సాక్షి ప్రతినిధి, ఒంగోలు: పెరిగిన జూన్ నెల వైఎస్సార్ పెన్షన్ కానుకను (పెన్షన్ మొత్తాన్ని ) దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి రోజైన జూలై నెల 8వ తేదీ నుంచి పంపిణీ చేయనున్నట్లు జగన్ సర్కార్ ప్రకటించింది. గతంలో ప్రతినెలా 1వ తేదీ నుంచి వారం రోజులపాటు ప్రభుత్వం పెన్షన్ మొత్తాన్ని పంపిణీ చేసేది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వైఎస్ జగన్ సీఎం అయ్యాక మేనెల పెన్షన్ జూన్ 1 న పంపిణీ చేశారు. అయితే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన మేరకు పెన్షన్ మొత్తాన్ని భారీగా పెంచుతూ సీఎం వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ప్రభుత్వం 30–05–2019 న జీఓ నంబర్ 103 ను విడుదల చేసింది. పెరిగిన పెన్షన్ మొత్తాన్ని దివంగత వైఎస్ జయంతి రోజైన జూలై 8వ తేదీ నుంచి పెన్షన్‌దారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు జగన్ సర్కార్ శుక్రవారం డీఆర్‌డీఏ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో జూలై 8 నుంచి పెన్షన్ల పంపిణీకి అధికారులు సన్నద్ధమవుతున్నారు. జిల్లా వ్యాప్తంగా అన్ని రకాల పెన్షన్లు 3,80,490 ఉండగా వీరికి రూ.92,18,24,250 మొత్తాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. గతంలో ఇదే పెన్షన్‌దారులకు రూ.81,75,69,000 మాత్రమే ఇవ్వగా ఇప్పుడు పెరిగిన పెన్షన్ ప్రకారం జిల్లాకు అదనంగా రూ.10.42 కోట్లు వస్తోంది. సీఎం వైఎస్ జగన్ ఎన్నికల్లో మాట ఇచ్చిన మేరకు హామీని నిలబెట్టుకోవడంతో పెన్షన్‌దారుల్లో ఆనందం వెల్లివిరుస్తోంది. పెరిగిన పెన్షన్ మొత్తం జూలై 8న వైఎస్సార్ జయంతి నాడు అందరికీ అందనుంది.
జిల్లాలో పెన్షన్‌దారుల వివరాలు:
అభయహస్తం పెన్షన్లు 4586, డప్పు కళాకారులు 3101, వికలాంగులు 39,298, మత్స్యకార పెన్షన్లు 3449, వృద్దాప్య పెన్షన్లు 1,75,574, ఒంటరి మహిళ 8524, కల్లు గీత కార్మికులు 379, చర్మకారులు 3212,ట్రాన్స్‌జెండర్ 100, చేనేత 8821, వితంతు పెన్షన్లు 1,32,996 డయాలసిస్ వారు 450 మంది ఉన్నారు.
పండుగలా పెన్షన్ల పంపిణీ:
పెరిగిన పెన్షన్ల మొత్తాన్ని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, వార్డుల్లో పండుగ వాతావరణంలో పంపిణీ చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పెన్షన్ల పంపిణీకి అధికారులు సర్వం సిద్ధం చేశారు. ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల పేర్లను ఆయా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో నోటీసు బోర్డుల్లో ఉంచాలి. పెన్షన్ పంపిణీ కేంద్రాల్లో పెన్షన్ లకు సంబంధించిన ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలి. పెన్షన్‌దారులకు కొత్తగా వైఎస్సార్ పెన్షన్ కానుక పాస్ బుక్కుల ను అందించాలి. పెరిగిన పెన్షన్ మొత్తం వివరాలను మండల పరిషత్ అధికారులు, మున్సిపల్ అధికారులు విస్తృతంగా ప్రచారం చేయాలి. అందుకు సంబంధించి పోస్టర్, బ్యానర్లు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాలు, వార్డులు, గ్రామ పంచాయతీ కార్యాలయాలతో పాటుగా జనసంచారం ఉండే కూడళ్లలో సైతం ఏర్పాటు చేయాలి.
పెరిగిన పెన్షన్ ఇలా..
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు సీఎం అయిన మరుక్షణమే వైఎస్ జగన్ అన్ని రకాల పెన్షన్ల మొత్తాన్ని భారీగా పెంచారు. ప్రధానంగా వృద్ధులు, వితంతువులు, కల్లు గీత కార్మికులు, చేనేత కార్మికులు, ఒంటరి మహిళలు, మత్స్యకారులు, చర్మకారులు, హెచ్‌ఐవీ బాధితులకు ఇచ్చే పెన్షన్ మొత్తాన్ని రూ.2 వేల నుంచి రూ.2,250 కి పెంచుతూ జీఓ నంబన్ 103ని విడుదల చేశారు. అలాగే వికలాంగులకు రూ.3 వేలు, డయాలసిస్ పేషెంట్లకు ఇచ్చే మొత్తాన్ని రూ.3500 నుంచి రూ.10 వేలకు పెంచారు.
జూలై 8 న పెన్షన్ మొత్తం బ్యాంకుల వారీ విడుదల వివరాలు:
ఆంధ్రాబ్యాంకు 13 బ్రాంచీల పరిధిలో రూ.20,50,38,000, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు పరిధిలో రూ.84,46,750, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,52,25,500, కెనరా బ్యాంక్ నుంచి రూ.1,78,65,000, కార్పొరేషన్ బ్యాంక్ నుంచి రూ.1,43,81,000, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి రూ.76,53,250, స్టేట్ బ్యాంక్ ఆప్ ఇండియా పరిధిలోని 36 బ్రాంచిల నుంచి రూ.49,97,48,750, సిండికేట్ బ్యాంక్ పరిధిలోని 9 బ్రాంచ్‌ల నుంచి రూ.14,01,03,000, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి రూ.1,33,63,000 లు మొత్తం పై బ్యాంకుల కు సంబంధించి 64 బ్రాంచీల పరిధిలో మొత్తం రూ.92,18,24,250 పెన్షన్‌దారులకు ఇవ్వనున్నారు.
కొండంత భరోసా..!
Published Sat, Jun 29 2019 12:55 PM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment