కరోనా విలయతాండవంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైంది. అన్ని రంగాలపైనా ప్రభావం పడింది. దాదాపు రెండున్నర నెలలుగా లాక్‌డౌన్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో సంక్షేమ పథకాల అమలు రాష్ట్ర ప్రభుత్వానికి కష్టంగా మారుతుందని అందరూ భావించారు. కానీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హామీలు నెరవేర్చడంలో వెనక్కు తగ్గడం లేదు. అందులో భాగంగానే ‘వైఎస్సార్ వాహన మిత్ర’ పథకం ద్వారా రెండోవిడతగా ఆటోవాలాలకు అండగా నిలిచేందుకు నిర్ణయించారు.
అనంతపురం సెంట్రల్: బతుకుదెరువు కోసం ఆటోలు, మ్యాక్సీలు నడుపుకుంటున్న డ్రైవర్లకు అండగా ఉంటానని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో హామీ ఇచ్చారు. ఆ మాట ప్రకారం వారికి ఏడాదికి రూ. 10 వేల ఆర్థిక సాయం అందజేయడం ద్వారా అండగా నిలుస్తున్నారు. జిల్లాలో గతేడాది 11,346 మందికి లబ్ధి చేకూరింది. నేరుగా వారి ఖాతాల్లో డబ్బు జమ చేశారు. రెండో విడత కార్యక్రమానికి గురువారం శ్రీకారం చుడుతున్నారు. ప్రస్తుత సమయంలో గతంలో ఎంపిక చేసిన లబ్ధిదారులకు డబ్బులు అందజేయడమే గగనం అనుకున్నారు. కానీ, అర్హులైన లబ్ధిదారులందరికీ ఇవ్వాలనే ఉద్దేశంతో కొత్తగా దరఖాస్తులు స్వీకరించారు. అర్హులను గుర్తించారు. ఈ ఏడాది మొత్తం 12,103 మంది ఆటో, మ్యాక్సీ డ్రైవర్లు రూ. 10 వేల ఆర్థికసాయం అందుకోనున్నారు. గురువారం సాయంత్రానికి దాదాపు అందరి ఖాతాల్లో నగదు జమ కానుంది.
లాంఛనంగా ప్రారంభించనున్న సీఎం
సచివాలయం నుంచి ముఖ్యమంత్రి ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాప్రతినిధులు, అధికారులు, లబ్ధిదారులతో సీఎం ముఖాముఖి మాట్లాడనున్నారు. దీనికి సంబంధించి రోడ్డు రవాణాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం ఉదయం 10.30 గంటలకు కార్యక్రమం ప్రారంభవుతుందని అధికారులు తెలిపారు. కలెక్టరేట్‌లోని వీసీ కార్యాలయంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, కలెక్టర్, లబ్ధిదారులు పాల్గొనున్నారని వారు వెల్లడించారు.
చాలా సంతోషంగా ఉంది
గతేడాది రూ. 10 వేల ఆర్థిక సాయం అందుకున్నా. ప్రస్తుతం మళ్లీ రూ. 10 వేలు ఆర్థిక సాయం ముఖ్యమంత్రి మంజూరు చేస్తున్నారు. నిరుపేదలైన ఆటో డ్రైవర్లకు ఈ మొత్తం ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా కారణంగా రెండు న్నర నెలలుగా బాడుగలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. ముఖ్యమంత్రికి ఆటో డ్రైవర్ల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. – సాకే శ్రీనివాసులు, ఆటో డ్రైవర్, రాప్తాడు
బృహత్తర కార్యక్రమమిది
ఏ రాష్ట్రంలోనూ ప్రత్యేకంగా ఆటో, మ్యాక్సీ డ్రైవర్ల సంక్షేమం కోసం పథకాలు అమలు చేస్తున్న దాఖలాలు లేవు. కానీ మన రాష్ట్రంలో ప్రతి ఏటా రూ. 10 వేలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అర్హులందరికీ రూ. 10 వేలు అందేలా చర్యలు తీసుకున్నాం. రెండో విడత కార్యక్రమాన్ని గురువారం సీఎం లాంఛనంగా ప్రారంభిస్తున్నారు. ఇంకొన్ని గంటల వ్యవధిలోనే లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుంది.– శివరామప్రసాద్, ఉపరవాణా కమిషనర్
Comments
Please login to add a commentAdd a comment