి ఒక కార్డు..
వైఎస్సార్‌ కంటి వెలుగులో భాగంగా ప్రతి విద్యార్థికి ఒక కార్డు ఇవ్వనున్నారు. ఆ కార్డులో విద్యార్థి పేరు, ఆధార్‌కార్డు నంబర్, తల్లిదండ్రుల పేర్లు, పాఠశాల పేరు ఉంటాయి. విద్యార్థికి కంటి పరీక్ష నిర్వహించిన అనంతరం ఎలాంటి సమస్య ఉందో ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. నార్మల్, అబ్‌ నార్మల్, కంటి చూపు సమస్య ఉంటే ఆ వివరాలను కార్డులో నమోదు చేస్తారు. కంటి చూపు సమస్యతో విద్యార్థులు బాధపడుతుంటే తదుపరి స్టేజీకి సంబంధించి రిఫర్‌ చేసే వివరాలను కూడా ఆ కార్డులో నమోదు చేయాల్సి ఉంటుంది. మొదటి దశలో కంటి పరీక్షలు నిర్వహిస్తారు. రెండవ దశలో మరింత సూక్ష్మంగా కంటి పరీక్షలు నిర్వహించి కళ్ల జోళ్లు అవసరమైన వారికి వాటిని అందిస్తారు. ఒకవేళ శస్త్ర చికిత్సలు అవసరమైతే అలాంటి వారిని ఆసుపత్రికి సిఫార్సు చేస్తారు. 

ఉపాధ్యాయుని సంతకం తప్పనిసరి..
కంటి పరీక్షలు నిర్వహించేందుకు వీలుగా ప్రతి విద్యార్థికి ఒక కార్డును సిద్ధం చేశారు. పాఠశాలల వారీగా విద్యార్థులకు కార్డులను అందించనున్నారు. పరీక్ష వివరాలను నమోదు చేసిన ప్రతిసారీ ఆ కార్డుపై సంబంధిత వి«ధులు నిర్వర్తిస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు తప్పనిసరిగా సంతకం చేయాలి. 

ఉపాధ్యాయులకు టీఏ..
వైఎస్సార్‌ కంటి వెలుగు కింద విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించేందుకు నియమితులైన ఉపాధ్యాయులకు టీఏ అందించనున్నారు. ఒక పాఠశాల నుంచి ఇంకో పాఠశాలకు ఎంపిక చేసిన ఉపాధ్యాయులు వెళ్లి కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కానుండటంతో వారికి టీఏ ఇవ్వనున్నట్లు జిల్లా కలెక్టర్‌ పోల భాస్కర్‌ వెల్లడించారు. 

ఒంగోలులో బాలినేని, వైపాలెంలో సురేష్‌...
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో ప్రారంభించనున్నారు. రాష్ట్ర విద్యుత్, అటవీ శాఖామంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఒంగోలులోని రాంనగర్‌ నగరపాలక సంస్థ ఉన్నత పాఠశాలలో ఉదయం తొమ్మిది గంటలకు ప్రారంభిస్తుండగా, రాష్ట్ర విద్యా శాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ యర్రగొండపాలెం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ప్రారంభించనున్నారు.

ఇంటింటా కంటి వెలుగు సీఎం జగన్‌ ధ్యేయం : విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్‌
యర్రగొండపాలెం: డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం ద్వారా రాష్ట్ర ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఇంటింటా కంటి వెలుగు ను నింపాలన్న బృహత్తర ఆలోచనతో ఉన్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్‌ ఆది మూలపు సురేష్‌ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డాక్టర్‌ వైఎస్సార్‌ కంటి వెలుగు కార్యక్రమం గురువారం ప్రారంభం కానున్న సందర్భంగా ఆయన యర్రగొండపాలెంలోని స్వగృహంలో బుధవారం సంబంధిత డాక్టర్లు, విద్యాశాఖాధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థికి పరీక్షలు నిర్వహించాలని, ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందన్నారు. చిన్న పిల్లలు కావడం వలన విజన్‌ సక్రమంగా చెప్పలేక పోవచ్చని, వారిని ముందుగా అవగాహన పరచి విజన్‌ను తీయాలని ఆయన ఆదేశించారు. పరీక్షలు అనంతరం అవసరం ఉన్నవారికి మందులు, కంటి అద్దాలు ప్రభుత్వం ఉచితంగా అందచేస్తుందని, మరింతగా కంటి సమస్యలతో బాధపడే విద్యార్థులకు తదుపరి దశలో సమగ్ర కంటి పరీక్షలు నిర్వహించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించే సమయంలో డాక్టర్లకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు, ఆశా వర్కర్లు సహకరించాలని ఆయన ఆదేశించారు.

హెచ్‌ఎంలు హాజరు కావాలి..
స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆడిటోరియంలో గురువారం ఉదయం 10.30 గంటలకు మంత్రి ఆదిమూలపు సురేష్‌ కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని శ్రీశైలం ఐటీడీఏ డీఎంహెచ్‌ఓ డాక్టర్‌ ఎం.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆయా పాఠశాలల హెడ్మాష్టర్లు విద్యార్థులను సమన్వయపరచుకొని కార్యక్రమానికి హాజరు కావాలని ఆయన కోరారు. సమావేశంలో సర్వశిక్ష అభియాన్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ ఎం.వెంకటేశ్వరరావు, తహశీల్దార్‌ కె.నెహ్రూబాబు, ఎంఈఓ పి.ఆంజనేయులు, పాలుట్ల, వెంకటాద్రిపాలెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అధికారులు డాక్టర్‌ చంద్రశేఖర్, డాక్టర్‌ సురేష్, ఎంఆర్‌ఐ వీరయ్యలు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement